Share News

Tourism Along Maredumilli Route: మేడారం దారిలో పర్యాటకం!

ABN , Publish Date - Jan 20 , 2026 | 02:51 AM

ములుగు జిల్లా మేడారంలో మహాజాతర జరిగే నాలుగు రోజుల్లో (ఈ నెల 28 నుంచి 31 వరకు) భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందనే భావనతో అనేకమంది ఆర్టీసీ బస్సులు....

Tourism Along Maredumilli Route: మేడారం దారిలో పర్యాటకం!

  • జాతర మార్గంలో ఎన్నో చారిత్రక ఆలయాలు, పురాతన కట్టడాలు

  • యాదగిరిగుట్ట నుంచి మల్లూరు హేమాచల లక్ష్మీనరసింహస్వామి వరకు అన్నీ ప్రత్యేకమే

  • 28 నుంచి 31 వరకు మేడారం మహాజాతర

హైదరాబాద్‌ సిటీ, జనవరి 19 (ఆంధ్రజ్యోతి):ములుగు జిల్లా మేడారంలో మహాజాతర జరిగే నాలుగు రోజుల్లో (ఈ నెల 28 నుంచి 31 వరకు) భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందనే భావనతో అనేకమంది ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్‌ వాహనాల్లో ఇప్పటికే వెళ్లి వస్తున్నారు. హైదరాబాద్‌లోని ఉప్పల్‌ మీదుగా ప్రైవేట్‌ వాహనాల్లో మేడారానికి వెళ్లే భక్తులు దారి పొడవునా ఉన్న చారిత్రక కట్టడాలు, ఆలయాలను వీక్షించే అవకాశం ఉంది. కనీసం రెండు, మూడు రోజులపాటు ప్రణాళికను రూపొందించుకుని వెళితే పలు ప్రాంతాలను సందర్శించవచ్చు. హైదరాబాద్‌ నుంచి సుమారు 278 కిలోమీటర్ల దూరంలో ఉన్న మేడారం దారిలోని సందర్శనీయ క్షేత్రాలను తెలుసుకుందాం.

1.jpg

తొలుత.. యాదగిరిగుట్ట

తొలుత యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరి శ్రీలక్ష్మీనర్సింహస్వామిని దర్శించుకోవచ్చు. తర్వాత 23 కిలోమీటర్ల దూరంలోని కొలనుపాకలోని 2 వేల ఏళ్ల నాటి జైన మందిరాన్ని కూడా సందర్శించవచ్చు. ఇందులో ఆదినాథుడు, మహావీరుడు, నేమినాఽథుడు లాంటి జైనదేవుళ్ల విగ్రహాలు ప్రధాన ఆకర్షణ.


3.jpg

వేయి స్తంభాల గుడి

హనుమకొండలోని వేయిస్తంభాల ఆలయాన్ని చూడవచ్చు. 11వ శతాబ్దంలో కాకతీయ వంశానికి చెందిన రుద్రదేవుడి చేత చాళుక్యుల శైలిలో ఆలయాన్ని నిర్మించారు. మహాశివరాత్రి, కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తులు భారీగా తరలివస్తారు. రుద్రేశ్వరస్వామిని భక్తిశ్రద్ధలతో కొలుస్తారు.

7.jpg

భద్రకాళి ఆలయం

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని ఆధ్యాత్మిక క్షేత్రాల్లో భద్రకాళి గుడి ప్రఖ్యాతిగాంచింది. ఈ గుడి వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రి సమీపంలో వరంగల్‌-హన్మకొండ ప్రధాన రహదారిపై పాలిటెక్నిక్‌ కాలేజీ నుంచి 1.5 కిలోమీటర్ల దూరంలో ఉంది. భద్రకాళీదేవీ విగ్రహం దాదాపు 9 అడుగుల ఎత్తు, 9 అడుగుల వెడల్పుతో ఉంటుంది. ఏటా ఇక్కడ జరిగే శాకంబరీ ఉత్సవాలకు భక్తులు లక్షలాదిగా తరలివస్తుంటారు.


2.jpg

రామప్ప గుడి

వేయిస్తంభాల గుడి, భద్రకాళి ఆలయ దర్శనం అనంతరం మధ్యలో కాసేపు సేదతీరవచ్చు. తర్వాత ములుగు జిల్లా వెంకటాపూర్‌ మండలం పాలంపేట దగ్గర ఉన్న రామప్ప గుడిని సందర్శించవచ్చు. ఇది కాకతీయ రాజులు నిర్మించిన చారిత్రక దేవాలయం. వరంగల్‌ పట్టణానికి 70 కి.మీ. దూరంలో ఉంది. ఇక్కడ ఇసుకపై ఆలయాన్ని నిర్మించారు. నీటిలో తేలియాడే ఇటుకలతో గోపురాన్ని నిర్మించారు. ఈ ఆలయానికి యునెస్కో గుర్తింపు లభించింది.

5.jpg

లక్నవరం సరస్సు.. తీగల వంతెన

రామప్ప గుడికి 22 కిలోమీటర్ల దూరంలోని లక్నవరం చెరువును సందర్శించవచ్చు. 1312లో ఓరుగల్లును పరిపాలించిన ప్రతాపరుద్రుడి చేతుల మీదుగా ఈ సరస్సు రూపుదిద్దుకుంది. ఎత్తయిన కొండల నడుమ నిర్మించిన సరస్సు నేటి ఆధునిక ఇంజనీరింగ్‌ పరిజ్ఞానాన్ని పోలి ఉంటుంది. కొన్నేళ్ల క్రితం సరస్సుపై నిర్మించిన వేలాడే తీగల వంతెన సందర్శకులను ఆకట్టుకుంటోంది.

6.jpg

హేమాచల లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం

ములుగు జిల్లా మంగపేట మండలం మల్లూరు గ్రామానికి 4 కిలోమీటర్ల దూరంలో ఏటూరునాగారం-భద్రాచలం ప్రధాన రహదారిని ఆనుకుని ఈ క్షేత్రం ఉంది. వరంగల్‌ నుంచి 130 కి.మీ., మేడారం నుంచి సుమారు 53 కి.మీ. దూరంలో ఉంది. ఈ హేమాచల క్షేత్రం ప్రకృతి వైద్యానికి, వనమూలికలకు పెట్టింది పేరు. నవనారసింహుల క్షేత్రాల్లో మొట్టమొదటిదిగా చెబుతుంటారు. స్వామివారి మూర్తి మానవ శరీరంలాగా మెత్తగా ఉంటుంది. స్వామివారి ఛాతీమీద రోమాలు కనిపిస్తుంటాయి. చింతామణి జలపాతం ఇక్కడ ప్రత్యేక ఆకర్షణ.

Updated Date - Jan 20 , 2026 | 02:51 AM