Tiger from Siddipet: సిద్దిపేట నుంచి భువనగిరికి పెద్దపులి!
ABN , Publish Date - Jan 19 , 2026 | 04:11 AM
సిద్దిపేట జిల్లాలో పది రోజులుగా ప్రజలకు, రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన పెద్దపులి... యాదాద్రి భువనగిరి జిల్లాలోకి ప్రవేశించింది.
ఇబ్రహీంపూర్‌లో లేగ దూడలపై దాడి
ఓ దూడను చంపి.. మరోదాన్ని ఎత్తుకెళ్లింది
రాజాపేట/తుర్కపల్లి/జగదేవ్‌పూర్, జనవరి 18(ఆంధ్రజ్యోతి): సిద్దిపేట జిల్లాలో పది రోజులుగా ప్రజలకు, రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేసిన పెద్దపులి... యాదాద్రి భువనగిరి జిల్లాలోకి ప్రవేశించింది. తుర్కపల్లి మండలం ఇబ్రహీంపూర్ గ్రామంలో ఓ లేగ దూడను చంపి, మరో లేగ దూడను అటవీ ప్రాంతంలోకి ఎత్తుకెళ్లింది. దత్తాయపల్లి-బేగంపేట (10 కిలోమీటర్లు) అటవీ ప్రాంతం మధ్యలో ఉన్న ఇబ్రహీంపూర్‌కు చెందిన మాటూ రి కృష్ణ శనివారం అర్ధరాత్రి తన పొలం వద్ద ఆవు, లేగ దూడలను కట్టేసి ఇంటికి వెళ్లాడు. ఆదివారం ఉదయం వచ్చి చూడగా ఒక లేగ దూడ గాయాలతో చనిపోయింది. మరో లేగ దూడ కనిపించలేదు. దాంతో అటవీ శాఖ అధికారులకు సమాచారమిచ్చాడు. జిల్లా అటవీ శాఖ అధికారి సుధాకర్ రెడ్డి, భువనగిరి రేంజ్ ఆఫీసర్ రమేష్ నాయక్ ఘటనా స్థలానికి చేరుకుని లేగ దూడ కళేబరాన్ని పరిశీలించారు. పంటి గాట్లు, నేలపై పాదముద్రలు పెద్దపులివేనని నిర్ధారించారు. పులి ఆదిలాబాద్ జిల్లా కవ్వాల్ రిజర్వు ఫారెస్టు నుంచి తప్పిపోయి సిద్దిపేట జిల్లా మీదుగా ఈ ప్రాంతానికి వచ్చినట్లు భావిస్తున్నామని తెలిపారు. అటవీశాఖ అధికారులు యాదాద్రి భువనగిరి జిల్లాలో గస్తీని ముమ్మరం చేశారు. వీరారెడ్డిపల్లి అటవీ ప్రాంతంలోని గంధమల్ల శివారులో కూడా పులి అడుగులను గుర్తించారు.