kumaram bheem asifabad-కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత
ABN , Publish Date - Feb 12 , 2026 | 11:08 PM
ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ పట్టణాల్లో శుక్రవారం మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని ఎస్పీ నితికాపంత్ అన్నారు. ఆసిఫాబాద్ పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలతో పాటు కాగజ్‌నగర్ పట్టణంలోని డీఏవీ పబ్లిక్ స్కూల్‌లో ఏర్పాట్లను, స్ట్రాంగ్ రూంలను గురువారం ఎస్పీ పరిశీలించారు
ఆసిఫాబాద్‌రూరల్, ఫిబ్రవరి 12 (ఆంధ్రజ్యోతి): ఆసిఫాబాద్, కాగజ్‌నగర్ పట్టణాల్లో శుక్రవారం మున్సిపల్ ఎన్నికల ఓట్ల లెక్కింపు సజావుగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు కౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్ట భద్రత ఏర్పాట్లు చేస్తున్నామని ఎస్పీ నితికాపంత్ అన్నారు. ఆసిఫాబాద్ పట్టణంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలతో పాటు కాగజ్‌నగర్ పట్టణంలోని డీఏవీ పబ్లిక్ స్కూల్‌లో ఏర్పాట్లను, స్ట్రాంగ్ రూంలను గురువారం ఎస్పీ పరిశీలించారు. ఈ సందర్భంగా కౌంటింగ్ కేంద్రాలలో ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లు, సీసీ కెమెరాలు, కౌంటింగ్ హాల్స్, స్ట్రాంగ్ రూం పరిసరాలు, తదితర అంశాలను ఎస్పీ క్షుణ్ణంగా పరిశీలించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు అవకాశం లేకుండా మూడంచెల భద్రతా వ్యవస్థను అమలు చేయాలని అధికారులకు సూచించారు. కౌంటింగ్ రోజున కేంద్రాల పరిసరాల్లో భారతీయ నాగరిక్ సురక్ష సంహిత (బీఎన్‌ఎస్‌ఎస్)సెక్షన్ 163 అమలులో ఉంటుందని చెప్పారు. అనధికార వ్యక్తులకు అనుమతి ఉండదని స్పష్టం చేశారు. అభ్యర్థులు, ఏజెంట్లు, సిబ్బంది తప్ప మరెవ్వరు కౌంటింగ్ కేంద్రాల పరిధిలోకి రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసు సిబ్బంది అప్రమత్తంగా, నిబద్దతతో విధులు నిర్వహించాలని సూచించారు. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యే వరకు నిరంతర నిఘా, గస్తీ, కంట్రోల్ రూం ద్వారా పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమం లో డీఎస్పీ వహీదుద్దీన్, సీఐ ప్రేంకుమార్, బాలాజీ వరప్రసాద్, సతీష్, మున్సిపల్ కమిషనర్ గజానంద్ తదితరులు ఉన్నారు.
విజయోత్సవ ర్యాలీలకు అనుమతి లేదు..
మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో విజయోత్సవ ర్యాలీలకు ఎలాంటి అనుమతి లేదని ఎస్పీ నితికా పంత్ అన్నారు. లెక్కింపు కేంద్రాల పరిసరాల్లో భద్రత కోసం ప్రత్యేక బందో బస్తు, క్యై ఆర్‌టీఎంలు, డాగ్ స్క్వాడ్ టీంలు, బాంబు డిస్పోసల్ టీంలు, సై్ట్రకింగ్ పోర్సులు సిద్ధంగా ఉంచినట్లు తెలిపారు. ఎన్నికల ఫలితాల నేఫథ్యంలో ఎన్నికల ప్రవర్తన నియమావళి తప్పని సరిగా పాటించాలని చెప్పారు. పలితాల అనంతరం విజయోత్సవ ర్యాలీలు, బైక్ ర్యాలీలు, డీజేలు, టపాకాయాలు కాల్చడం, ఊరేగింపుకు ఎలాంటి అనుమతి లేదన్నారు. శాంతి భద్రతలకు భంగం కలిగించే చర్యలు పూర్తిగా నిషేధమని చెప్పారు. జిల్లా పోలీసు శాఖ ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిందని, గొడవలు, అల్లర్లు సృష్టించే వారిని, నిబంధనలకు విరుద్ధంగా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించే వారిని రిమాండ్‌లోకి తీసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. ర్యాలీలు, ఊరేగింపులు నిర్వహించేందుకు సంబంఽధిత అధికారుల ఉత్తర్వుల మేరకు నిర్ధేశించిన తేదీల్లో మాత్రమే జరుపుకోవాలని సూచించారు. ఎవరైనా నియమావళిని ఉల్లంఘిస్తే లేదా శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా ప్రవర్తిస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.
కాగజ్‌నగర్, (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ సజావుగా చేపట్టాలని జిల్లా ఎస్పీ నికితాపంత్ తెలిపారు. గురువారం కాగజ్‌నగర్ కౌంటింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. బందోబస్తు, ఏర్పాట్లు తెలుసుకుని సూచనలు చేశారు.