kumaram bheem asifabad- విద్యార్థుల భవితకు ‘తొలిమెట్టు’
ABN , Publish Date - Jul 12 , 2026 | 10:15 PM
ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న చిన్నారులు చదువడం, రాయడం, గణిత నైపుణ్యాలను మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా విద్యాశాఖ తొలిమెట్టు పేరిట మౌలిక భాషా గణిత సామర్థ్యాల సాధన(ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ, ఎఫ్‌ఎల్‌ఎన్) అమలుకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు జిల్లాలో 17 పాఠశాలల్లో అమలు చేస్తున్నారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన మార్గదర్శకాలను స్కూల్ ఆఫ్ ఎడ్యూకేషన్ డైరెక్టర్ విడుదల చేశారు.
- వెనుకబడిన వారికి పునశ్చరణ తరగతులు
- 1-5 తరగతుల విద్యార్థులపై ప్రత్యేక దృష్టి
- చిన్నారుల అభ్యసనానికి బలమైన బాట
- జిల్లాలో 17 పాఠశాలల్లో అమలు
కాగజ్‌నగర్, జూలై 12 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న చిన్నారులు చదువడం, రాయడం, గణిత నైపుణ్యాలను మరింత మెరుగుపరచడమే లక్ష్యంగా విద్యాశాఖ తొలిమెట్టు పేరిట మౌలిక భాషా గణిత సామర్థ్యాల సాధన(ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీ, ఎఫ్‌ఎల్‌ఎన్) అమలుకు శ్రీకారం చుట్టారు. ఈ మేరకు జిల్లాలో 17 పాఠశాలల్లో అమలు చేస్తున్నారు. 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన మార్గదర్శకాలను స్కూల్ ఆఫ్ ఎడ్యూకేషన్ డైరెక్టర్ విడుదల చేశారు. నాలుగేళ్లుగా అమలు చేసిన ఫౌండేషన్ లిటరసీ కార్యక్రమాల వల్ల విద్యావ్యవస్థ ఎంతో పటిష్టంగా మారింది. నాలుగేళ్లుగా తొలిమెట్టు కార్యక్రమం సత్పలితాలివ్వడంతో ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రైవేటు పాఠశాలల్లోనూ అమలు చేసేలా చర్యలు తీసుకుంటున్నారు.
- సాంకేతికతను వినియోగించుకొని..
ప్రస్తుత సాంకేతికతను వినియోగించుకొని మూ డు నుంచి ఐదు తరగతుల విద్యార్థులకు వారానికి 80 నిమిషాల పాటు కృత్రిమ మేధ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) ఆధారిత పాఠాలను బోధిస్తున్నారు. గణితం, తెలుగు, ఇంగ్లీషు బోధనలో ఏఐ టూల్స్ వినియోగించి విద్యార్థుల్లో నేర్చుకునే సామర్థాన్యి పెంపొందించేందుకు దృష్టి సారిస్తున్నారు. పాఠ్యాంశాల్లో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేక బోధన చేయనున్నారు. ప్రతి రోజు మధ్యా హ్నం 3 గంటల నుంచి 4 గంటల వరకు అభ్యసన అభివృద్ధి(లెర్నింగ్ ఎన్‌రిచ్‌మెంటు) పేరుతో పీరియడ్ ప్రత్యేక తరగతులు నిర్వహించేందుకు ఏర్పా ట్లు చేస్తున్నారు. ప్రతి విద్యార్ధి కనీసం అభ్యసన సామార్థ్యాలు సాధించే వరకు వ్యక్తిగత శ్రద్ధతో పాటు పునశ్చరణ బోధన అందించ నున్నారు. విద్యార్థుల అభ్యసన పురోగతిని నిరంతరం అంచనా వేయడానికి విద్యా సంవత్సరంలో బేస్‌లైన్, మిడ్‌లైన్, ఎండ్‌లైన్ పరీక్షలు కూడా నిర్వహించనున్నారు. జూలై 1 నుంచి 10 వరకు బేస్‌లైన్ పరీక్ష, నవంబరు 20 నుంచి 30 వరకు మిడ్‌లైన్, 2027 మార్చి 7 నుంచి 17వ తేదీ వరకు ఎండ్ లైన్ పరీక్షల ద్వారా మూల్యంకణం పూర్తి చేయాల్సి ఉంటుంది.
- ఫలితాల ఆధారంగా..
బేస్‌లైన్ మూల్యాంకనంలో వచ్చిన ఫలితాల ఆధారంగా విద్యార్థుల అభ్యసన ప్రగతిని ఉపాధ్యాయులు పర్యవేక్షించాల్సి ఉంటుంది. విద్యార్ధులను మూడు బృందాలుగా ఏర్పాటు చేసి వారి స్థాయి పెంచేలా చర్యలు తీసుకుంటారు. వర్క్‌బుక్‌లో ప్రాక్టిసు షీట్ల ఆధారంగా అభ్యసన ప్రగతిని అర్థం చేసుకోవాలి. నెలవారి అభ్యసన సామర్థ్యాలో క్యాలెండర్ రూపొందించారు. పరీక్షల తప్పనిసరిగా తెలంగాణ స్కూల్ ఎడ్యూకేషన్ యాప్‌లో కూడా నమోదు చేయాల్సి ఉంటుంది. ప్రతి రోజు 30 నిమిషాల పాటు లైబ్రరి నిర్వహించాలని కూడా నిర్ధేశించారు. ఈ పీరియడ్‌లో విద్యార్థులతో కథలు పుస్తకాలు చదివి విన్పిస్తారు. దీని ద్వారా చిన్నారుల్లో చదివే ఆసక్తిని పెంచుతారు. తరగతి గదుల్లో ఉపా ధ్యాయ మద్దతు సమూహాలు(పీర్ సపోర్టు గ్రూపు లు) ఏర్పాటు చేస్తారు. విద్యార్థులు పరస్పర సహాకారంతో అభ్యసనం మెరుగు పర్చుకునేలా చర్యలు తీసుకోనున్నారు.
- వారంలో మూడు రోజులు..
కార్యక్రమం సమర్థవంతంగా అమలు చేయడానికి మండల విద్యాధికారులు వారంలో మూడు రోజులు ఐదు నుంచి ఆరు పాఠశాలలను పరిశీలించాల్సి ఉంటుంది. కాంప్లెక్సు ప్రధానోపాధ్యాయులు వారానికి నాలుగు, ఐదు రోజులు బడులను సందర్శించాలి. వీరితో పాటు డీఈవో, సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారులు తనిఖీలు చేసి తొలిమెట్టు కార్యక్రమం అమలు తీరును తెలుసుకుంటారు. ప్రతి నెల 26న పాఠశాల, 27న మండల 28న రాష్ట్ర స్థాయి సమీక్షా సమావేశాలు నిర్వహిస్తారు. ఎఫ్‌ఎల్‌ఎస్ సెల్ సభ్యులు, రిసోర్స్‌పర్సన్లు ఆయా సమావేశాలకు హాజరై సూచనలు సలహాలు అందిస్తారు. తొలిమెట్టుతో ప్రాథమిక విద్య బలోపేతంలో భాగంగా చిన్నారుల్లో చదువడం, రాయడం, గణిత నైపుణ్యాలతో పాటు సాంకేతిక పరిజ్ఙానంపై అవగాహన పెంపొందించడం, వెనుకబడిన విద్యార్థులను ప్రధాన స్రవంతిలో తీసుకరావడం, ప్రతి విద్యార్ధి కనీస అభ్యసన సామార్థ్యలను పెంపొందిం చేలా చర్యలు తీసుకుంటున్నారు.