Share News

మంజీరా నదిలో పడి ఇద్దరి మృతి

ABN , Publish Date - Jun 01 , 2026 | 05:18 AM

మంజీర నదిలో పడి ఇద్దరు బావబామ్మర్దులు మృతి చెందారు. నీటిలో మునిగిపోతున్న తన బావను కాపాడబోయి బావమరిది కూడా ప్రాణాలు కోల్పోయాడు.

మంజీరా నదిలో పడి ఇద్దరి మృతి

  • బావను కాపాడేందుకు వెళ్లి ప్రాణాలు కోల్పోయిన బావమరిది

  • నిజామాబాద్‌ జిల్లా పోతంగల్‌లో విషాదం

కోటగిరి, మే 31 (ఆంధ్రజ్యోతి): మంజీర నదిలో పడి ఇద్దరు బావబామ్మర్దులు మృతి చెందారు. నీటిలో మునిగిపోతున్న తన బావను కాపాడబోయి బావమరిది కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాద ఘటన నిజామాబాద్‌ జిల్లా పోతంగల్‌ పట్టణంలో జరిగింది. రెంజల్‌ మండలం బోర్గాం గ్రామానికి చెందిన గంగారాం (50) రెండు రోజుల క్రితం పోతంగల్‌లో ఉంటున్న తన బావమరిది గంగొండ (43) ఇంటికి వచ్చాడు. గంగొండ తన తనయుడు సంతోష్‌, బావ గంగారాంతో కలిసి తనకున్న గొర్రెలను మేపుకుంటూ ఆదివారం మంజీరా నది వైపు వెళ్లాడు. గొర్రెలకు నీటిని తాగించేందుకు బావబామ్మర్దులు ఇద్దరూ నదిలోకి దిగగా..గంగారాం నీటిలో మునిగిపోతూ ఉండడాన్ని గంగొండ గమనించాడు. గంగారానికి ఈత రాకపోవడంతో తన బావను కాపాడేందుకు గంగొండ ప్రయత్నించాడు. ఈ క్రమంలో ఇద్దరూ నీట మునిగి గల్లంతయ్యారు. ఒడ్డున ఉన్న గంగొండ తనయుడు సంతోష్‌ దీనిని గమనించి చుట్టుపక్కల వారికి సమాచారం అందించగా, వారు నదిలో గాలించి మృతదేహాలను వెలికితీశారు. ఈ సంఘటన రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సునీల్‌ తెలిపారు.

Updated Date - Jun 01 , 2026 | 05:18 AM