అతి వేగం.. నిర్లక్ష్యంతో ముగ్గురి మృతి
ABN , Publish Date - Jun 20 , 2026 | 04:36 AM
అతి వేగం, డ్రైవర్ నిర్లక్ష్యం ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుంది. గురువారం రాత్రి నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం రామన్నగూడెం సమీపంలో...
ఎదురెదురుగా ఢీకొన్న రెండు కార్లు
మృతుల్లో తండ్రీకుమారులు, ఓ ఇంజనీర్
పెద్దవూర, జూన్ 19 (ఆంధ్రజ్యోతి): అతి వేగం, డ్రైవర్ నిర్లక్ష్యం ముగ్గురి ప్రాణాలను బలి తీసుకుంది. గురువారం రాత్రి నల్లగొండ జిల్లా పెద్దవూర మండలం రామన్నగూడెం సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో తండ్రీకుమారులు, ఎస్‌ఎల్‌బీసీ పంప్‌హౌస్ సైట్ ఇంజనీర్ ఉన్నారు. ఎస్సై గోపాల్‌రావు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పల్నాడు జిల్లా ముప్పాళ్ల మండలం కొంకవారిపాలెం గ్రామానికి చెందిన కాకర్ల తోమాసయ్య(59) హైదరాబాద్‌లో నివాసం ఉంటున్నారు. ఆయన చిన్న కుమారుడు కాకర్ల ప్రకాశ్‌రావు(35) ప్రైవేట్ ఉపాధ్యాయుడు. ఇద్దరూ నాగార్జునసాగర్‌లోని సాగర్ మాత గుడికి వెళ్లేందుకు హయత్‌నగర్‌కు చెందిన ప్రవీణ్ కారును అద్దెకు మాట్లాడుకుని గురువారం సాయంత్రం 6 గంటల సమయంలో నాగార్జునసాగర్‌కు బయలుదేరారు. వీరి కారు రామన్నగూడెం తండా శివారులోకి చేరుకోగానే నాగార్జునసాగర్ వైపు నుంచి పెద్దవూర వైపు వస్తున్న కారు(మారుతి సుజుకి ఎక్స్‌ఎల్-6) అతి వేగంగా వచ్చి ఢీకొట్టింది. దీంతో తండ్రీకుమారులు అక్కడికక్కడే మృతి చెందగా, వాహనం నడుపుతున్న ప్రవీణ్‌కు గాయాలయ్యాయి. నాగార్జునసాగర్ వైపు నుంచి వస్తున్న కారులో ఉన్న రావుల సాయికుమార్(35) అక్కడికక్కడే మృతి చెందగా, కొర్ర సాయి తీవ్రంగా, వాహనం నడుపుతున్న రామకృష్ణ స్వలంగా గాయపడ్డారు. హన్మకొండ జిల్లా అచ్చంపేటకు చెందిన రావుల సాయికుమార్(35), గొర్రె రామకృష్ణ ఎస్‌ఎల్‌బీసీ లోలెవల్ కెనాల్(వరద కాల్వ) పంప్‌హౌస్‌లో సైట్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. గురువారం సాయంత్రం విధులు ముగించుకున్న అనంతరం భోజనం చేసేందుకు హెల్పర్‌గా పనిచేస్తున్న కొర్ర సాయితో కలిసి కారులో పెద్దవూరకు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను, క్షతగాత్రులను నాగార్జునసాగర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.