Corporation Elections Delay: 3 కార్పొరేషన్ల ఎన్నికలు ఆర్నెల్ల తర్వాతే..
ABN , Publish Date - Jan 01 , 2026 | 07:32 AM
గ్రేటర్ హైదరాబాద్‌ను పునర్‌వ్యవస్థీకరించి ఏర్పాటు చేయబోతున్న మూడు కార్పొరేషన్ల ఎన్నికలను.. వర్షాలు పడ్డాకే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.
వర్షాలు పడ్డాకే అంటున్న అధికార వర్గాలు.. జూన్, జూలై నెలల్లో నిర్వహించే చాన్స్
రాష్ట్రంలో మిగతా మునిసిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలు ఫిబ్రవరి తొలి వారంలో
117 మునిసిపాలిటీలు, 6 కార్పొరేషన్లలో ఓటర్ల జాబితా ప్రచురణ ప్రక్రియ షురూ
బీసీ రిజర్వేషన్లు తేలాకే పరిషత్ ఎన్నికలు?.. కోర్టు తీర్పు కోసం ఆగే యోచన
హైదరాబాద్, డిసెంబరు 31, (ఆంధ్రజ్యోతి): గ్రేటర్ హైదరాబాద్‌ను పునర్‌వ్యవస్థీకరించి ఏర్పాటు చేయబోతున్న మూడు కార్పొరేషన్ల ఎన్నికలను.. వర్షాలు పడ్డాకే నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. ఔటర్ రింగ్ రోడ్డు లోపల ఉన్న ప్రాంతాన్నంతా గ్రేటర్ హైదరాబాద్‌లో కలిపి మూడు కార్పొరేషన్లు చేసే దిశగా ప్రభుత్వం ఇప్పటికే వేగంగా అడుగులేస్తున్న సంగతి తెలిసిందే. సెంట్రల్ హైదరాబాద్, సైబరాబాద్, మల్కాజ్‌గిరి కార్పొరేషన్లుగా వీటిని ఏర్పాటుచేయనుంది. వీటి పరిధుల విషయంలో ఇప్పటికే స్పష్టత వచ్చేసింది. ఈ మూడు కార్పొరేషన్లఏర్పాటు ఫిబ్రవరి చివరినాటికిగానీ, మార్చిలోగానీ పూర్తయిపోతుంది. మరోవైపు గ్రేటర్ హైదరాబాద్ పాలక వర్గం పదవీకాలం కూడా ఫిబ్రవరిలోనే పూర్తికానుంది. అయితే, మూడు కార్పొరేషన్ల ఏర్పాటు ప్రక్రియ పూర్తయినా.. పునర్వ్యవస్థీకరించిన పోలీస్, విద్యుత్, టౌన్‌ప్లానింగ్, ట్రాఫిక్, వాటర్‌వర్క్స్ తదితర విభాగాలు కుదురుకోవడానికి కొన్ని నెలలసమయం పడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఈలోగా వేసవి వస్తుంది. కానీ.. వేసవికాలంలో కాకుండా కొంత వర్షాలు పడ్డాక ఎన్నికలు నిర్వహిస్తే ఫలితాలు బాగుంటాయన్న ఆలోచనలో సర్కారు ఉందని సమాచారం. ఈ క్రమంలో.. ఎన్నికలు జూన్, జూలై నెలల్లో జరిగే అవకాశం ఉంది. ఈ మూడు ప్రతిపాదిత కార్పొరేషన్లకు మినహా.. రాష్ట్రంలోని మిగతా అన్ని మునిసిపాలిటీలు, కార్పొరేషన్లకు ముందే ఎన్నికలు జరగనున్నాయి. ఫిబ్రవరి మొదటి వారంలో ఈ ఎన్నికలు నిర్వహించనున్నారు (పంచాయతీ ఎన్నికలు ముగిశాక పరిషత్ ఎన్నికలు కాకుండా...‘మునిసిపల్ ఎన్నికలే ముందు’ అన్న శీర్షికతో డిసెంబరు 18న ‘ఆంధ్రజ్యోతి’ ఒక కథనాన్ని ప్రచురించిన సంగతి తెలిసిందే). ఈ క్రమంలోనే.. మునిసిపల్ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు కూడా రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి.
117 మునిసిపాలిటీలు, 6 కార్పొరేషన్ల పరిధిలో.. వార్డులు, పోలింగ్ కేంద్రాలవారీగా ఓటరు జాబితాను బుధవారం విభజించారు. గురువారం నుంచి ఈ ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురించి.. ఓటర్ల పేర్లు, చిరునామాలపై అభ్యంతరాల స్వీకరణ చేపడతారు. 5న మునిసిపల్ కమిషనర్ల ఆధ్వర్యంలో రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహిస్తారు. 6న జిల్లా ఎన్నికల అధికారుల (కలెక్టర్ల) ఆధ్వర్యంలో జిల్లాస్థాయిలో రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించి, ఓటరు జాబితాకు సంబంధించిన అంశాలపై చర్చిస్తారు. ఆ తర్వాత మార్పులు చేర్పులతో సిద్ధం చేసిన తుది ఓటరు జాబితాను జనవరి 10న పోలింగ్ కేంద్రాలవారీగా విడుదల చేస్తారు.
ఆ తర్వాతే..
సాధారణంగా పంచాయతీ ఎన్నికల అనంతరమే నిర్వహించే మండల, జిల్లా పరిషత్ ఎన్నికలు ఈసారి ఆలస్యం కానున్నాయి. బీసీ రిజర్వేషన్ల అంశంపై చివరి వరకు పోరాడిన రాష్ట్ర సర్కారు.. పార్టీ గుర్తుల మీద జరగని పంచాయతీ ఎన్నికల నిర్వహణ దిశగా ముందుకెళ్లింది. కేంద్ర ఆర్థిక సంఘం నుంచి నిధులు రావాలంటే ఎన్నికల నిర్వహణ అనివార్యం కావడంతో వాటిని నిర్వహించేసింది. కానీ పార్టీ గుర్తులపై జరిగే పరిషత్ ఎన్నికల నిర్వహణకు మాత్రం బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పు వచ్చేవరకు ఆగుదామా? అనే యోచనలో రాష్ట్ర సర్కారు ఉంది. అదే జరిగితే కోర్టు తీర్పు వచ్చాకే ఆ ఎన్నికలు జరుగుతాయి.