లారీ చక్రాల కింద నలిగిన ప్రాణాలు!
ABN , Publish Date - Feb 26 , 2026 | 02:26 AM
రాష్ట్రంలో బుధవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు ద్విచక్రవాహనదారులు లారీ చక్రాల కింద నలిగి ప్రాణాలు కోల్పోయారు.
ద్విచక్రవాహనాలను ఢీకొట్టిన లారీలు
వేర్వేరు ఘటనల్లో ముగ్గురు ద్విచక్రవాహనదారుల మృతి
ఇల్లెందులో తల్లీకూతుళ్ల మృత్యువాత
భైంసాలో భర్త మృతి, భార్యకు గాయాలు
ఇల్లెందు టౌన్, భైంసా, ఫిబ్రవరి 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో బుధవారం జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు ద్విచక్రవాహనదారులు లారీ చక్రాల కింద నలిగి ప్రాణాలు కోల్పోయారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లెందు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లీకూతుళ్ల మీద నుంచి లారీ దూసుకెళ్లింది. భైంసాలో ద్విచక్రవాహనంపై వెళుతున్న దంపతులను లారీ ఢీకొట్టిన ఘటనలో భర్త చనిపోగా భార్య ఆస్పత్రిపాలైంది. వివరాలిలా ఉన్నాయి. భద్రాద్రి జిల్లా ఇల్లెందు మండలం కొల్లాపురం గ్రామానికి చెందిన పాయం సురేష్, భార్య ధనలక్ష్మి (45), కూతురు జయశ్రీ (13), కుమారుడు చిన్న నలుగురూ తమ బంధువుల వివాహానికి హాజరయ్యేందుకు ద్విచక్రవాహనంపై బయల్దేరారు. కొల్లాపురం నుంచి ఇల్లెందు మీదుగా ఆళ్లపల్లి మండలం మర్కోడు గ్రామానికి వెళుతున్నారు. ఈ క్రమంలో ఇల్లెందు- కొత్తగూడెం ప్రధాన రహదారి జగదాంబగుంపు వద్ద వెనుక నుంచి వేగంగా వచ్చిన లారీ వీరి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. దీంతో తండ్రీకుమారుడు రోడ్డు పక్కకు పడ్డారు. తల్లీకూతుళ్లు రహదారిపై పడగా ప్రమాదానికి కారణమైన లారీ వారి మీద నుంచి దూసుకెళ్లింది. దీంతో ధనలక్ష్మి, జయశ్రీ అక్కడికక్కడే మరణించారు. తీవ్రంగా గాయపడిన తండ్రీకొడుకులు సురేశ్, చిన్న ప్రస్తుతం ఖమ్మం ప్రభుత్వ వైద్యశాలలో చికిత్స పొందుతున్నారు. కాగా, ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ పరారీలో ఉన్నాడని, ఘటనపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. ఇదిలా ఉంటే పాయం సురేష్ ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టిన అనంతరం ఆ లారీ మరో ద్విచక్రవాహనాన్ని కూడా ఢీకొట్టింది. దాంతో ఆ బైకుపై ఉన్నవారికీ గాయాలయ్యాయి. కానీ దీనిపై పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు అందలేదు. నిర్మల్ జిల్లా భైంసాలో బుధవారం ద్విచక్రవాహనాన్ని లారీ ఢీకొట్టగా.. ద్విచక్రవాహనంపై ఉన్న దంపతుల్లో భర్త మరణించగా భార్య తీవ్ర గాయాలతో ఆస్పత్రి పాలైంది. భైంసా మండలంలోని బిజ్జూర్ గ్రామానికి చెందిన కల్యాణ్ శివాజీ(52) తన భార్య అన్షబాయితో కలిసి బైంసాలో జరిగిన ఓ వివాహ వేడుకకు ద్విచక్రవాహనంపై వెళ్లాడు. వేడుక అనంతరం దంపతులిద్దరూ స్వగ్రామానికి తిరిగి వెళుతుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. జాతీయ రహదారిపై నిర్మల్ నుంచి నాందేడ్ వైపు వెళుతున్న ఓ లారీ.. శివాజీ దంపతుల ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులిద్దరూ తీవ్రంగా గాయపడగా వారిని స్థానిక ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. కల్యాణ్ శివాజీ ప్రాణాలు కోల్పోగా.. అన్షబాయి చికిత్స పొందుతోంది. ఈ ఘటనపై భైంసా టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు.