Share News

హైటెక్స్‌లో త్రెడ్‌ పోచంపల్లి ప్రత్యేక ప్రదర్శన

ABN , Publish Date - Jun 05 , 2026 | 04:06 AM

తరతరాల నైపుణ్యానికి ప్రతీకగా నిలిచిన పోచంపల్లి ఇక్కత్‌ నేతను హైదరాబాద్‌లోని హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో నేటి (ఐదో తేదీ) నుంచి ఏడో తేదీ వరకు అందుబాటులోకి ...

హైటెక్స్‌లో త్రెడ్‌ పోచంపల్లి ప్రత్యేక ప్రదర్శన

  • నేటి నుంచి ఏడో తేదీ వరకు ఎగ్జిబిషన్‌

  • నేతన్నలతో వినియోగదారులకు ములాఖత్‌

  • భౌగోళిక గుర్తింపు పొందిన ఉత్పత్తులపై అవగాహన

  • ఇక్కత్‌ ‘కట్టు - అద్దకం’ ప్రక్రియ నేరుగా వీక్షణ

  • 100 మంది నేతన్నలు.. మహిళా సంఘాల స్టాళ్లు

హైదరాబాద్‌, జూన్‌ 4 (ఆంధ్రజ్యోతి): తరతరాల నైపుణ్యానికి ప్రతీకగా నిలిచిన పోచంపల్లి ఇక్కత్‌ నేతను హైదరాబాద్‌లోని హైటెక్స్‌ ఎగ్జిబిషన్‌ సెంటర్‌లో నేటి (ఐదో తేదీ) నుంచి ఏడో తేదీ వరకు అందుబాటులోకి తీసుకొని వస్తున్నారు. ‘త్రెడ్‌ పోచంపల్లి’ పేరుతో ఏర్పాటుచేస్తున్న ప్రత్యేక ప్రదర్శన... హైటెక్స్‌లో హాలు నెంబరు- 4లో మూడు రోజులపాటు ప్రజలకు అందుబాటులో ఉంటుంది. భువనగిరి జిల్లా కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి, అధికార యంత్రాంగం ఆధ్వర్యంలో ఈ ఎగ్జిబిషన్‌ నిర్వహిస్తున్నారు. పోచంపల్లి ఇక్కత్‌ చీరలు, వస్త్రాలు, గ్రామంలో మగ్గాల నుంచి వ్యాపారులు, టోకు వర్తకులు, చిల్లర వర్తకుల నుంచి వినియోగదారులకు చేరుతుంటాయి. అయితే వస్త్రాలు నేసిన నేతన్నలను.. వినియోగదారులు నేరుగా కలిసే అవకాశం కల్పిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. ప్రత్యక్ష అనుసంధానంతో కొత్త మార్కెట్‌ అవకాశాలు వస్తాయని వెల్లడించారు. దీంతో వ్యాపారులు, మధ్యవర్తుల ప్రమేయం తగ్గుతుందని, తయారీదారుల నుంచి వినియోగదారులకు నేరుగా వస్త్రాలు అందుతాయని తెలిపారు. నేతన్నలతో వినియోగదారుల ములాఖత్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

వంద మంది నేతన్నలు... మహిళా సంఘాల స్టాళ్లు

పోచంపల్లితో పాటు పరిసర ప్రాంతాల నుంచి సుమారు 100 మంది నేతన్నలు ఈ ఎగ్జిబిషన్‌లో పాల్గొంటున్నారు. తమ కళను హైటెక్స్‌ వేదికపైకి నేరుగా తీసుకొస్తున్నారు. స్టాళ్లలో సందర్శకులు చేనేత ఉత్పత్తులను కొనుగోలు చేయటమే కాకుండా, ఇక్కత్‌ ‘కట్టు- అద్దకం’ ప్రక్రియ ప్రత్యక్ష ప్రదర్శనను తిలకించే అవకాశం కల్పిస్తున్నారు. మహిళా స్వయం సహాయక సంఘాలు నిర్వహించే స్టాళ్లు ప్రత్యేక ఆకర్షణగా నిలవనున్నాయి. ప్రభుత్వ తోడ్పాటు, కార్పొరేట్‌ సామాజిక బాధ్యత నిధులతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు. అంతర్జాతీయ ఖ్యాతి సంపాదించుకున్నప్పటికీ చేనేత రంగం పలు సవాళ్లను ఎదుర్కొంటున్నదని నేతన్నలు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. చవకగా లభించే పవర్‌లూమ్‌ ఉత్పత్తులు, ప్రింటెడ్‌ వస్త్రాలతో నేతన్నలు తీవ్ర పోటీ ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఈ నేపథ్యంలో అందుబాటులోకి మార్కెట్‌ రావటం, గుర్తింపు దొరకటంతో చేనేత రంగం మనుగడ కీలకంగా మారింది. భౌగోళిక గుర్తింపు(జీఐ ట్యాగ్‌) పొందిన ఉత్పత్తులపై అవగాహన పెంచటం, సంప్రదాయ విజ్ఞానాన్ని భావి తరాలకు అందించటం, నేతన్నలకు సుస్థిర ఉపాధి కల్పించటానికి ఈ ఎగ్జిబిషన్‌ దోహదం చేస్తుందని నిర్వాహకులు వెల్లడించారు. పోచంపల్లిని షాపింగ్‌ గమ్యస్థానంగా కాకుండా... సాంస్కృతిక కేంద్రంగా మార్చటమే లక్ష్యమని పేర్కొన్నారు.


తెలంగాణ టూరిజంతో భాగస్వామ్యం

పోచంపల్లిపై ప్రజల్లో మరింత ఆసక్తిని కలిగించటానికి తెలంగాణ పర్యాటక సంస్థ, జిల్లా అధికార యంత్రాంగం, ఇతర భాగస్వాములతో కలిసి ప్రత్యేక ప్యాకేజీలను రూపొందిస్తున్నాయి. వినియోగదారులను నేరుగా నేతన్నల గ్రామాల్లోకి తీసుకెళ్లటానికి అవకాశం కల్పిస్తున్నారు. సందర్శకులు, పర్యాటకులు, డిజైనర్లు, పరిశోధకులు, విద్యార్థులు, విదేశీ అతిథులు నేరుగా గ్రామాల్లో పర్యటించి, కళాకారుల కుటుంబంతో మాట్లాడి, రంగు అద్దకం, దారం కట్టే ప్రక్రియను దగ్గరగా చూసే వీలు కల్పిస్తున్నారు. కళ ఎక్కడ సజీవంగా ఉందో.. అక్కడే వినియోగదారులు చూసే అవకాశం కల్పించటమే తమ లక్ష్యమని అధికారులు పేర్కొన్నారు. అంతర్జాతీయ గుర్తింపు పొందిన ఈ కళను కాపాడుతూనే నేతన్నల జీవనోపాధిని మెరుగుపరిచేందుకు ఈ ప్రదర్శన ఉపయోగపడుతుందని భువనగిరి కలెక్టర్‌ అనురాగ్‌ జయంతి తెలిపారు. ఎగ్జిబిషన్‌ ద్వారా చేనేత గ్రామాన్నే కొనుగోలుదారుల వద్దకు తీసుకెళ్తున్నట్లు కలెక్టర్‌ వెల్లడించారు.

Updated Date - Jun 05 , 2026 | 04:06 AM