kumaram bheem asifabad- ఆకలి తీర్చేలా.. హాజరు పెంచేలా..
ABN , Publish Date - Jun 08 , 2026 | 10:54 PM
ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 2026-27 సంవత్సరం నుంచి మధ్యాహ్నభోజనం అమలు చేయాలని గత నెల 23న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి పవరకు పాఠశాల స్థాయిలోనే ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తోంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనూ ఈ పథకం ప్రవేశపెడితే పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ఉదయం ఏమీ తినకుండానే కళాశాలకు హాజరవుతుంటారు
- ఈ విద్యా సంవత్సరం నుంచే అమలుకు నిర్ణయం
- విద్యార్థులకు ప్రయోజనం చేకూరేలా చర్యలు
ఆసిఫాబాద్/వాంకిడి, జూన్ 8 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో 2026-27 సంవత్సరం నుంచి మధ్యాహ్నభోజనం అమలు చేయాలని గత నెల 23న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి పవరకు పాఠశాల స్థాయిలోనే ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తోంది. ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లోనూ ఈ పథకం ప్రవేశపెడితే పేద, మధ్యతరగతి విద్యార్థులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఈ నిర్ణయం తీసుకున్నారు. దూరప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులు ఉదయం ఏమీ తినకుండానే కళాశాలకు హాజరవుతుంటారు. మధ్యాహ్న సమయానికి ఆకలి వేసి చాలా మంది ఇంటికి వెళ్తున్నారు. మధ్యాహ్న భోజనం అమలు చేస్తే పూర్తి సమయం విద్యార్థులు కళాశాలలోనే ఉండే అవకాశం ఉంటుంది.
జిల్లా వ్యాప్తంగా..
జిల్లాలో 11 ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ఉన్నాయి. 2026-27 విద్యా సంవత్సరం ప్రవేశా లు త్వరలో జరుగనున్నాయి. ఇంటర్‌లో ఏటా ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు దాదాపు ఎనిమిది వేల మంది ఉంటారు. గతంలో జిల్లాలో కొన్ని కళాశాలల్లో సిర్పూర్ మాజీ ఎమ్మెల్యే కోనప్ప సహకారంతో ఇంటర్మీడియట్ విద్యార్థులకు ప్రత్యేకంగా మధ్యాహ్న భోజనం అందజేశారు. జూనియర్ కళాశాలల్లో ఉదయం కంటే మధ్యాహ్నం హాజరు శాతం తగ్గుతుంది. విద్యార్థులు మధ్యాహ్న భోజనానికి ఇళ్లకు వెళుతున్నారని, దూరప్రాంతాలకు చెందిన వారు తిరిగి కళాశాలకు రావడంలేదని అధికారులు గుర్తించి గతంలోనే ఉన్నతాధికారులకు నివేధికలు అందజేశారు. కొన్నేళ్లుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో మధ్యాహ్న భోజనం అమలు చేయాలని డిమాండ్ ఉంది. మంత్రి వర్గ ఆమోదంతో ఎట్టకేలకు ఈ విద్యా సంవత్సరం నుంచి అమలుకానుంది. మధ్యాహ్న భోజనం అమలుతో సాయంత్రం ప్రత్యేక తరగతులకు హాజరు, ఉత్తీర్ణత శాతం పెరిగే అవకాశం ఉంది.
మెరుగైన ఫలితాలకు అవకాశం..
- చంద్రయ్య, ఇన్‌చార్జి ప్రిన్సిపాల్, వాంకిడి
ప్రభుత్వ జూనియర్ కళశాలల్లో మధ్యాహ్న భోజన పథకం ప్రవేశపెట్టడం వల్ల ఇంటర్‌లో మెరుగైన ఫలితాలు సాధించేందుకు అవకాశం ఉంది. ప్రతి విద్యార్థి ఈ అవకా శాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ పథకం ద్వారా విద్యార్థులు క్రమం తప్పకుండా తరగ తులకు హాజరవుతారు. ఉదయం హాజరైన విద్యార్థులు సాయంత్రం ప్రత్యేక తరగతులు పూర్తి చేసుకుని వెళ్లే అవకాశం ఉంటుంది. దీని ద్వారా ఇంటర్‌లో మెరుగైన ఫలితాలు సాధించే అవకాశం ఉటుంది.