Share News

kumaram bheem asifabad- కరువు ముప్పు

ABN , Publish Date - Oct 28 , 2026 | 10:29 PM

ఎల్‌ని నో ప్రభావం, లోటు వర్షాపాతం, భూగర్బ జలాలు పడిపోవడంతో రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. వివిధ శాఖల నుంచి నివేదికలు క్షేత్రస్థాయి పర్యటన ద్వారా సేకరించిన వివరాల ఆధారంగా జిల్లాలో ఐదు మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలోని కౌటాల, బెజ్జూర్‌, చింతలమానపెల్లి, జైనూర్‌, సిర్పూర్‌(యు) మండలాలను మద్యస్థ కరువు మండలాలుగా ప్రకటించింది.

kumaram bheem asifabad- కరువు ముప్పు
లోగో

- ఎల్‌నినో ప్రభావంతో పంటలకు నష్టం

- జాబితాలో కౌటాల, బెజ్జూర్‌, చింతలమానపెల్లి, జైనూర్‌, సిర్పూర్‌(యు)

- ప్రభుత్వం నుంచి సాయం కోసం అన్నదాతల ఎదురుచూపు

ఆసిఫాబాద్‌, అక్టోబరు 28 (ఆంధ్రజ్యోతి): ఎల్‌ని నో ప్రభావం, లోటు వర్షాపాతం, భూగర్బ జలాలు పడిపోవడంతో రాష్ట్రంలో తీవ్ర కరువు పరిస్థితులు నెలకొన్నాయి. వివిధ శాఖల నుంచి నివేదికలు క్షేత్రస్థాయి పర్యటన ద్వారా సేకరించిన వివరాల ఆధారంగా జిల్లాలో ఐదు మండలాల్లో కరువు పరిస్థితులు నెలకొన్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలోని కౌటాల, బెజ్జూర్‌, చింతలమానపెల్లి, జైనూర్‌, సిర్పూర్‌(యు) మండలాలను మద్యస్థ కరువు మండలాలుగా ప్రకటించింది. దీంతో ఈ ప్రాంతాల్లో వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. ఇప్పటికే సాగుకోసం పెట్టుబడులు పెట్టిన రైతులు పంటల దిగుబడులపై ఆశలు కోల్పోతుండగా, కరువు పరి స్థితుల నుంచి తమను గట్టెక్కించేందుకు ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకొంటుందోనని ఎదురు చూస్తున్నారు.

- మారిన వాతావరణ పరిస్థితులు..

వాతావరణంలో చోటు చేసుకొంటున్న మార్పులు వ్యవసాయ రంగంపై ప్రభావం చూపుతున్నాయి. ఎల్‌నీనో ప్రభావంతో ఊష్ణోగ్రతలు పెరగడం, వర్షపాతంలో హెచ్చుతగ్గులు చోటు చేసుకోవడం వంటి పరిస్థితులు పంటల ఎదుగుదలకు సవా లుగా మారుతున్నాయి. సాధారణ పంటలకు అవస రమైన సమయంలో వర్షాలు కురవకపోవడం, వర్షా ల మధ్య విరామం పెరగడం భూమిలో తేమ తగ్గి పోవడం వంటి పరిణామాలు రైతులను ఇబ్బం దులకు గురిచేస్తున్నాయి. జిల్లాలో జూన్‌ 1 నుంచి సెప్టెంబరు 30 వరకు 1019.7 మిల్లీమీటర్ల వర్షపా తం నమోదు అయింది. ఈ పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం జిల్లాలోని ఐదు మండలాలను కరువు ప్రాంతాలను గుర్తించడంతో ప్రాధాన్యం సంతరించు కొంది.

- ఆర్థిక పరిస్థితులపై..

జిల్లాలో వ్యవసాయమే ప్రధాన జీవనాధారంగా ఉన్న ప్రాంతాల్లో వర్షాభావ పరిస్థితులు రైతుల ఆర్థిక పరిస్థితిని దెబ్బతీస్తున్నాయి. జిల్లాలో ఈ వానకాలం సీజన్‌లో 4,52,202 ఎకరాల్లో వివిధ రకాల పంటలు రైతులు సాగు చేస్తుండగా వీటిలో పత్తి 3,70,919 ఎకరాలు, వరి పంట 42,228 ఎకరా లు, కంది పంట 20,817, సోయబీన్‌ పంట1,326 ఎకరాలు, మొక్కజొన్న 668 ఎకరాలు, ఇతర పంట లైన జొన్న, పసర ,మినుములు, ,మిరప, వేరుశెనగ, ఆముదాలు, నువ్వులు 11,254 ఎకరాలలో సాగయ్యా యి. విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులు, వ్యవసాయ కూలీల ఖర్చులు పెరగడంతో సాగు పెట్టుబడులు భారంగా మారుతున్నాయి. పంటల సాగుకోసం అప్పులు చేసిన రైతులు దిగుబడి ఆశించిన స్థాయిలో రాకపోతే చేసిన అప్పులు ఎలా తీర్చాలో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా వర్షాధార వ్యవసాయంపై ఆధారపడే రైతులకు వర్షాపాతం కీలకంగా మారుతుంది. సరైన సమయంలో వానలు కురవకపోవడం, అధిక ఊష్ణోగ్రతల కారణంగా నేలలో తేమ తగ్గిపోవడం వలన పంటల ఎదుగుదలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. పంటల పరిస్థితిని అంచనా వేసి నష్టాల తీవ్రతను గుర్తించి రైతులకు అవసరమైన సహాయం అందించాల్సిన అవసరం ఉందని పలువులు అభిప్రాయ పడుతున్నారు.

- ప్రయోజనాలపై ఆశలు..

జిల్లాలో కౌటాల, బెజ్జూర్‌, చింతలమానపల్లి, జైనూర్‌, సిర్పూర్‌(యూ) మండలాలను కరువు మండలాలుగా గుర్తించడంతో రైతుల్లో ప్రభుత్వ సహాయంపై ఆశలు చిగురిస్తున్నాయి. కరువు గుర్తింపు ఆదారంగా పంట నష్ట పరిహారం, ఇతర సహాయక చర్యలు చేపట్టే అవకాశం ఉంటుంది. ఐతే కరువు మండలాలుగా ప్రకటించిన ప్రాంతాల్లో ప్రభుత్వం అందించే ప్రయోనాలపై రైతులు ఆశగా ఎదురు చూస్తున్నారు. అధికారులు క్షేత్రస్థాయిలో పంటల పరిస్థితిని పరిశీలించి నష్టాలను అంచనా వేసి పరిహారం చెల్లించాలని కరువు ప్రభావిత ప్రాం తాల్లో సాగునీటి లభ్యత, తాగునీటి పరిస్థితులు, .పశువుల మేత వంటి ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. కరవు గుర్తింపు కేవలం ప్రకటనలకే పరిమితం కాకుండా నష ్టపోయిన పంటలకు పరిహారం చెల్లించి రైతులను ఆదుకోవాలని పలువురు కోరుతున్నారు.

కరువు జిల్లాగా ప్రకటించాలి..

- బోగె ఉపెందర్‌, సీపీఐ జిల్లా నాయకుడు

కుమరంభీం ఆసిఫాబాద్‌ జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలి. జిల్లాలో 15 మండలాలు ఉండగా ప్రభుత్వం కేవలం 5 మండలాలను మాత్రమే కరువు మండలాలుగా ప్రకటించడం సరికాదు. జిల్లాలోని అన్ని మండలాల్లో ఎల్‌నీనో ప్రభావంతో పంటల పరిస్థితి దారుణంగా ఉంది. ప్రభుత్వం వెంటనే జిల్లాలోని 15 మండలాలను కరువు జిల్లాగా ప్రకటించి రైతులను ఆదుకోవాలి.

Updated Date - Oct 28 , 2026 | 10:29 PM