రైతుల ఆరోగ్య సమస్యలపై అధ్యయనానికి ‘తొలకరి’
ABN , Publish Date - Apr 03 , 2026 | 04:59 AM
రైతులు తమ దిగుబడులను పెంచుకోవడం ఎలా? మెరుగైన సాగు పద్ధతులు? రైతుల ఆదాయం పెంపు ఎలా? వ్యవసాయదారులకు సంబంధించి కేవలం ఈ అంశాల...
వెల్‌కమ్ ట్రస్ట్‌తో హెచ్‌సీయూ భాగస్వామ్యం
తొలి దశలో తెలంగాణ, ఏపీ, కర్ణాటక రాష్ట్రాల్లో అమలు
హైదరాబాద్ సిటీ, ఏప్రిల్ 2 (ఆంధ్రజ్యోతి): రైతులు తమ దిగుబడులను పెంచుకోవడం ఎలా? మెరుగైన సాగు పద్ధతులు? రైతుల ఆదాయం పెంపు ఎలా? వ్యవసాయదారులకు సంబంధించి కేవలం ఈ అంశాలపైనే ఇప్పటివరకు అనేక అధ్యయనాలు జరిగాయి. కానీ, రైతులు, వ్యవసాయ కార్మికులు ఎదుర్కొనే మానసిక సమస్యలపై తొలిసారిగా ఓ అధ్యయనం జరగబోతోంది. ‘తొలకరి’ పేరిట వెల్‌కమ్ ట్రస్ట్ అనే సంస్థ అంతర్జాతీయ ప్రాజెక్టుగా ఈ అధ్యయనానికి శ్రీకారం చుట్టింది. ఈ తొలకరి ప్రాజెక్టులో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (హెచ్‌సీయూ) కూడా భాగస్వామి అయిందని ఆ వర్సిటీ ఆంత్రోపాలజీ విభాగం ఆచార్యుడు నందకిషోర్ ప్రకటించారు. వాతావరణ మార్పులు, అధిక ఉష్ణోగ్రతల కారణంగా దేశంలోని రైతులు, వ్యవసాయ కార్మికుల్లో తలెత్తే మానసిక ఆరోగ్య సమస్యలను పరిష్కరించేందుకు ఈ అధ్యయనం ఉపకరిస్తుందని తెలిపారు. ఈ అంతర్జాతీయ ప్రాజెక్టుకు వెల్‌కమ్ ట్రస్ట్ 3 మిలియన్ డాలర్ల నిధులను సమకూర్చిందని, వినూత్నమైన ఈ అధ్యయనంలో యూకే, భారత్‌లోని పరిశోధకులు బృందాలు కలిసి పని చేస్తాయని వెల్లడించారు. ప్రాజెక్టు తొలి దశలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు కర్ణాటక రాష్ట్రాలలో అమలు కానుందని పేర్కొన్నారు. రైతులు, వ్యవసాయ కార్మికుల మానసిక ఆరోగ్య సమస్యలను పరిష్కరించడానికి, వారికి స్థిరమైన మద్దతును అందించడానికి తగిన కార్యాచరణను రూపొందించడమే తొలకరి ప్రాజెక్టు లక్ష్యమని వివరించారు. ఎడిన్‌బరో విశ్వవిద్యాలయం (యూకే), సోనిపత్‌లోని అశోక విశ్వవిద్యాలయం, హైదరాబాద్‌లోని సెంటర్ ఫర్ సస్టైనబుల్ అగ్రికల్చర్, బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరోసైన్సెస్, ముంబైలోని మారివాలా హెల్త్ ఇనిషియేటివ్‌కు చెందిన బృందాలు తొలకరి ప్రాజెక్టులో పని చేస్తాయని వెల్లడించారు. కాగా, హెచ్‌సీయూ ఆంత్రోపాలజీ విభాగం పరిశోధకులు ఐదేళ్లపాటు జరిగే ఈ అధ్యయనంలో పాల్గొననున్నారు. ఈ ప్రాజెక్టు కోసమని హెచ్‌సీయూకు సుమారు రూ.2.19కోట్ల గ్రాంటు లభిస్తుంది.