నిరంతర సాధనతోనే జర్మన్ భాషను నేర్చుకోవచ్చు
ABN , Publish Date - Jun 16 , 2026 | 04:50 AM
నిరంతర సాధనతోనే జర్మన్ భాషను నేర్చుకోవచ్చని, దీన్ని నేర్చుకునే అభ్యర్థులు క్రమశిక్షణతో ముందుకు సాగాలని కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి జి.వివేక్...
తద్వారా మంచి ఉపాధి అవకాశాలు : మంత్రి వివేక్
నిరంతర సాధనతోనే జర్మన్ భాషను నేర్చుకోవచ్చని, దీన్ని నేర్చుకునే అభ్యర్థులు క్రమశిక్షణతో ముందుకు సాగాలని కార్మిక, ఉపాధి కల్పన, గనుల శాఖ మంత్రి జి.వివేక్ వెంకటస్వామి సూచించారు. తద్వారా అంతర్జాతీయ స్థాయిలో ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని అన్నారు. ‘తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ(టామ్‌కామ్)’ కార్యాలయంలో జర్మన్ భాష నేర్చుకుంటున్న అభ్యర్థులు, అధ్యాపకులతో సోమవారం మంత్రి సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జర్మనీలో ఉద్యోగాలు పొందాలనే లక్ష్యంతో ఉన్న యువత కోసం టామ్‌కామ్ ఈ శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. భారత్‌లో నర్సింగ్, ఇంజినీరింగ్ తదితర రంగాల్లో ఉపాధి అవకాశాలు ఉన్నా... జర్మనీలో పని చేసేవారికి లభించే వేతనాలు అధికంగా ఉంటాయన్నారు. విదేశీ ఉపాధి అవకాశాలను పొందడంలో భాషా ప్రావీణ్యమే ప్రధాన అడ్డంకి అని, దానిని అధిగమించాల్సిన అవసరం ఉందన్నారు.