Share News

బీఆర్‌ఎస్‌ హయాంలో సింగరేణిలో అవకతవకలపై విచారణ జరగాలి

ABN , Publish Date - Jan 22 , 2026 | 05:11 AM

సింగరేణికి సంబంధించి బీఆర్‌ఎస్‌ హయాంలో జరిగిన అవకతవకలపై విచారణ జరగాల్సిన అవసరం ఉందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ గౌడ్‌ పేర్కొన్నారు.

బీఆర్‌ఎస్‌ హయాంలో సింగరేణిలో అవకతవకలపై విచారణ జరగాలి

  • టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ గౌడ్‌

హైదరాబాద్‌, నిజామాబాద్‌, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): సింగరేణికి సంబంధించి బీఆర్‌ఎస్‌ హయాంలో జరిగిన అవకతవకలపై విచారణ జరగాల్సిన అవసరం ఉందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ గౌడ్‌ పేర్కొన్నారు. గాంధీభవన్‌లో బుధవారం మీడియాతో ఆయన మాట్లాడుతూ.. సింగరేణి టెండర్లకు సంబంధించి ఆరోపణలు చేయడం కాదు.. దమ్ముంటే నిజానిజాలపై చర్చకు రావాలన్నారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రిగా ఈ వ్యవహారంపై విచారణకు ఆదేశించుకోవచ్చని కిషన్‌రెడ్డికి సూచించారు. కాగా నిజామాబాద్‌లోని జిల్లా కాంగ్రెస్‌ కార్యాలయంలో విలేకరులతో మహేశ్‌ గౌడ్‌ మాట్లాడుతూ.. ప్రస్తుత సింగరేణి టెండర్లు గత ప్రభుత్వ హయాంలో జరిగినవేనని, అప్పుడు చేసిన తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకే కేటీఆర్‌, హరీశ్‌రావులు కాంగ్రెస్‌ ప్రభుత్వంపై ఆరోపణలు చేస్తున్నారన్నారు. వీరిద్దరు చేస్తున్న ప్రతీ ఆరోపణలపై తాము చర్చలకు సిద్ధమన్నారు. ఇదిలా ఉండగా.. మునిసిపల్‌ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకోవాలని, నిజామాబాద్‌ పరిధిలోని అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లను క్లీన్‌ స్వీప్‌ చేయాలని ఆ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ నేతలకు మహేశ్‌గౌడ్‌, ఇంచార్జి మంత్రి ఉత్తమ్‌ సూచించారు. గాంధీభవన్‌లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ బీజేపీ, బీఆర్‌ఎస్‌ కుట్రలను తిప్పి కొట్టాలన్నారు. సర్పంచ్‌ ఎన్నికల్లో మంచి ఫలితాలను సాధించామని, ఇదే ఊపును మునిసిపల్‌ ఎన్నికల్లోనూ కొనసాగించాలన్నారు. కాగా, సింగరేణి టెండర్లలో ఫీల్డ్‌ విజిట్‌ నిబంధన తమ ప్రభుత్వమే తీసుకువచ్చినట్లుగా బీఆర్‌ఎస్‌ నేతలు మాట్లాడుతున్నారని, కానీ ఈ నిబంధన ఆ పార్టీ ప్రభుత్వ హయాం నుంచీ ఉందని టీపీసీసీ మీడియా కమిటీ చైర్మన్‌ సామా రామ్మోహన్‌రెడ్డి అన్నారు.

Updated Date - Jan 22 , 2026 | 05:11 AM