TPCC Chief Mahesh Kumar Goud: భస్మాసురునికి సోదరుడు కేటీఆర్
ABN , Publish Date - Jan 05 , 2026 | 03:34 AM
భస్మాసురుని కజిన్ బ్రదర్ కేటీఆర్ అని, బంగారు తెలంగాణను భ్రష్టు పట్టించిన భస్మాసుర సైన్యం బీఆర్‌ఎస్ నాయకగణమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ దుయ్యబట్టారు...
తెలంగాణను భ్రష్టు పట్టించిందే బీఆర్‌ఎస్
టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్
హైదరాబాద్, జనవరి 4 (ఆంధ్రజ్యోతి): భస్మాసురుని కజిన్ బ్రదర్ కేటీఆర్ అని, బంగారు తెలంగాణను భ్రష్టు పట్టించిన భస్మాసుర సైన్యం బీఆర్‌ఎస్ నాయకగణమని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ దుయ్యబట్టారు. కేటీఆర్‌లో అహంకారం పరాకాష్టకు చేరుకుందన్నారు. నిరుద్యోగుల ఉసురు తగిలే బీఆర్‌ఎస్ పార్టీ ఈ దుస్థితికి చేరుకుందని ఆదివారం ఓ ప్రకటనలో విమర్శించారు. బీసీల పట్ల కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉందని, అందుకే 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ చట్టం చేసిందని చెప్పారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను అన్ని రంగాల్లో వెనుకబాటుకు గురిచేసిన బీఆర్‌ఎస్ నేతలను శిక్షించాల్సిన అవసరముందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ రెండేళ్ల ప్రజా పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో పురోగతి దిశగా సాగుతోందని తెలిపారు. అందుకే జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు, పంచాయతీ ఎన్నికల్లో పార్టీ భారీ విజయం సాధించిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు కేటీఆర్‌కు కనిపించట్లేదా అని నిలదీశారు. కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతికి పాల్పడి ప్రజలతో ఛీకొట్టించుకున్న బీఆర్‌ఎస్.. పాలమూరు-రంగారెడ్డిలో చేసిన బాగోతమూ బయటపడుతుందని చెప్పే అసెంబ్లీ నుంచి పారిపోయిందని మండిపడ్డారు. ఈ విషయాన్ని పక్కదోవ పట్టించేందుకే కేటీఆర్ చౌకబారు ప్రకటనలు చేస్తున్నారన్నారు. ముందుగా కవిత చేస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పి ఆ తర్వాత ఆయన కాంగ్రెస్ గురించి మాట్లాడాలన్నారు. ఎవరిని ఉరితీయాలో ప్రజలు ఇప్పటికే పలు ఎన్నికల్లో నిరూపించారని, అయినా మారకుంటే ఈసారి తరిమికొడతారని హెచ్చరించారు.
8న టీపీసీసీ విస్తృత సమావేశానికి సీఎం రేవంత్
ఈనెల 8న టీపీసీసీ విస్తృత సమావేశం గాంధీభవన్‌లో జరగనుంది. టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ అధ్యక్షతన జరగనున్న ఈ భేటీలో సీఎం రేవంత్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జ్ మీనాక్షి నటరాజన్, కార్యవర్గం, డీసీసీ అధ్యక్షులు పాల్గొంటారు. డీసీసీ అధ్యక్షులు, టీపీసీసీ ఉపాధ్యక్షులతో ఆదివారం జరిగిన జూమ్ మీటింగ్‌లో మహేశ్ గౌడ్ ఈ మేరకు వివరాలు వెల్లడించారు.