Share News

kumaram bheem asifabad- పెద్దపులి అలజడి

ABN , Publish Date - Aug 25 , 2026 | 10:50 PM

జిల్లాలో మళ్లీ పెద్ద పులి సంచారం అలజడి సృష్టిస్తున్నది. కొన్ని రోజులుగా జిల్లాలోని పలు చోట్ల పులి పాదముద్రలు కనిపించడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. నవంబరు నుంచి జనవరి వరకు పులులు జతకట్టే సమయం. ఆ సమయంలో వాటి సంచారం ఎక్కువగా ఉంటుంది. ఈసారి మాత్రం ఆగస్టులోనే పులుల సంచారం కనిపిస్తోంది.

kumaram bheem asifabad- పెద్దపులి అలజడి
లోగో

- సిర్పూర్‌(టి)లో పశువుపై దాడితో మృతి

- అప్రమత్తమైన అటవీశాఖ అధికారులు

- భయాందోళనలో గ్రామాల ప్రజలు

ఆసిఫాబాద్‌, ఆగస్టు 23 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో మళ్లీ పెద్ద పులి సంచారం అలజడి సృష్టిస్తున్నది. కొన్ని రోజులుగా జిల్లాలోని పలు చోట్ల పులి పాదముద్రలు కనిపించడంతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. నవంబరు నుంచి జనవరి వరకు పులులు జతకట్టే సమయం. ఆ సమయంలో వాటి సంచారం ఎక్కువగా ఉంటుంది. ఈసారి మాత్రం ఆగస్టులోనే పులుల సంచారం కనిపిస్తోంది. మహారాష్ట్ర ప్రాంతం నుంచి కుమరం భీం జిల్లా కాగజ్‌నగర్‌ పరిధిలోని అటవీ ప్రాంతానికి కొత్త పులి వచ్చింది. దీంతో అటవీశాఖ అప్రమత్తమైంది. ఇన్నాళ్లు పులి జాడలు లేక ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. కానీ మళ్లీ పులి కదలికలతో భయాందోళన మొదలైంది. ఇటీవల సిర్పూర్‌ డివిజన్‌ పరిధిలోని బెజ్జూరు, పెంచికల్‌పేట, కౌటాల, సిర్పూర్‌(టి) మండలాల్లో వరుసగా పులి సంచరించిన ఆనవాళ్లను అటవీ అధికారులు గుర్తించారు. నివాస ప్రాంతాలకు సమీపంలో, వ్యవసాయ చేలల్లో పులి అడుగుజాడలు కనిపిస్తుండడంతో ప్రజలు, రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.

- సిర్పూర్‌ అటవీ డివిజన్‌ పరిఽధిలో..

ఆసిఫాబాద్‌ జిల్లాలోని సిర్పూర్‌ అటవీ డివిజన్‌ పరిఽధిలో విస్తారమైన అటవీ ప్రాంతాలు ఉన్నాయి. కౌటాల, సిర్పూర్‌(టి), బెజ్జూరు, చింతలమానెపల్లి, పెంచికల్‌పేట్‌, కాగజ్‌నగర్‌, దహెగాం ప్రాంతాల్లోని అడవులు పులుల సంచారానికి అనుకూలంగా ఉన్నాయి. దీంతో పాటు వన్యప్రాణుల సంచారం ఎక్కువగా ఉంటుంది. ప్రాణహిత, పెనుగంగా, వార్ధా నదులు, చెరువులు, చిన్ననీటి వనరులు ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నాయి. సాధారణంగా ఏటా నవంబరు నుంచి జనవరి వరకు పులి సంచారం ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుంది. పులులు జతకట్టే సమయం కావడంతో మహారాష్ట్ర నుంచి పులుల రాకపోకలు పెరుగుతుంటాయి. అడవుల్లో సంచరించే పులులు వేట, నీటి కోసం గ్రామాల సమీపంలోకి వస్తుంటాయి. ఈ క్రమంలో చేలల్లో పనులు చేసుకుంటున్న వారిపై పులులు దాడులకు దిగుతుండడం ప్రజల్లో భయాందోళనకు కారణమవుతోంది. జిల్లాలో ఐదేళ్లుగా వ్యవసాయ కూలీలు, పశువులపై దాడులు జరిగిన ఘటనలు చోటు చేసుకున్నాయి. 2024 నవంబరు 28న కాగజ్‌నగర్‌ మండలంలోని నజ్రూల్‌నగర్‌లో పత్తి ఏరుతున్న మోహర్లే లక్ష్మి అనే మహిళపై పులి దాడి చేసి చంపింది. సిర్పూర్‌(టి) మండలంలోని దుబ్బగూడ గ్రామంలో పత్తి ఏరుతున్న రైతు సురేష్‌ పై దాడి చేసి గాయపరిచింది. ఈనెల 19న సిర్పూర్‌(టి) మండలం చీలపల్లి గ్రామంలో మల్లు అనే వ్యక్తికి చెందిన గేదె ఇటికలపహడ్‌ అటవీ ప్రాంతానికి మేతకు వెళ్లగా పెద్దపులి దాడి చేయడంతో మృతి చెందింది.

- వ్యవసాయ పనులకు వెళ్లేందుకు..

ప్రస్తుతం పత్తి, ఇతర పంటల సాగు పనులు ముమ్మరంగా కొనసాగుతున్న తరుణంలో రైతులు, కూలీలు పొలాలకు వెళ్లేందుకు జంకుతున్నారు. కౌటాల, సిర్పూర్‌(టి), బెజ్జూరు పరిసర ప్రాంతాల్లో కొన్ని రోజులుగా బెబ్బులి తిరుగుతోంది. వ్యవసాయ క్షేత్రాలతోపాటు గ్రామాలకు సమీపంలోని నివాస ప్రాంతాల వద్ద కూడా సంచారానికి సంబంధించిన ఆనవాళ్లు కనిపించడం.. స్థానికులను మరింత భయాందోళనకు గురిచేస్తోంది. అటవీ శాఖ ఆధ్వర్యంలో పెద్దపులి జాడను గుర్తించేందుకు ప్రత్యేక కెమెరాలను ఏర్పాటు చేయడంతోపాటు సిబ్బంది సైతం గ్రామాల్లో తిరిగి ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. పులి సంచారం ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉందనే విషయంతో పాటు పులి ఎక్కడకు వెళుతుందో ట్రాక్‌ చేస్తున్నారు. పులి సంచారానికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడడంతోపాటు మనుషులు, పశువులకు ఎలాంటి హాని జరుగకుండా చర్యలు తీసుకుంటున్నారు. పశువుల కాపరులు, రైతులు, వ్యవసాయ కూలీలు జాగ్రత్తగా ఉండాలని, ముఖ్యంగా రాత్రి వేళల్లో బయటకు రాకూడదని అధికారులు సూచిస్తున్నారు. సిర్పూర్‌(టి) అటవీశాఖ రేంజ్‌ పరిధిలోని హుడ్కిలి అటవీ ప్రాంతంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. డివిజన్‌ పరిధిలోని అటవీ ప్రాంతం పులులు ఆవాసం ఏర్పరుచుకునేందుకు అనువుగా ఉండడంతో అధికారులు చర్యలు చేపడుతున్నారు. వచ్చిన పులి కూడా ఆడపులిగా గుర్తించడంతో అది ఇక్కడే శాశ్వతంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.

Updated Date - Aug 25 , 2026 | 10:50 PM