షార్ట్ ఫిలిం తీసేందుకు వెళ్లి పెన్నాలో ముగ్గురు యువకుల మృతి
ABN , Publish Date - Apr 06 , 2026 | 04:21 AM
కడప జిల్లా వల్లూరు మండలంలోని పెన్నానదిలో ఘోరం జరిగింది. పుష్పగిరి వద్ద షార్ట్ ఫిల్మ్ చిత్రీకరించేందుకు వచ్చిన వారిలో ముగ్గురు యువకులు నదిలోని లోతట్టు ప్రాంతంలో మునిగిపోయి ...
ఇద్దరి మృతదేహాలు లభ్యం
నది లోతట్టులో మునిగి కన్నుమూత
వల్లూరు, ఏప్రిల్ 5 (ఆంధ్రజ్యోతి): కడప జిల్లా వల్లూరు మండలంలోని పెన్నానదిలో ఘోరం జరిగింది. పుష్పగిరి వద్ద షార్ట్ ఫిల్మ్ చిత్రీకరించేందుకు వచ్చిన వారిలో ముగ్గురు యువకులు నదిలోని లోతట్టు ప్రాంతంలో మునిగిపోయి మృతి చెందారు. వీరిలో ఇద్దరి మృతదేహాలు లభ్యంకాగా.. మరొకరి మృతదేహం కోసం పోలీసులు గాలిస్తున్నారు. పోలీసులు, స్థానికుల సమాచారం మేరకు.. ‘ఫ్రంట్‌లైన్ ప్రెస్’ పేరుతో కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు చెందిన 8 మంది యువకులు జట్టుగా ఏర్పడి షార్ట్ ఫిలిమ్స్ తీస్తున్నారు. ఆదివారం వల్లూరు మండల పరిధిలోని పుష్పగిరి గ్రామానికి వచ్చారు. వారిలో ముగ్గురు యువకులు గ్రామంలో ఉండగా.. మిగతా వారు నదివద్దకు వెళ్లారు. వీరిలో ఇద్దరు యువకులు నీటికి కాస్త దూరంలో ఉండగా.. హరిబాబు(25), హర్షవర్ధన్(22), కృష్ణచైతన్య(20) నీళ్లలోకి దిగారు. వాళ్లు నీళ్లలోకి దిగిన చోట లోతు ఎక్కువగా ఉండటంతో వెంటనే మునిగిపోయారు. గట్టున ఉన్న వారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వల్లూరు ఎస్‌ఐ శివనాగిరెడ్డి, సీఐ మోహన్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. గజ ఈతగాళ్లు, ఫైర్ సిబ్బందితో కలసి గల్లంతైన వారి కోసం వెదికారు. కాసేపటికి హరిబాబు, హర్షవర్ధన్ మృతదేహాలు బయటపడ్డాయి. సాయంత్రం వరకు గాలించినా కృష్ణచైతన్య మృతదేహం దొరకకపోవడంతో గాలింపును నిలిపివేశారు. లభ్యమైన ఇద్దరి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్‌కు తరలించారు.
ఇన్‌స్టా ద్వారా పరిచయమై..
మృతిచెందిన హరిబాబు కడప విశ్వనాథపురంలో నివాసం ఉంటూ హోమియోపతి కాలేజీలో తాత్కాలిక ఉద్యోగిగా పనిచేస్తున్నారు. కడపకు చెందిన హర్షవర్ధన్ కేఎస్ఆర్‌ఎం కాలేజీలో నాలుగో సంవత్సరం ఇంజనీరింగ్ చదువుతున్నారు. గల్లంతైన కృష్ణచైతన్య సైతం కేఎస్ఆర్‌ఎం కాలేజీలో బీటెక్ సెకండియర్ చదువుతున్నారు. కాగా, అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన సురేశ్, చిత్తూరు జిల్లా కుప్పానికి చెందిన సాయిమనోజ్, కడపలోని ఆర్‌కే నగర్‌కు చెందిన భగవాన్, నందలూరుకు చెందిన ఫిరోజ్, అష్రఫ్ సహా మృతి చెందిన వారు.. ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచయం ఏర్పడి ఒక జట్టుగా మారారు. ‘ఫ్రంట్‌లైన్ ప్రెస్’ పేరుతో షార్ట్‌ఫిల్మ్‌లు తీసేవారు.