మరోసారి మూడు నెలల రేషన్
ABN , Publish Date - Jul 29 , 2026 | 01:10 AM
కేంద్ర ప్రభుత్వం పేద బలహీన వర్గాలు ఇబ్బందులు పడకుండా గతంలో అత్యధిక వర్షాలు, తీవ్ర వేసవి పరిస్థితుల దృష్ట్యా మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేసింది. తాజాగా ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొన్న
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
కేంద్ర ప్రభుత్వం పేద బలహీన వర్గాలు ఇబ్బందులు పడకుండా గతంలో అత్యధిక వర్షాలు, తీవ్ర వేసవి పరిస్థితుల దృష్ట్యా మూడు నెలల రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేసింది. తాజాగా ఎల్‌నినో ప్రభావంతో కరువు పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం మరోసారి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాసాలకు సంబంధించి రేషన్ బియ్యం లబ్ధిదారులకు పంపిణీ చేసే విధంగా చర్యలు చేపట్టింది. వేసవికాలంలో ఏప్రిల్, మే, జూన్ నెలకి సంబంధించిన రేషన్ బియ్యం ఒకేసారి పంపిణీ చేశారు జూలై నుంచి నెలవారి రేషన్ పంపిణీ ప్రారంభించారు. కరువు పరిస్థితులు నెలకొన్న క్రమంలో మరోసారి మూడు నెలల రేషన్ ఇవ్వడం ద్వారా లబ్ధిదారులకు ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నారు. బియ్యం పంపిణీ కోసం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పౌరసరఫరాల శాఖ సన్నద్ధమైంది. రేషన్ డీలర్లకు బియ్యం పంపిణీ ప్రారంభించారు. మూడు నెలల రేషన్ ఒకేసారి ఇవ్వడం వల్ల రేషన్ డీలర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఒకేసారి రేషన్ బియ్యం అందించడం వల్ల పంపిణీ చేయడంలో శ్రమ అధికమవుతుందని వాపోతున్నారు. నిలువ సామర్థ్యం లేని దుకాణాల్లో డీలర్లు బియ్యం కోటాను భద్రపరచడం కష్టంగా మారుతుందని చెబుతున్నారు. దీనికి తోడు తూకంలో తరుగు వస్తుందని, నెట్వర్క్ సమస్యలు ఈ-పాస్ యంత్రాలు సక్రమంగా పనిచేయకపోవడం, ఒక్కో లబ్ధిదారుడు 15 నుంచి 20 నిమిషాల సమయం వేలిముద్రల సరిపోతుందని డీలర్లు చెబుతున్నారు.
ఒక్కొక్కరికి 18 కిలోలు..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో 12 మండలాలు, సిరిసిల్ల, వేములవాడ రెండు మున్సిపాలిటీల్లో రేషన్ లబ్ధిదారులకు 473 దుకాణాల ద్వారా పంపిణీ చేస్తున్నారు. ప్రతినెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రేషన్ దుకాణాలు తెరిచి ఉంటాయి. మూడు నెలల కోట పంపిణీ సందర్భంగా ఆగస్టులో 22 రోజులు షాపులు తెరిచి ఉంచాలని పౌర సరఫరాల శాఖ నిర్ణయించింది. జిల్లాలో ఉన్న 5.75 లక్షల మంది లబ్ధిదారులకు ప్రతినెల ఉచితంగా ఒక్కొక్కరికి ఆరు కిలోల చొప్పున ఉచితంగా అందిస్తున్న బియ్యం ఈసారి కూడా మూడు నెలల కోటాగా ఒకొక్కరికి 18 కిలోల బియ్యం ఇవ్వనున్నారు. ఇందుకు కోసం జిల్లాలో మూడు నెలల బియ్యం పంపిణీ కోసం 1,12,12,257 కిలోలు కేటాయించారు. ఇప్పటికే సరిపడా బియ్యం రేషన్ దుకాణాల్లో సిద్ధంగా ఉంచుతున్నారు. జిల్లాలో 473 రేషన్ దుకాణాలు ఉండగా, 1,96,470 రేషన్ కార్డులు ఉన్నాయి. వీటిపరిధిలో 5,77,547 మంది లబ్ధిదారులు ఉన్నారు. ఆహార భద్రత కార్డులు 1,82,444 ఉండగా, లబ్ధిదారులు 5,41,914 మంది, అంత్యోదయ కార్డులు 13,827 ఉండగా లబ్ధిదారులు 35,428 మంది ఉన్నారు. అన్నపూర్ణ కార్డులు 199 ఉండగా 205 మంది లబ్ధిదారులు ఉన్నారు.
జిల్లాలో రేషన్ కార్డులు లబ్ధిదారులు
మండలం కార్డులు లబ్ధిదారులు బియ్యం (కిలోలు)
బోయినపల్లి 13,326 37,711 7,22,586
చందుర్తి 12,253 35,413 6,61,803
గంబీరావుపేట 15,927 46,660 8,81,577
ఇల్లంతకుంట 17,367 49,380 9,34,002
కోనరావుపేట 15,713 46,236 8,76,204
ముస్తాబాద్ 16,661 49,257 9,33,297
రుద్రంగి 5,529 17,551 3,31,230
సిరిసిల్ల 30,526 91,761 20,04,996
తంగళ్లపల్లి 16,128 46,445 9,13,881
వీర్నపల్లి 4,714 15,119 2,85,123
వేములవాడ 22,171 66,475 12,49,590
వేములవాడ రూరల్ 8,471 24,272 4,54,428
ఎల్లారెడ్డిపేట 17,584 51,267 9,63,540
మొత్తం 1,96,470 5,77,547 1,11,72,165