Share News

ప్రీ ప్రింటెడ్‌ ఫారం-7పై సిట్‌ విచారణ జరపండి

ABN , Publish Date - Oct 06 , 2026 | 06:47 AM

అర్హులైన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించడం కోసం ప్రీ ప్రింటెడ్‌ ఫారం-7ను వినియోగించిన ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌కు టీపీసీసీ ఎన్నికల సంఘం సమన్వయ కమిటీ విజ్ఞప్తి చేసింది.

ప్రీ ప్రింటెడ్‌ ఫారం-7పై  సిట్‌ విచారణ జరపండి
TPCC chief

  • హైదరాబాద్‌ పోలీసు కమిషనర్‌కు టీపీసీసీ ఫిర్యాదు..

  • సీఈసీ జ్ఞానేశ్‌ రాజీనామా కోరుతూ టీపీసీసీ సేవాదళ్‌ సత్యాగ్రహ దీక్ష

హైదరాబాద్‌, అక్టోబరు 5 (ఆంధ్రజ్యోతి): అర్హులైన ఓటర్ల పేర్లను జాబితా నుంచి తొలగించడం కోసం ప్రీ ప్రింటెడ్‌ ఫారం-7ను వినియోగించిన ఘటనపై ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్‌) ఏర్పాటు చేసి విచారణ జరిపించాలని హైదరాబాద్‌ నగర పోలీసు కమిషనర్‌ సజ్జనార్‌కు టీపీసీసీ ఎన్నికల సంఘం సమన్వయ కమిటీ విజ్ఞప్తి చేసింది. కమిటీ చైర్మన్‌ రాజేశ్‌కుమార్‌ నేతృత్వంలో హైదరాబాద్‌, సికింద్రాబాద్‌, ఖైరతాబాద్‌ డీసీసీ అధ్యక్షులు సోమవారం ఈ మేరకు కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. ముషీరాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గంలోని పోలింగ్‌ బూత్‌ నంబర్‌ 210కి చెందిన బీజేపీ బీఎల్‌ఏ శివేగీ బాలచందర్‌.. కాంగ్రెస్‌ బీఎల్‌ఏ షార్ఫుద్దీన్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన సుమారు 31 మంది పేర్లపై ఫారం-7 దరఖాస్తులు సమర్పించినట్లు వారు తమ ఫిర్యాదులో ఆరోపించారు. ఆ దరఖాస్తులు ముందుగానే ప్రీ-ప్రింట్‌ లేదా ప్రీ-ఫిల్‌ చేసి సిద్ధం చేసినట్టు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. ఆ దరఖాస్తులను సంబంధిత వ్యక్తులే సమర్పించారా, వాటిపై వారి సంతకాలు ఉన్నాయా, వారి సమ్మతి ఉందా అనే అంశాలను దర్యాప్తు చేయాలని పోలీసులను కోరారు. ముషీరాబాద్‌తో పాటు బహదూర్‌పురా, గోషామహల్‌ నియోజకవర్గాల్లో కూడా ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. బహదూర్‌పురా నియోజకవర్గంలో అక్టోబర్‌ 1న ఇలాంటి ప్రీ-ప్రింటెడ్‌ ఫారం-7 దరఖాస్తులను గుర్తించినట్లు తెలిపారు. గోషామహల్‌ నియోజకవర్గంలో అక్టోబర్‌ 3న సుమారు 15 ప్రీ-ప్రింటెడ్‌ ఫారం-7 దరఖాస్తులను బీజేపీ బీఎల్‌ఏ ఒక పోలింగ్‌ బూత్‌కు చెందిన బీఎల్‌వోకు అందజేయడానికి ప్రయత్నించినట్లు ఆరోపించారు.


అయితే దరఖాస్తులపై సంబంధిత వ్యక్తుల సంతకాలు లేకపోవడంతో పాటు ఒకేసారి పెద్ద సంఖ్యలో దరఖాస్తులు రావడంతో బీఎల్‌వో వాటిని స్వీకరించలేదని ఫిర్యాదులో వివరించారు. ఇలా 2-3 రోజుల వ్యవధిలోనే మూడు నియోజకవర్గాల్లో ఒకే తరహా దరఖాస్తులు వెలుగులోకి రావడం వెనుక ఒకే మూలం, ఒకే డేటాబేస్‌ లేదా సమన్వయంతో పనిచేసే నెట్‌వర్క్‌ ఏమైనా ఉందా అనే అంశంపై దర్యాప్తు జరపాలని కోరారు. ‘‘ప్రీ-ప్రింటెడ్‌ దరఖాస్తులను ఎవరు తయారు చేశారు, ఎక్కడ ముద్రించారు, ఎవరికి పంపిణీ చేశారు, ఎవరి ఆదేశాల మేరకు సమర్పించారు, దరఖాస్తుల్లో ఉన్న వ్యక్తిగత ఎన్నికల సమాచారాన్ని ఎక్కడి నుంచి సేకరించారనే అంశాలను దర్యాప్తులో తేల్చాలి‘‘ అని కోరారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీ, సంబంధిత బీఎల్‌వోలు, ఏఈఆర్వో, ఈఆర్వోల వద్ద ఉన్న రికార్డులను పరిశీలించాలన్నారు.

పెద్ద ఎత్తున దరఖాస్తులు..

బీజేపీ తెలంగాణ రాష్ట్ర కార్యాలయం నుంచి పెద్ద సంఖ్యలో ప్రీ-ప్రింటెడ్‌ ఫారం-7 దరఖాస్తులు సిద్ధం చేసి అసెంబ్లీ ఇన్‌చార్జ్‌లు, అనంతరం స్థానిక బీఎల్‌ఏలకు పంపించారనే ఆరోపణలు ఉన్నాయని టీపీసీసీ నేతలు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు. బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌. రామచందర్‌ రావుకు ఈ వ్యవహారంపై ముందస్తు సమాచారం ఉందా అనే అంశంపై కూడా విచారణ జరపాలని కోరారు. కాగా.. కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ వెంటనే తన పదవికి రాజీనామా చేయాలన్న డిమాండ్‌తో టీపీసీసీ సేవాదళ్‌ ఆధ్వర్యంలో సోమవారం గాంధీభవన్‌లో ఒకరోజు సత్యాగ్రహ దీక్ష జరిగింది.

Updated Date - Oct 06 , 2026 | 06:51 AM