అటవీ జంతువుల దప్పిక తీర్చేందుకు..
ABN , Publish Date - Mar 10 , 2026 | 12:27 AM
ఎండలు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో నల్లమల అటవీ ప్రాంతంలో జంతువుల ఆహార్తి తీర్చేందుకు అటవీశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు.
చందంపేట, మార్చి 9(ఆంధ్రజ్యోతి): ఎండలు తీవ్రంగా పెరుగుతున్న నేపథ్యంలో నల్లమల అటవీ ప్రాంతంలో జంతువుల ఆహార్తి తీర్చేందుకు అటవీశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకున్నారు. కంబాలపల్లి ఫారెస్ట్ రేంజ్‌లోని 14719 హెక్టార్లలో అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. జంతువులకు నీటి కొరత ఏర్పడకుండా సోలార్ మోటర్లతో పనిచేసే బోర్లను ఏర్పాటు చేసినీటి కుంటలను నింపుతున్నారు. మరికొన్ని చోట్ల ట్యాంకర్ల ద్వారా నీటి తొట్లను నింపుతున్నారు. వేసవి తీవ్రత పెరుగుతుండడంతో జింకలు, అటవీ పందులు, దుప్పులు, చిరుతలు, ఎలుగుబంట్లు, నెమళ్లు, రేస్ కుక్కలు నీటి కోసం అడవిలో తిరుగుతున్నాయి. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని అధికారులు అటవీ ప్రాంతంలో చేసిన ఏర్పాట్లతో సోలార్ బోర్ల ద్వారా ఉదయం సూర్యరశ్మి ఉన్నంత సేపు మోటర్లు నడుస్తాయి. దీంతో జంతువులకు తాగునీటికి ఇబ్బంది ఉండదు. అటవీశాఖ అధికారులు జంతువుల సంరక్షణ కోసం నిరంతర పర్యవేక్షణ కొనసాగిస్తూ ఎక్కడైనా నీటి కొరత ఉన్నట్లు కనిపిస్తే వెంటనే బోర్ల ద్వారా నీటిని అందించే చర్యలు తీసుకుంటున్నారు. వేసవిలో జంతువులకు నీటి ఇబ్బందులులేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ భాస్కర్ తెలిపారు. వేసవికాలంలో అటవీ జంతువులకు నీటి కొరతలేకుండా ప్రత్యేకంగా సోలార్ బోర్లు ఏర్పాటు చేసి నీటి కుంటలను నింపుతున్నామని, అవసరమైన చోట ట్యాంకర్ల ద్వారా నీటిని అందిస్తున్నామని తెలిపారు.