గాలివాన, పిడుగుల బీభత్సం
ABN , Publish Date - Apr 22 , 2026 | 04:42 AM
రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతుండగా మంగళవారం సాయంత్రం పలుచోట్ల గాలివాన, పిడుగులు బీభత్సం సృష్టించాయి....
నారాయణపేట జిల్లాలో పిడుగుపాటుకు విద్యార్థి మృతి
వేర్వేరు జిల్లాల్లో వడదెబ్బకు ముగ్గురి మృతి
(ఆంధ్రజ్యోతి న్యూస్ నెట్‌వర్క్) : రాష్ట్రంలో ఎండల తీవ్రత కొనసాగుతుండగా మంగళవారం సాయంత్రం పలుచోట్ల గాలివాన, పిడుగులు బీభత్సం సృష్టించాయి. నారాయణపేట జిల్లా దామరగిద్ద మండలం కంసాన్‌పల్లిలో పిడుగు పాటుకు ఈడిగి శివకుమార్‌గౌడ్ (19) అనే విద్యార్థి మృతిచెందాడు. నల్లగొండ జిల్లాలో నాంపల్లి మండలం సుంకిశాల, మేళ్లవాయి, పెద్దాపురం కొనుగోలు కేంద్రాల్లోకి వర్షపు నీరు చేరడంతో ధాన్యం తడిసింది. దేవరకొండ మండలం భీమనపల్లి, కమలాపూర్‌లో వర్షానికి ప్రధాన వీధులు జలమయమయ్యాయి. ఈదురుగాలులకు చెట్ల కొమ్మలు విరిగిపడి విద్యుత్ సరఫరా నిలిచింది. కొండమల్లేపల్లి, నాంపల్లి మండలాల్లో పిడుగుపాటుకు 2 ఆవులు, 2 గేదెలు మృత్యువాతపడ్డాయి. కాగా, మంగళవారం గద్వాలలో 43.3, అయిజలో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వేర్వేరుచోట్ల వడదెబ్బకు ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. కొత్తగూడెం జిల్లా పాల్వంచ టీడీపీ సీనియర్ నేత యలమర్తి రవీంద్రబాబు(63) వడదెబ్బతో అస్వస్థతకు గురై మంగళవారం మృతిచెందారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పోతారం(ఎస్) గ్రామానికి చెందిన రైతు కాంసాని దేవేందర్ రెడ్డి (58) తీవ్రమైన ఎండలో ధాన్యం కుప్పలు పోస్తూ కుప్పకూలిపోయారు. మంచిర్యాల జిల్లా మందమర్రిలో బండారు రాజేశ్ గౌడ్ (43) అనే వ్యక్తి వడదెబ్బతో మృతిచెందాడు.