హైదరాబాద్ సమీపంలో పెద్దపులి సంచారం
ABN , Publish Date - Jan 21 , 2026 | 05:57 AM
హైదరాబాద్ సమీపంలో పెద్దపులి సంచరిస్తున్నట్లుగా నిర్ధారణ జరగడం ఆందోళన కలిగిస్తోంది.
యాదాద్రి జిల్లా ఇబ్రహీంపూర్ దగ్గర పాదముద్రలు
అక్కడి ప్రాంత ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
హైదరాబాద్/అశ్వారావుపేట రూరల్/తుర్కపల్లి, జనవరి 20 (ఆంధ్రజ్యోతి): హైదరాబాద్ సమీపంలో పెద్దపులి సంచరిస్తున్నట్లుగా నిర్ధారణ జరగడం ఆందోళన కలిగిస్తోంది. రాష్ట్ర రాజధానికి 60 కి.మీ దూరంలో యాదాద్రి జిల్లా దత్తాయిపల్లి అటవీ ప్రాంతంలో రెండ్రోజుల క్రితం పెద్దపులి అడుగుజాడలు కనిపించడంతో అటవీ అధికారులు అప్రమత్తమయ్యారు. పులి ఇంకా అక్కడే సంచరిస్తున్నట్లుగా కొత్తగా పాదముద్రలు కనుగొనడం ద్వారా నిర్ధారించారు. హైదరాబాద్‌కు ఇంత సమీపంలో పెద్దపులి జాడలు కనిపించడం 50 ఏళ్లలో ఇదే తొలిసారి అని అధికారులు చెప్పారు. పెద్దపులి అడుగుజాడలు గుర్తించిన ప్రాంతానికి యాదాద్రి క్షేత్రం ఐదు కిలోమీటర్ల దూరంలోనే ఉండటం గమనార్హం. కాగా ఈ పులి మహారాష్ట్ర తాడోబా టైగర్ రిజర్వు నుంచి దారి తప్పి వచ్చి ఉండొచ్చునని.. ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, జగిత్యాల, సిరిసిల్ల, కామారెడ్డి, సిద్దిపేట, కరీంనగర్, పెద్దపల్లి, నర్సాపూర్ మీదుగా యాదాద్రి జిల్లాలోకి ప్రవేశించినట్లుగా భావిస్తున్నారు. పులి కదలికలు గుర్తించేందుకు ప్రత్యేకంగా కెమెరాలు, బంధించేందుకు ట్రాప్ బోనులు ఏర్పాటు చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ క్రమంలోనే మంగళవారం దత్తాయపల్లి బ్లాక్‌లోనే పెద్దపులి పాదముద్రలను గుర్తించారు. దత్తాయిపల్లి సహా సమీపంలోని గందమల్ల, కోనాపూర్, వీరారెడ్డిపల్లి, ఇబ్రంహీంపూర్, వెంకటాపూర్, శ్రీనివాసపూర్ ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
కొత్తగూడెం జిల్లాలో పులి దాడిలో 2 ఆవుల మృతి
కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట కావడిగుండ్ల అటవీ ప్రాంతంలో పులి సంచారం కలకలం రేపుతోంది. గ్రామానికి చెందిన సోడెం నాగేశ్వరరావు అనే రైతుకు చెందిన రెండు ఆవులపై పులి దాడి చేసి చంపేసింది. ఈ పులి ఏపీలోని పాపికొండల ప్రాంతంలో ఉన్న నేషనల్ పార్క్ నుంచి రాష్ట్రంలోకి ప్రవేశించినట్లుగా అదికారులు చెబుతున్నారు.