Share News

కష్టకాలంలో అండగా నిలిచారు

ABN , Publish Date - Jun 19 , 2026 | 12:10 AM

కుటుంబ పెద్దను కోల్పోయి కష్టాల్లో ఉన్న ఆ కుటుంబానికి గ్రామస్థులంతా ఏకమై అండగా నిలిచారు.

కష్టకాలంలో అండగా నిలిచారు
పొనుగోడులో యూసుఫ్‌ పిల్లలకు నగదు అందజేస్తున్న గ్రామస్థులు

కుటుంబపెద్దను కోల్పోయిన కుటుంబం

పెద్ద మనసుతో ఆదుకున్న గ్రామస్థులు

చిన్నారుల భవిష్యత్తుకు రూ.4.05 లక్షలు సేకరణ

గరిడేపల్లి, జూన్‌ 18(ఆంధ్రజ్యోతి): కుటుంబ పెద్దను కోల్పోయి కష్టాల్లో ఉన్న ఆ కుటుంబానికి గ్రామస్థులంతా ఏకమై అండగా నిలిచారు. పెద్ద మనస్సుతో ఆ కుటుంబాన్ని ఆదుకున్నారు. సూర్యాపేట జిల్లా గరిడేపల్లి మండలంలోని పొనుగోడు గ్రామానికి చెందిన డ్రైవర్‌ షేక్‌ యూసుఫ్‌ గుండెపోటుతో రెండు నెలల క్రితం మృతిచెందాడు. దీంతో ఆయన కుటుంబం తీవ్ర విషాదంలో మునిగిపోయింది. భార్య, ఆరు సంవత్సరాల కుమార్తె, నాలుగు సంవత్సరాల కుమారుడు ఉన్నారు. వారికి యూసుఫ్‌ ఒక్కరే ఆధారం. కుటుంబ పెద్దను కోల్పోవడంతో ఆ కుటుంబ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఈ విషాద ఘటన గ్రామస్థుల మనుసు కదిలించింది. కష్టాల్లో ఉన్న ఆ కుటుంబానికి అండగా నిలవాలని గ్రామ పెద్దలు, యువకులు, వివిధ సంఘాలు, స్నేహితులు నిర్ణయించుకున్నారు. చెరువుకట్ట బజారు సభ్యులు, ఎస్‌ఎ్‌ససీ బ్యాచ్‌, మజీద్‌-ఇ-మహ్మదీయ కమిటీ, ఎంఐఎం టీం, నజీర్‌, గిరిప్రసాద్‌ తదిత రులు గ్రామ ప్రజల సహకారంతో విరాళాలు సేకరించి అందరి సహకారంతో మొత్తం రూ.4,05,081ల ఆర్థిక సాయం సమకూర్చారు. ఆ మొత్తాన్ని యూసుఫ్‌ ఇద్దరు చిన్నారుల పేర్లపై పోస్టాఫీసులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌గా జమ చేశారు. దీంతో పిల్లల భవిష్యత్తుకు కొంత భరోసా కల్పించినట్లుయింది. ఆ సహాయం డబ్బు రూపంలోనే కాక, మానసిక ధైర్యాన్ని కూడా ఇచ్చింది. కష్టకాలంలో కుల, మత, రాజకీయ భేదాలు పక్కనపెట్టి గ్రామమంతా ఒ క్కటై అందరికీ ఆదర్శంగా నిలిచారు.

Updated Date - Jun 19 , 2026 | 12:10 AM