Share News

kumaram bheem asifabad- ఒకేసారి మూడు నెలల రేషన్‌

ABN , Publish Date - Apr 03 , 2026 | 11:01 PM

జిల్లాలో ఒకేసారి మూడు నెలల రేషన్‌ బియ్యం లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభమైంది. మూడు ప్రతీ నెలా 1 నుంచి 15వ తేది వరకు బియ్యం పంపిణీ చేసేవారు. కానీ ఈ సారి ఏప్రిల్‌ నెలాఖరు వరకు చౌకధరల దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ చేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. అందుకు సంబంధించిన ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది.

kumaram bheem asifabad- ఒకేసారి మూడు నెలల రేషన్‌
వాంకిడిలో రేషన్‌ దుకాణం ఎదుట బారులు తీరిన ప్రజలు(ఫైల్‌)

- జిల్లాలో 1,64,490 ఆహార భద్రత కార్డులు

- బియ్యం నిల్వలకు స్థల సమస్యలు

- ఒక్కొక్కరికి 18 కిలోల బియ్యం

చింతలమానేపల్లి, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఒకేసారి మూడు నెలల రేషన్‌ బియ్యం లబ్ధిదారులకు పంపిణీ కార్యక్రమం బుధవారం నుంచి ప్రారంభమైంది. మూడు ప్రతీ నెలా 1 నుంచి 15వ తేది వరకు బియ్యం పంపిణీ చేసేవారు. కానీ ఈ సారి ఏప్రిల్‌ నెలాఖరు వరకు చౌకధరల దుకాణాల్లో సన్న బియ్యం పంపిణీ చేసే విధంగా అధికారులు చర్యలు చేపట్టారు. అందుకు సంబంధించిన ఆదేశాలు జారీ అయినట్లు తెలుస్తోంది. జిల్లాలో అన్ని రకాల రేషన్‌ కార్డులు 1,64,490 ఉండగా, 5,41,444 మంది లబ్ధిదారులు ఉన్నారు. నెల వారీ కోటా బియ్యం కోటా సరఫరా చేసేందుకు పది నుంచి పన్నెండు రోజుల సమయం పడుతుంది. అదే మూడు నెలల బియ్యం కోటా పంపిణీ చేసేందుకు మరింత సమయం తీసుకునే అవకాశం ఉన్నది. జిల్లాలోని రేషన్‌కార్డు లబ్ధిదారులకు ఒకేసారి రేషన్‌ బియ్యాన్ని పంపిణీ చేసేందుకు కావాల్సిన బియ్యాన్ని ఎంఎల్‌ఎస్‌ పాయింట్ల ద్వారా ఇప్పటికే రేషన్‌ దుకాణాలకు చేరవేసే ప్రక్రియ ప్రారంభం అయ్యింది. ప్రజా పంపిణీ వ్యవస్థ నిబంధనల ప్రకారం ఆహార భద్రతా కార్డులోని ప్రతీ లబ్ధిదారు(యూనిట్‌) కు నెలకు 6 కిలోల చొప్పున సన్నబియ్యం పంపిణీ చేస్తున్నారు. తాజాగా మూడు నెలల కోటా ఒకేసారి పంపిణీ చేస్తున్న క్రమంలో ఒక్కో లబ్ధిదారుకు 18 కిలోల బియ్యం అందనుంది. అంత్యోదయ కార్డుదారులకు నెలకు 35 కిలోల వంతున మూడు నెలలకు కలిపి 105 కిలోల బియ్యం అందజేస్తారు.

- ఒకే సారి వేలిముద్ర వేసేలా..

లబ్ధిదారుడి వేలిముద్ర ఒకే సారి వేసేలా సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ చేశారు. ఒక లబ్ధిదారుడు ఏప్రిల్‌, మే, జూన్‌ నెలల రేషన్‌ కోటా బియ్యం తీసుకోవాలంటే మూడు సార్లు బయోమెట్రిక్‌ తీసుకోవాల్సి ఉంటుంది. వరుసగా రెండు, మూడు సార్లు వేలిముద్రలు నమోదు చేసుకునే అవకాశం ఈ పాస్‌ (పీఓఎస్‌)లో లేదు. ఒకే సారి మూడు నెలల బియ్యం కోటా తీసుకునేందుకు వీలుగా ఈ పాస్‌లో సాంకేతిక మార్పులు, చేర్పులు చేయనున్నారు. వేలి ముద్రలు మూడు సార్లు విడివిడిగా వేయకుండా ఒకే సారి వేసేలా సాఫ్ట్‌వేర్‌ అప్‌డేట్‌ చేశారు. కాగా ఇంతకు ముందు ప్రభుత్వం దొడ్డు బియ్యాన్ని పంపిణీ చేసినప్పుడు 75 నుంచి 80 శాతం వరకు మాత్రమే రేషన్‌ కార్డు దారులు తీసుకునేవారు. కొందరు తమకు సమయం ఉన్నప్పుడు రేషన్‌ బియ్యం తీసుకునేవారు. కొందరైతే రెండు నెలల బియ్యం తీసుకోకుండా ఉండేవారు. జిల్లాలో సన్న బియ్యం పంపిణీ ప్రారంభం తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బియ్యం తీసుకునే లబ్ధిదారుల సంఖ్య బాగా పెరిగింది. 95శాతం పైగానే సన్నబియ్యం తీసుకుంటున్నారు. గతంలో దొడ్డు బియ్యం తీసుకోనివారు సైతం సన్నబియ్యం తీసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. రేషన్‌ దుకాణాల్లో పంపిణీ చేసే బియ్యం నాణ్యతగా ఉండడంతో తమకు వచ్చే సన్నబియ్యాన్ని వదులుకునేందుకు ఇష్టపడడం లేదు. కానీ మూడు నెలలకు సంబంధించి ఒకే సారి బియ్యం తీసుకొని నిల్వలు పెట్టడం తమకు స్థల సమస్యలు పెడుతోందని రేషన్‌ డీలర్లు వాపోతున్నారు.

- పక్కదారి పట్టే అవకాశం..

రేషన్‌ దుకాణాల్లో సన్నబియ్యం పంపిణీ చేసినా కొన్ని మండలాల నుంచి రేషన్‌ బియ్యం ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. కొందరు వ్యాపారులు ఇదే వ్యాపారాన్ని వృత్తిగా ఎంచుకొని దందా చేస్తున్నారు. చాలా ప్రాంతాల్లో రేషన్‌ పంపిణీ రోజు నుంచే దుకాణాల వద్దే ఉండి లబ్ధిదారుల నుంచి తక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. అనంతరం వివిధ మార్గాల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మూడు నెలల బియ్యం ఒకేసారి వస్తుండడంతో వ్యాపారులు పావులు కదుపుతున్నారు. జిల్లాలోని టాస్క్‌ఫోర్స్‌, ఎన్‌ఫోర్స్‌మెంట్‌ టీం అక్రమ రేషన్‌ను కట్టడి చేసేందుకు దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నా కొందరు ఈ దందాను ఆపడం లేదన్న విమర్శలు ఉన్నాయి. సంబంధిత అధికారులు రేషన్‌ పక్కదారి పట్టకుండా చూడాల్సిన అవసరం ఉందని పలువురు అభిప్రాయ పడుతున్నారు.

Updated Date - Apr 03 , 2026 | 11:01 PM