Share News

విజయవిహార్‌కు 63 వసంతాలు

ABN , Publish Date - Apr 10 , 2026 | 12:31 AM

ప్రపంచ పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్‌ హిల్‌కాలనీలో 1963 ఏప్రిల్‌ 10వ తేదీన విజయవిహార్‌ అతిథి గృహం ప్రారంభమైంది.

విజయవిహార్‌కు 63 వసంతాలు
విజయవిహార్‌ అతిథి గృహం

ఎందరో వీవీఐపీలకు ఆతిథ్యం

సినీ, రాజకీయ ప్రముఖుల బస

నాగార్జునసాగర్‌, ఏప్రిల్‌ 9(ఆంధ్రజ్యోతి): ప్రపంచ పర్యాటక కేంద్రం నాగార్జునసాగర్‌ హిల్‌కాలనీలో 1963 ఏప్రిల్‌ 10వ తేదీన విజయవిహార్‌ అతిథి గృహం ప్రారంభమైంది. నేటితో 63 వసంతాలు పూర్తి చేసుకుంది. నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు నిర్మాణ సమయంలో పనులు పరిశీలించడానికి ఢిల్లీ నుంచి సాగర్‌కు వచ్చే వీవీఐపీలు, వీఐపీలు, ఇతర అధికారులు బస చేసేందుకు ఎన్నెస్పీ ఆధ్వర్యంలో అతిథి గృహాన్ని నిర్మించారు. దీనిని ఉమ్మడి ఏపీ సీఎం నీలం సంజీవరెడ్డి ప్రారంభించారు. అప్పటి నుంచి మూడు దశాబ్ధాల వరకు ఈ అతిథి గృహం నిర్వహణ అంతా ఎన్నెస్పీ ఆధీనంలో ఉండేది. తర్వాత పర్యాటక శాఖకు అప్పగించారు. విజయవిహార్‌ అతిథి గృహంలో మొత్తం 35 గదులు ఉన్నాయి. ఎన్నెస్పీ అధికారుల కోసం మూడు గదులు కేటాయించి. మిగిలిన 32 గదులను పర్యాటక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నారు. ఏసీ స్టాండర్డ్‌, ఏసీ డీలక్స్‌, ఏసీ సూట్‌ గదులు అందుబాటులో ఉన్నాయి. ప్రాజెక్టు నిర్మాణ సమయంలో పనులు పరిశీలించడానికి వచ్చిన సీఎంలంతా ఇక్కడే బస చేసేవారు. నాటి ప్రధాని ఇందిరాగాంధీ కూడా ఇక్కడ బస చేశారు. ఈ అతిథి గృహంలో మాజీ గవర్నర్‌ నరసింహన్‌, మాజీ సీఎం కేసీఆర్‌, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, సినీ ప్రముఖులు ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌, చిరంజీవి, నాగార్జున, వెంకటేష్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌, నాగార్జున, శ్రీదేవి, విజయశాంతి షూటింగ్‌లకు వచ్చి ఇక్కడే బస చేశారు. దేశ విదే శాల నుంచి వచ్చే ప్రముఖ బౌద్ధ గురువులు కూడా ఇక్కడ బస చేశా రు. గత ఏడాది హైదరాబాద్‌లో నిర్వ హించిన మిస్‌వరల్డ్‌ పోటీదారులు కూడా ఇక్కడ అతిథ్యం పొందారు.

పచ్చదనంతో పర్యాటకులకు ఆహ్లాదం

విజయవిహార్‌ అతిథి గృహం పచ్చదనంతో కళకళలాడుతుంది. దేశ, విదేశాల నుంచి వచ్చే పర్యాటకులకు ఆహ్లాదం పంచుతోంది. గత నెల నుంచి విజయవిహార్‌లో గదులు అద్దెకు తీసుకునే పర్యాటకులకు ఆహ్లాదం కోసం ప్రతి శనివారం సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేశారు.

ప్రతి శనివారం సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తాం

విజయవిహార్‌ అతిథి గృహానికి నేటితో 63వసంతాలు పూర్తయ్యాయి. భవనం ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉంది. పర్యాటకులకు ఆహ్లాదం పంచేందుకు గడ్డి, చెట్లు పెంచుతున్నాం. ప్రతి శనివారం సాంస్కృతిక కార్య క్రమాలు నిర్వహిస్తున్నాం.

కిరణ్‌, విజయ విహార్‌ అతిథి గృహం మేనేజర్‌

Updated Date - Apr 10 , 2026 | 12:31 AM