అందరూ పార్టీ కోసం పనిచేయాల్సిందే
ABN , Publish Date - May 25 , 2026 | 05:23 AM
పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతల మధ్య వివాదంపై ఆ జిల్లా నేతలతో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, తాను మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని టీపీసీసీ....
పాలకుర్తి నియోజకవర్గ నేతల వివాదంపై టీపీసీసీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ మల్లు రవి
హైదరాబాద్, మే 24 (ఆంధ్రజ్యోతి): పాలకుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ నేతల మధ్య వివాదంపై ఆ జిల్లా నేతలతో జిల్లా ఇన్‌చార్జ్ మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, తాను మాట్లాడి సమస్యను పరిష్కరిస్తామని టీపీసీసీ క్రమశిక్షణా చర్యల అమలు కమిటీ చైర్మన్ మల్లు రవి వెల్లడించారు. అంతిమంగా పార్టీ బలోపేతం కోసం అందరూ కలిసి పనిచేయాల్సిందేనని స్పష్టం చేశారు. పాలకుర్తి నేతల మధ్య వివాదంపై టీపీసీసీ క్రమశిక్షణా చర్యల కమిటీ ఆదివారం గాంధీభవన్‌లో భేటీ అయింది. అనంతరం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మల్లు రవి మాట్లాడుతూ.. పాలకుర్తి నియోజకవర్గ నేతలు హరిప్రసాద్, కృష్ణకిషోర్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నారంటూ నియోజకవర్గ ఎమ్మెల్యే యశస్వినీరెడ్డి, టీపీసీసీ ఉపాధ్యక్షురాలు ఝాన్సీరెడ్డి క్రమశిక్షణా చర్యల అమలు కమిటీకి ఫిర్యాదు చేశారన్నారు. అలాగే యశస్వినీరెడ్డి, ఝాన్సీరెడ్డిలు పార్టీ శ్రేణులను పట్టించుకోవట్లేదన్న ఫిర్యాదూ వచ్చిందన్నారు. కమిటీ.. ఇరు వర్గాలనూ పిలిచి మాట్లాడి ఆధారాలు, సమాచారం సేకరించిందన్నారు. ప్రస్తుతం యశస్వినీరెడ్డి విదేశాల్లో ఉన్నందున ఆమె వచ్చాక ఇద్దరూ కలిసి కమిటీ ముందు హాజరు కావాలని ఝాన్సీరెడ్డికి సూచించినట్లు తెలిపారు. ఈ నెల 30న ఈ అంశంపై కమిటీ భేటీ ఉంటుందన్నారు. కాగా, మాజీ మంత్రి జీవన్‌రెడ్డి బీఆర్‌ఎ్‌సలోకి వెళ్లాక కామెడీ విలన్ అల్లు రామలింగయ్యలా ఉంటాడనుకున్నామని, కానీ ఆయన ముత్యాలముగ్గు విలన్ రావుగోపాలరావులా తయారయ్యాడని ప్రభుత్వ విప్ అద్దంకి దయాకర్ ఎద్దేవా చేశారు. ఆయన బీఆర్‌ఎస్ ఆత్మను ఎక్కించుకుని పచ్చి అబద్ధాలాడుతున్నాడని దుయ్యబట్టారు. ఈ సీజన్‌లో ప్రభుత్వం ఇప్పటికే 50 లక్షల టన్నుల ధాన్యం రైతుల నుంచి కొనుగోలు చేసి రూ.7,840 కోట్లు ఇప్పటికే రైతులకు చెల్లించిందన్నారు. ధాన్యం కొనుగోలు వ్యవహారంలో బీఆర్‌ఎస్ కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించట్లేదని నిలదీశారు. దిగజారి.. గుడ్డిగా విమర్శలు చేయడం జీవన్‌రెడ్డికి తగదని ఓ ప్రకటనలో పేర్కొన్నారు.