kumaram bheem asifabad- మళ్లీ పెద్దపులి కదలికలు
ABN , Publish Date - Aug 11 , 2026 | 10:48 PM
మహారాష్ట్ర ప్రాంతం నుంచి కాగజ్‌నగర్ అటవీ డివిజన్ పరిధిలోని అటవీ ప్రాంతానికి కొత్త పులి రాకతో అటవీశాఖ అప్రమత్తమైంది. ఇన్నాళ్లు పులి జాడలు లేక ఊపిరి పీల్చుకున్న ప్రజల్లో మళ్లీ భయాందోళన మొదలైంది. ప్రస్తుతం వానాకాలం పంటల పనులు కొనసాగు తున్నాయి.
- బెజ్జూరు, పెంచికల్‌పేట అడవుల్లో సంచారం
- అప్రమత్తంగా ఉండాలని అటవీ అధికారుల సూచన
బెజ్జూరు, ఆగస్టు 11 (ఆంధ్రజ్యోతి): మహారాష్ట్ర ప్రాంతం నుంచి కాగజ్‌నగర్ అటవీ డివిజన్ పరిధిలోని అటవీ ప్రాంతానికి కొత్త పులి రాకతో అటవీశాఖ అప్రమత్తమైంది. ఇన్నాళ్లు పులి జాడలు లేక ఊపిరి పీల్చుకున్న ప్రజల్లో మళ్లీ భయాందోళన మొదలైంది. ప్రస్తుతం వానాకాలం పంటల పనులు కొనసాగు తున్నాయి. దీంతో చేలకు ప్రజలు తప్పని సరిగా వెళ్లాల్సి ఉంటుంది. పులి అలజడితో ఎక్కడ అది తమపై దాడి చేస్తుందో అనే భయాందోళన ప్రజల్లో నెలకొన్న ది. కాగా అటవీశాఖ వచ్చిన పులి ఇక్కడే ఆవాసం ఉండేలా ప్రత్యేక చర్యలు తీసు కున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం పులి బెజ్జూరు, పెంచికలపేట అటవీ ప్రాంతాల్లో సంచరిస్తోంది. దాని కదలికలను గుర్తించేందుకు అటవీ శాఖ అటవీ ప్రాంతంలో సీసీకెమెరాలను ఏర్పాటు చేశారు.
- తలాయి ప్రాంతానికి..
మహారాష్ట్రలోని అటవీ ప్రాంతం నుంచి ప్రాణహి త నది దాటి బెజ్జూరు మండల సరిహద్దుల్లోని తలాయి ప్రాంతానికి వారం క్రితమే చేరుకుంది. అక్కడి నుంచి పాపన్‌పేట గ్రామం మీదుగా పెంచికల్‌పేట అటవీ ప్రాంతానికి చేరినట్లు అటవీ శాఖ అధికారులు గుర్తించారు. కొత్త పులి కావడంతో అధికారులు సైతం దాని కదలికలు గుర్తిస్తూ అప్ర మత్తంగా ఉంటున్నారు. పులి ఎటువైపు వెళ్తుందో దాని పాదముద్రల ఆధారంగా పసిగడుతున్నారు. శనివారం అగర్‌గూడ అటవీ ప్రాంతంలో రోడ్డు దాటుతుండగా బాటసారులకు పులి కనిపించడంతో అటవీ అధికారులకు సమాచారం ఇవ్వడంతో దాని పాదముద్రలు సేకరించారు. అంతకు ముందు వారం పాపన్‌పేట శివారులోని శ్మశాన వాటిక వద్ద కూడా పులి కనిపించగా, అక్కడ, ఇక్కడ కనిపించిన పులి ఒకటేనని అధికారులు గుర్తించారు.
- భయాందోళనలో ప్రజలు..
మహారాష్ట్ర నుంచి కొత్త పులి రాకతో గ్రామాల్లో భయాందోళనలు నెలకొన్నాయి. గతంలో ఏ-2అనే పెద్ద పులి మహారాష్ట్ర నుంచి వచ్చి దహెగాం, పెంచికలపేట మండలాల్లో ఇద్దరిని హతమార్చిన విషయం తెలిసిందే. ప్రస్తుతం వ్యవసాయ పనులు ముమ్మరంగా సాగుతున్న వేళ కొత్త పులితో ప్రజల్లో భయాందోళన నెలకొంది. వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, కూలీలు జాగ్రత్తగా ఉండాలని అటవీ అధికారులు ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. కా గా మహారాష్ట్రలో పులుల సంఖ్య అధికంగా ఉండ డం, తరచూ అక్కడి నుంచి పులుల రాకపోకలు కొనసాగిస్తుంటాయి. ఈ క్రమంలో కొన్ని శాశ్వతంగా ఆవాసం చేసుకుంటాయి. మరికొన్ని తరలి వెళ్తుంటా యి. అయితే ఇక్కడి అటవీ ప్రాంతం పులులు ఉండేందుకు మంచి ఆవాసం కావడంతో అధికారులు కూడా చర్యలు చేపడుతున్నారు. వచ్చిన పులి కూడా ఆడపులిగా గుర్తించడంతో అది ఇక్కడే శాశ్వతంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. ఇందుకోసం ప్రత్యేక చర్యలు చేపడుతున్నారు.
అప్రమత్తంగా ఉండాలి..
- అప్పయ్య, ఎఫ్‌డీవో, కాగజ్‌నగర్
బెజ్జూరు, పెంచికటపేట అటవీ ప్రాంతాల్లో కొత్త పులి సంచరిస్తున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఇప్పటికే దాని కదలికలపై దృష్టి సారించాం. వ్యవ సాయ పనులకు రైతులు గుంపులుగా వెళ్లాలి. కొత్తగా వచ్చిన పులి ఇక్కడే ఆవాసం ఉండేలా ప్రత్యే క చర్యలు తీసుకుంటున్నాం. ప్రజలకు ఎక్కడైనా పులి కదలికలు కనిపిస్తే అటవీ అధికారులకు సమా చారం ఇవ్వాలి.