అసెంబ్లీ సాక్షిగా డ్రగ్స్ టెస్ట్ చేసుకుందామా?
ABN , Publish Date - Mar 16 , 2026 | 04:28 AM
ఈగల్ టీమ్ దాడిలో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి, ఆయనతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు కొకైన్ తీసుకుంటూ పట్టుబడినందుకు తలదించుకోవాల్సిన...
కేటీఆర్‌కు టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్ సవాల్
హైదరాబాద్, మార్చి 15(ఆంధ్రజ్యోతి): ‘ఈగల్ టీమ్ దాడిలో బీఆర్‌ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి, ఆయనతో పాటు పలువురు ప్రజా ప్రతినిధులు కొకైన్ తీసుకుంటూ పట్టుబడినందుకు తలదించుకోవాల్సిన ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్.. తిరిగి కాంగ్రె్‌సపైనే అభాండాలు వేస్తున్నాడు. రేపట్నుంచి అసెంబ్లీ సమావేశాలున్నాయి. శాసనసభ, మండలి సభ్యులం అందరమూ అసెంబ్లీ సాక్షిగా డ్రగ్స్ టెస్టు చేసుకుందామా?’ అంటూ కేటీఆర్‌కు టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్‌గౌడ్ సవాల్ విసిరారు. కేటీఆర్ బ్యాచ్ డ్రగ్స్‌కు అలవాటై అసాంఘిక చర్యలకు పాల్పడుతున్నారని, ఈ నేపథ్యంలో తమకు అనుమానాలు కలుగుతున్నాయన్నారు. అందుకే గతంలో టీపీసీసీ అధ్యక్షుడిగా రేవంత్‌రెడ్డి విసిరినట్లుగానే తానూ కేటీఆర్‌కు సవాల్ విసురుతున్నానని చెప్పారు. ఆదివారం గాంధీభవన్‌లో మహేశ్ గౌడ్ మీడియాతో మాట్లాడుతూ.. పదేళ్ల కేసీఆర్ పాలనలో తెలంగాణలో డ్రగ్స్ సరఫరరా యథేచ్చగా జరిగి యవతరం పాడైందన్నారు. తనలాంటి వారు కొడుకుల్ని జాగ్రత్తగా చూసుకోవాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో పెరిగిపోయిన డ్రగ్ కల్చర్‌కు అడ్డుకట్ట వేసేందుకే సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈగల్ టీమ్‌ను వేసిందన్నారు. ఈ క్రమంలోనే ఈగల్ టీమ్ దాడుల్లో రోహిత్‌రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు దొరికారని చెప్పారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో అయిన అలవాటును రోహిత్‌రెడ్డి మానుకోలేకపోతున్నాడని మండిపడ్డారు.