శుభకార్యానికి వెళుతుండగా ఎదురొచ్చిన మృత్యువు
ABN , Publish Date - Jun 29 , 2026 | 04:31 AM
శుభకార్యానికి వెళుతున్న ఆ కుటుంబాన్ని మృత్యువు కబలించింది. ముందువెళ్తున్న కారు ను ఓ వాహనం ఢీకొట్టడంతో ఆ కారు అదుపుతప్పి....
డివైడర్‌ను దాటి 2 కార్లను ఢీకొన్న కారు.. ఇద్దరి మృతి, 8మందికి గాయాలు
చిట్యాలరూరల్, జూన్ 28 (ఆంధ్రజ్యోతి): శుభకార్యానికి వెళుతున్న ఆ కుటుంబాన్ని మృత్యువు కబలించింది. ముందువెళ్తున్న కారు ను ఓ వాహనం ఢీకొట్టడంతో ఆ కారు అదుపుతప్పి డివైడర్‌ను దాటి అవతలి పైపు నుంచి వస్తున్న మరో రెండు కార్లను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మృతిచెందగా, 8 మంది తీవ్రంగా గాయపడ్డారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలం గుండ్రాంపల్లి శివారులో 65వ జాతీయ రహదారిపై ఆదివారం మధ్యాహ్నం ఈ ప్రమాదం జరిగింది. నార్కట్‌పల్లి మండలం అక్కెనపల్లికి చెందిన ఆరుగురు బంధువులు హైదరాబాద్‌లో ఓ శుభకార్యానికి వెళ్తుండగా ఈ ఘటన జరిగింది. క్షతగాత్రులను చౌటుప్పల్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వారిలో కసిరెడ్డి దేవేందర్‌రెడ్డి (52), దేప సరిత (48) చికిత్స పొందుతూ మృతి చెందారు. మరో 8 మందిని హైదరాబాద్‌లోని ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనతో విజయవాడ- హైదరాబాద్ మార్గంలో 4 కి.మీ. మేర వాహనాలు నిలిచిపోయాయి.