ఖనిజ నిక్షేపం.. పర్వతాపూర్!
ABN , Publish Date - Jun 24 , 2026 | 04:36 AM
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డివిజన్‌లో అరుదైన ఖనిజ సంపదను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) గుర్తించింది. మొగుడంపల్లి మండలం పర్వతాపూర్ గ్రామ శివారులో ...
టైటానియం, లేటరైట్ నిల్వలు భారీ స్థాయిలో ఉన్నట్లు నిర్ధారణ
800 ఎకరాల్లో గుర్తించిన జీఎస్ఐ
ఈ-వేలంలో హక్కులు దక్కించుకున్న ఎన్‌ఎల్‌సీ ఇండియా సంస్థ
జహీరాబాద్, జూన్ 23 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ డివిజన్‌లో అరుదైన ఖనిజ సంపదను జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్ఐ) గుర్తించింది. మొగుడంపల్లి మండలం పర్వతాపూర్ గ్రామ శివారులో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు భూముల్లో ఈ ఖనిజ నిక్షేపాలు భారీ స్థాయిలో ఉన్నట్లు అధికారులు నిర్ధారించారు. ఈ నెల 11న జీఎస్ఐ నిర్వహించిన పరిశోధనలో 800 ఎకరాల్లో 15.25 మిలియన్ టన్నుల వెనేడియం, 87 మిలియన్ టన్నుల అల్యూమినియం లెటరైట్, టైటానియం నిక్షేపాలు ఉన్నట్లు కనుగొన్నారు. కొత్తగా కనుగొన్న ఈ ఖనిజ బ్లాక్‌ను కేంద్ర గనుల మంత్రిత్వశాఖ ఇటీవల ఈ-వేలం వేసింది. వేలంలో పర్వతాపూర్ బ్లాక్‌ను ఎన్‌ఎల్‌సీ ఇండియా సంస్థ దక్కించుకుంది.
పారిశ్రామిక, రక్షణ, శక్తి రంగాలకు కీలకం
ప్రపంచవ్యాప్తంగా అరుదుగా లభించే ఖనిజాల్లో వెనేడియం కీలకమైంది. అధిక ధృడత్వం కలిగి ఉక్కు తయారీ, ఎలక్ర్టిక్ వాహనాల బ్యాటరీలు, దీర్ఘకాలం నిల్వచేసే బ్యాటరీలు, అణు, రక్షణ రంగ పరికరాల తయారీలో దీనిని ఉపయోగిస్తారు. పునరుత్పాదక శక్తి నిల్వల వ్యవస్థకు డిమాండ్ పెరుగుతున్నందున వెనేడియంకు ప్రాధాన్యత పెరుగుతోంది. అలాగే, ఏరోస్పేస్ రంగానికి టైటానియం వెన్నెముకగా మారనుంది. తక్కువ బరువు, అధిక లాభం, తుప్పును నిరోధించే లక్షణాల కారణంగా టైటానియంను అంతరిక్ష నౌకలు, క్షిపణి వ్యవస్థలు, నౌకాదళ పరికరాలు, విమానాల తయారీ, వైద్య పరికరాల తయారీలో వినియోగిస్తారు. అంతరిక్ష, రక్షణ రంగాలకు ఇది కీలకమైన ముడిసరుకు అని నిపుణులు పేర్కొంటున్నారు. ఇక, అల్యూమినస్ లేటరైట్ భవిష్యత్తులో అల్యూమినియం పరిశ్రమలకు ఎంతగానో ఉపయోగపడనుంది. మొత్తంగా స్థానికంగా లభ్యమవుతున్న ఈ ఖనిజాలు దేశ పారిశ్రామిక, రక్షణ, శక్తి రంగాలకు కీలకంగా మారుతాయని నిపుణులు పేర్కొంటున్నారు.
ఉద్యోగ, ఉపాధి అవకాశాలు
దేశ పారిశ్రామిక, రక్షణ, శక్తి రంగాలకు కీలకంగా ఉపయోగపడే ఖనిజాలు సంగారెడ్డి జిల్లా పర్వతాపూర్ గ్రామ శివారులో లభిస్తుండటం మా గ్రామానికి గర్వకారణం. వీటి వెలికితీతతో స్థానికులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయనే ఆశిస్తున్నాం. గ్రామాభివృద్ధికి ఇది దోహదపడుతుందని భావిస్తున్నాం.
-నాయికిని బసంతి, సర్పంచ్, పర్వతాపూర్