బీఆర్‌ఎస్ పునాదులను ప్రజలు పెకిలించారు
ABN , Publish Date - Mar 23 , 2026 | 06:34 AM
రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ఇక మనుగడ సాధించలేదని, ప్రజలు ఆ పార్టీని పునాదుల నుంచి పెకిలించారని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు
ఇక ఆ పార్టీ మనుగడ సాధించలేదు.. త్వరలోనే ఫెడరేషన్, కార్పొరేషన్ చైర్మన్ పదవుల భర్తీ: మహేశ్ గౌడ్
యాదాద్రి డీసీసీ కార్యవర్గ ప్రమాణ స్వీకార సభలో పాల్గొన్న టీపీసీసీ చీఫ్
యాదాద్రి/హైదరాబాద్, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బీఆర్‌ఎస్ ఇక మనుగడ సాధించలేదని, ప్రజలు ఆ పార్టీని పునాదుల నుంచి పెకిలించారని టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ వ్యాఖ్యానించారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌కు ప్రజలు కొన్ని సీట్లు ఇచ్చారని, పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం సున్నాకు తెచ్చారన్నారు. ఇటీవల సర్పంచ్ ఎన్నికల్లో కొన్ని స్థానాల్లో ఆ పార్టీ అభ్యర్థులు గెలిచారని, ఇప్పుడు ఏ ఎన్నికలు జరిగినా బీఆర్‌ఎస్‌కు గెలిచే పరిస్థితులు లేవని చెప్పారు. ఆదివారం భువనగిరిలో డీసీసీ జిల్లా అధ్యక్షుడు బీర్ల అయిలయ్య అధ్యక్షతన నిర్వహించిన డీసీసీ కార్యవర్గ ప్రమాణ స్వీకార సభలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ ఫలాలను ప్రజలు ఆస్వాదిస్తున్నారని, వచ్చే ఎన్నికల్లో మంచి ఫలితాలను అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని 119 అసెంబ్లీ స్థానాల్లో 100 సీట్లు, పునర్విభజన జరిగితే 160 స్థానాలకు 140 సీట్లు కాంగ్రెస్ గెలుచుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ కార్యకర్తలకు కొంత అసంతృప్తి ఉందని, అయితే కొన్ని కారణాల వల్ల నామినేటేడ్ పదవుల భర్తీలో కాలయాపన జరిగిందని చెప్పారు. త్వరలోనే ఫెడరేషన్, కార్పొరేషన్ చైర్మన్, డైరెక్టర్ పదవులను భర్తీ చేస్తామన్నారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసే ప్రతి నాయకుడికి న్యాయం చేసే బాధ్యత తనదని పేర్కొన్నారు. కాంగ్రెస్ అన్ని వర్గాలు, కులాలు, మతాలకు చెందిన పార్టీ అని, కష్టపడినవారికి పదవులు దక్కుతాయనడానికి తనతో పాటు వేదికపై ఉన్న ఎమ్మెల్యేలు, ఎంపీలే నిదర్శనమని వ్యాఖ్యానించారు. ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి చేపడుతున్న కార్యక్రమాలకు క్షేత్రస్థాయిలో పార్టీ కార్యకర్తలు అండగా ఉండి ప్రజల్లో ప్రచారం చేయాలన్నారు. మూసీ రివర్‌ఫ్రంట్ అభివృద్ధి కార్యక్రమం నల్లగొండ జిల్లా ప్రజలకు ఎంతో ముఖ్యమని.. ప్రాజెక్టు కొనసాగడానికి పిడికిలి బిగించాలని పిలుపునిచ్చారు.
జిల్లాల పర్యటనలో టీపీసీసీ చీఫ్
టీపీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ జిల్లాల పర్యటన చేపట్టారు. రాష్ట్రంలోని 36 డీసీసీలకు 14 డీసీసీలను ఆయన ఇటీవల నియమించిన సంగతి తెలిసిందే. జిల్లాల పర్యటనల్లో భాగంగా డీసీసీ కార్యవర్గం, పార్టీ ముఖ్య నాయకులతో సమావేశమై పార్టీ బలోపేతంపై దిశానిర్దేశం చేస్తారు. ఆదివారం యాదాద్రి భువనగిరి జిల్లాలో పర్యటించిన ఆయన.. బుధవారం మెదక్ జిల్లాలో పర్యటిస్తారు. అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో వీలును బట్టి మిగిలిన జిల్లాల పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌పై కసరత్తు జరుగుతోంది. కాగా, టీపీసీసీ ఓబీసీ సెల్ చైర్మన్‌గా సోమవారం గాంధీభవన్‌లో ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ బాధ్యతలు స్వీకరించనున్నారు.