మైనర్ బాలికను పెళ్లాడిన ట్రాఫిక్ కానిస్టేబుల్
ABN , Publish Date - May 21 , 2026 | 03:52 AM
చట్టం పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండి.. బాల్య వివాహం నేరమని తెలిసినా ఓ కానిస్టేబుల్ అందుకు విరుద్ధంగా వ్యవహరించి మైనర్ బాలికను పెళ్లి చేసుకున్న ఘటన సూర్యాపేట జిల్లాలో .....
బాల్యవివాహల నిరోధక చట్టం కింద కేసు నమోదు
హుజూర్‌నగర్, మే 20 (ఆంధ్రజ్యోతి): చట్టం పట్ల పూర్తి అవగాహన కలిగి ఉండి.. బాల్య వివాహం నేరమని తెలిసినా ఓ కానిస్టేబుల్ అందుకు విరుద్ధంగా వ్యవహరించి మైనర్ బాలికను పెళ్లి చేసుకున్న ఘటన సూర్యాపేట జిల్లాలో బుధవారం వెలుగు చూసింది. హుజూర్‌నగర్ పట్టణం సీతారాంనగర్ కాలనీకి చెందిన నాయిని రాంబాబు- ఉమాదేవి దంపతుల రెండో కుమారుడు అనిల్‌కుమార్ యాదగిరిగుట్టలో ట్రాఫిక్ కానిస్టేబుల్(2019)గా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ నెల 9న అనిల్‌కుమార్‌కు సూర్యాపేట జిల్లా అనంతగిరికి చెందిన తమ సమీప బంధువుల కుమార్తెతో వివాహమైంది. అయితే, పెళ్లి కూతురు మైనర్ బాలిక అని స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఐసీడీఎస్ సూపర్‌వైజర్ సోమమ్మ రంగంలోకి దిగారు. అధికారుల విచారణలో బాలికకు ఇంకా వివాహ వయసు రాలేదని నిర్ధారణ కావడంతో ఈ నెల 19న హుజూర్‌నగర్ పోలీసులకు సమాచారమిచ్చారు. ఐసీడీఎస్ అధికారుల ఫిర్యాదు మేరకు కానిస్టేబుల్ అనిల్ కుమార్‌పై బాల్య వివాహాల నిరోధక చట్టం కింద కేసు నమోదుచేశామని ఎస్సై నరేష్ తెలిపారు. కౌన్సిలింగ్ నిమిత్తం బాలికను సూర్యాపేటలోని భరోసాసెంటర్‌కు పంపామని, కానిస్టేబుల్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామని వివరించారు.