త్వరలో మళ్లీ ముగ్గురు సీఎంల భేటీ!
ABN , Publish Date - Jul 23 , 2026 | 06:23 AM
తుంగభద్ర బేసిన్‌తో ముడిపడిన అంశాలతో పాటు గోదావరి-కావేరి అనుసంధానం, పోలవరం-బనకచర్ల, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వంటి ప్రాజెక్టులపై చర్చించేందుకు వీలుగా..
కేంద్ర మంత్రి పాటిల్ నేతృత్వంలో..
గోదావరి-కావేరి అనుసంధానం, బనకచర్ల, పాలమూరు పథకంపై చర్చ?
కేంద్ర జలశక్తి మంత్రిత్వశాఖ సంకేతాలు
గోదావరి-కావేరి అనుసంధానికి కేంద్రం సిద్ధం.. పాటిల్ హామీ ఇచ్చారు: చంద్రబాబు
హైదరాబాద్, జూలై 22 (ఆంధ్రజ్యోతి): తుంగభద్ర బేసిన్‌తో ముడిపడిన అంశాలతో పాటు గోదావరి-కావేరి అనుసంధానం, పోలవరం-బనకచర్ల, పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం వంటి ప్రాజెక్టులపై చర్చించేందుకు వీలుగా త్వరలోనే తెలంగాణ, ఏపీ, కర్ణాటక ముఖ్యమంత్రుల సమావేశం జరగనుంది. ఇప్పటికే తుంగభద్ర రిజర్వాయర్ గేట్ల ప్రారంభోత్సవం సందర్భంగా ఒక భేటీ జరగ్గా.. రానున్న కొన్ని రోజుల్లోనే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు, కర్ణాటక సీఎం డీకే శివకుమార్ మధ్య కీలక భేటీ ఉంటుందని కేంద్ర జలశక్తి శాఖ సంకేతాలిచ్చింది. సమ్మక్కసాగర్ నుంచి గోదావరి-కావేరి అనుసంధానం చేపట్టడానికి వీలుగా కేంద్రం ఇప్పటికే సంకేతాలిచ్చింది. ఈ ప్రాజెక్టును సమ్మక్కసాగర్ నుంచి నాగార్జునసాగర్ మధ్య చేపట్టనున్నారు. పోలవరం నుంచి మరో లింక్‌ను చేపట్టనున్నారు. ఒక లింక్ పోలవరం నుంచి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ దాకా, మరొకటి పోలవరం నుంచి సోమశిల దాకా ప్రతిపాదిస్తున్నారు. పోలవరం నుంచి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ దాకా చేపట్టే పథకంలో నీటిని ప్రకాశం బ్యారేజీ దాకా తరలించి.. అక్కడి నుంచి ఉమ్మడి గుంటూరు జిల్లా బొల్లాపల్లిలో ఒక రిజర్వాయర్ నిర్మాణం చేపట్టి, పలు లిఫ్టులు, టన్నెల్‌ల ద్వారా బనకచర్ల క్రాస్ రెగ్యులేటరీలో నీళ్లు వేయనున్నారు. మరో లింక్‌ను నేరుగా సోమశిలకు తరలించి... తమిళనాడుకు నీళ్లివ్వనున్నారు. ఇప్పటికే తుంగభద్ర బేసిన్ అంశాలపై ఒక ఉన్నతస్థాయి కమిటీ కూడా వేసిన విషయం విదితమే. ఈనెల 27వ తేదీన ఈ కమిటీ సమావేశం ఢిల్లీలో జరుగనుంది.
ఈ కమిటీలో తుంగభద్ర జలాశయంలో పూడికతీతతో పాటు నావలిలో ఒక రిజర్వాయర్ నిర్మాణం, రాజోలిబండ డైవర్షన్ స్కీమ్(ఆర్డీఎస్) ఆధునీకరణ వంటి అంశాలపై చర్చించి, ఆర్నెల్లలో నివేదిక ఇవ్వాలని కేంద్రం విధివిధానాలు కమిటీకి జారీ చేసింది. ఇక పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం కూడా సమావేశంలో చర్చకు వచ్చే అవకాశాలున్నాయి. ఇప్పటికే ఈ ఎత్తిపోతల పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించింది. ఈ పథకానికి పోలవరం ప్రాజెక్టు ద్వారా కృష్ణా డెల్టాకు తరలించే 80 టీఎంసీలకు బదులుగా... సాగర్ ఎగువన ఉన్న రాష్ట్రాలు నీటిని వినియోగించుకోవాలని బచావత్ ట్రైబ్యునల్ వెసులుబాటు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ మేరకు 45 టీఎంసీలతో పాటు గోదావరి-కావేరి అనుసంధానం తొలిదశలో తెలంగాణకు కేటాయించిన 43 టీఎంసీలు కలుపుకొని... 88 టీఎంసీలతో పాలమూరు-రంగారెడ్డికి ఏపీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అంశాన్ని చర్చించే అవకాశం ఉంది. ఇప్పటికే ఒకసారి తెలంగాణ, ఏపీ ముఖ్యమంత్రుల మధ్య సమావేశం జరగ్గా ఆ తర్వాత ముగ్గురు సీఎంలతో ఒక భేటీ జరిగింది. మరోమారు ముగ్గురు సీఎంల భేటీలో ఏయే అంశాలపై ఏకాభిప్రాయం కుదురుతుంది? అనేది త్వరలోనే తేలనుంది.
అనుసంధానంపై త్వరలో భేటీ
గోదావరి-కావేరి అనుసంధానానికి కేంద్రం సిద్ధంగా ఉందని ఏపీ సీఎం చంద్రబాబుకు కేంద్రమంత్రి సీఆర్ పాటిల్ తెలిపారు. ఈ మేరకు భాగస్వామ్య రాష్ట్రాలతో రెండు, మూడు వారాల్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు చంద్రబాబుకు పాటిల్ హామీ ఇచ్చారు. అలాగే అంతర్‌రాష్ట్ర నీటి వివాదాల విషయంలో సయోధ్య కుదిర్చేందుకు చొరవ తీసుకుంటామని బాబుతో అన్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా చంద్రబాబు బుధవారం సీఆర్ పాటిల్‌తో భేటీ అయ్యారు. ఏపీ-తెలంగాణ మధ్య జల వివాదాలపై కమిటీని ఇప్పటికే ఏర్పాటు చేసినందున త్వరితగతిన వివాదాలు పరిష్కారమయ్యేలా చొరవ చూపాలని కేంద్రమంత్రిని బాబు కోరారు.