Share News

జనగామ జిల్లాలో పెద్దపులి!

ABN , Publish Date - Feb 07 , 2026 | 04:15 AM

మహారాష్ట్ర అటవీ ప్రాంతం నుంచి తెలంగాణలోని అడవుల్లోకి వచ్చి.. గత 20 రోజులుగా ఇక్కడ సంచరిస్తున్న పెద్దపులి..

జనగామ జిల్లాలో పెద్దపులి!

  • రఘునాథపల్లి మండలం మండెలగూడెం గ్రామ శివారులో పులి పాదముద్రల గుర్తింపు

హైదరాబాద్‌, ఫిబ్రవరి 6 (ఆంధ్రజ్యోతి): మహారాష్ట్ర అటవీ ప్రాంతం నుంచి తెలంగాణలోని అడవుల్లోకి వచ్చి.. గత 20 రోజులుగా ఇక్కడ సంచరిస్తున్న పెద్దపులి.. ప్రస్తుతం జనగామ జిల్లాలో ఉన్నట్లు అటవీశాఖ అధికారులు గుర్తించారు. గత మూడు, నాలుగు రోజుల నుంచి జనగామ జిల్లాలో సంచరిస్తున్నట్లు నిర్ధారించారు. శుక్రవారం ఉదయం జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం మండెలగూడెం గ్రామ శివారులో పెద్దపులి పాదముద్రలను గుర్తించారు. వెంటనే సమీప గ్రామాల్లో హెచ్చరికలు జారీ చేశారు. రాత్రి సమయంలో ఒంటరిగా బయటకు రావద్దని, అవసరమైతే గుంపులుగా మాత్రమే తిరగాలని ప్రజలకు సూచించారు. పెద్దపులి జాడ, కదలికలు కనిపిస్తే వెంటనే అటవీశాఖకు గానీ, స్థానిక పోలీసులకు గానీ సమాచారం ఇవ్వాలని సూచించారు. పెద్దపులి జాడలు మొదటగా యాదాద్రి భువనగిరి జిల్లాలో బయటపడటం తెలిసిందే. తరువాత అటు నుంచి అటవీ మార్గంలో సిద్దిపేట జిల్లా నర్సాపూర్‌ అటవీప్రాంతం వైపునకు వెళుతుందని అధికారులు అంచనా వేశారు. అయితే చివరికి జనగామ జిల్లాలో పులి అడుగు జాడలను గుర్తించారు. యాదాద్రి జిల్లాలో గుర్తించిన జాడలు, జనగామ జిల్లాలో బయటపడ్డ అడుగు జాడలు ఒకటేనని నిర్ధారణకు వచ్చారు. క

చీఫ్‌ వైల్డ్‌లైఫ్‌ వార్డెన్‌గా వినయ్‌కుమార్‌

తెలంగాణ రాష్ట్ర చీఫ్‌ వైల్డ్‌లైఫ్‌ వార్డెన్‌గా 1992 బ్యాచ్‌ ఐఎ్‌ఫఎస్‌ అధికారి వినయ్‌కుమార్‌ (పీసీసీఎఫ్‌) నియమితులయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేయగా.. వినయ్‌కుమార్‌ నూతన బాధ్యతలు చేపట్టారు. మూడు దశాబ్దాలకుపైగా అటవీ పరిపాలన అనుభవం కలిగిన వినయ్‌కుమార్‌ గతంలో అటవీశాఖ, గ్రామీణాభివృద్ధి, నీటిపారుదల శాఖల్లో వివిధ కీలక హోదాల్లో పనిచేశారు.

ఏపీలో పెద్దపులి చిక్కింది!

తూర్పుగోదావరి జిల్లాలో ఏడు రోజులుగా ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా సంచరించిన పెద్దపులి ఎట్టకేలకు చిక్కింది. రాయవరం మండలం కూర్మాపురంలో రెస్క్యూ ఆపరేషన్‌ నిర్వహించిన అటవీశాఖ అధికారులు పులికి మత్తు ఇంజెక్షన్‌ ఇచ్చి పట్టుకున్నారు. దీంతో ప్రజలతో పాటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.

Updated Date - Feb 07 , 2026 | 04:26 AM