Share News

వీధి కుక్కల దాడిలో చిన్నారి మృతి

ABN , Publish Date - Apr 21 , 2026 | 04:41 AM

ఇటుక బట్టీ వద్ద ఆడుకుంటున్న ఓ చిన్నారిపై వీధికుక్కలు దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందింది. ఈ దారుణ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌...

వీధి కుక్కల దాడిలో చిన్నారి మృతి

  • ఒంటిపై 300కు పైగా గాయాలు

  • పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌లో ఘటన

సుల్తానాబాద్‌, ఏప్రిల్‌ 20 (ఆంధ్రజ్యోతి): ఇటుక బట్టీ వద్ద ఆడుకుంటున్న ఓ చిన్నారిపై వీధికుక్కలు దాడి చేయడంతో తీవ్ర గాయాలపాలై అక్కడికక్కడే మృతి చెందింది. ఈ దారుణ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్‌ మండలం కాట్నపల్లిలో సోమవారం చోటు చేసుకుంది. ఒడిశా రాష్ట్రానికి చెందిన బాబుర్‌ బెహార, సరస్వతి దంపతులు.. కాట్నపల్లిలో ఉన్న ఇటుక పరిశ్రమలో పనిచేసేందుకు ఏడాది క్రితం ఇక్కడకు వచ్చారు. వీరికి ముగ్గురు పిల్లలు కాగా, రెండో కూతురు దివ్య(3) బట్టీ వద్ద ఉన్న కార్మికుల నివాస ప్రాంతాల సమీపంలో ఆడుకుంటోంది. ఆ సమయంలో కుక్కలు ఒక్కసారిగా బాలికపై దాడి చేశాయి. వాటి నుంచి తప్పించుకునేందుకు ఆ చిన్నారి సమీప పొలాల్లోకి పరుగులు తీసినా వదల్లేదు. విచక్షణా రహితంగా దాడి చేయడంతో చిన్నారి తీవ్ర గాయాలపాలైంది. అయితే, బాలిక కనిపించక పోవడంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు సమీప ప్రాంతాల్లో గాలించారు. చివరకు పొలాల్లో తీవ్ర రక్తస్రావంతో పడి ఉన్న చిన్నారిని గుర్తించి వెంటనే సుల్తానాబాద్‌ ఆసుపత్రికి తరలించినప్పటికీ, అప్పటికే బాలిక మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఆమె శరీరంపై దాదాపు 300కు పైగా గాయాలున్నట్లు గుర్తించారు. చిన్నారి తల్లి బాలింత కావడంతో ఇంటికే పరిమితం అవడం, బట్టీ వద్ద కూడా కార్మికులు లేకపోవడంతో కుక్కల దాడిని ఎవరూ గమనించలేక పోయారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.

Updated Date - Apr 21 , 2026 | 04:41 AM