Share News

kumaram bheem asifabad- ఇసుక తోడేస్తున్నారు..

ABN , Publish Date - Mar 22 , 2026 | 11:00 PM

జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఫలితంగా వాగులు, వంకలన్ని వట్టిపోయి భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. జిల్లాలో ఎలాంటి ఇసుక రీచ్‌లు లేక పోయినా ట్రాక్టర్ల యజమానులు నామ మాత్రంగా పర్మిట్‌లు తీసుకుంటున్నారు. ఒక్కో పర్మిట్‌పై పదేసి ట్రిప్పుల చొప్పున ఇసుకను తరలిస్తున్నారు.

kumaram bheem asifabad- ఇసుక తోడేస్తున్నారు..
రెబ్బెన మండలంలో వాగులో ఇసుక తోడుతున్న ఎక్స్‌కావేటర్‌(ఫైల్‌)

- అక్రమార్కులపై చర్యలు కరువు

ఆసిఫాబాద్‌, మార్చి 22 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో ఇసుక అక్రమ తవ్వకాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. నిబంధనలకు విరుద్ధంగా అడ్డగోలుగా ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. ఫలితంగా వాగులు, వంకలన్ని వట్టిపోయి భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. జిల్లాలో ఎలాంటి ఇసుక రీచ్‌లు లేక పోయినా ట్రాక్టర్ల యజమానులు నామ మాత్రంగా పర్మిట్‌లు తీసుకుంటున్నారు. ఒక్కో పర్మిట్‌పై పదేసి ట్రిప్పుల చొప్పున ఇసుకను తరలిస్తున్నారు. ఈ అక్రమ తవ్వకాల వ్యవహారంలో రెవెన్యూ, పోలీసుల పాత్ర అపరిమితంగా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా ట్రాక్టర్‌ యజమానుల నుంచి ఒక్కో ట్రాక్టర్‌కు నెలకు రూ.2 వేల చొప్పున వసూలు చేస్తూ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇలా జిల్లా కేంద్రంతో సహా 15 మండలాల్లోనూ ఇంచుమించు ఇదే తరహాలో మాఫియా దర్జాగా ఇసుక దోపిడీకి పాల్పడుతోంది. నిర్మాణ రంగం ఊపందుకుంటున్న పరిస్థితుల్లో ఇసుకకు విపరీతమైన డిమాండ్‌ ఏర్పడడంతో వ్యవసాయ అవసరాల కోసం వినియోగించాల్సిన ట్రాక్టర్‌లు ఇసుక దందాలోనే తిరుగుతుండడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది.

- పెద్దవాగు మొదలుకుని..

ఆసిఫాబాద్‌ పట్టణ శివారులోని పెద్దవాగు మొదలుకుని దహెగాం మండలంలోని ఎర్రవాగు వరకు నెట్‌వర్క్‌ ఏర్పాటు చేసుకున్న ఇసుక చోరులు మాఫీయాను తలదన్నే రీతిలో ఏకంగా ఎక్స్‌కావేటర్లు, డోజర్లు వంటి యంత్ర సామగ్రిని ఉపయోగించి మరీ ఇసుక వ్యాపారానికి తెర లేపడం అధికారుల పని తీరును ప్రశ్నార్థకంగా మార్చి వేసింది. వాస్తవానికి కుమరం భీం జిల్లాలో అధికారికంగా ఎలాంటి ఇసుక రీచ్‌లు గుర్తించలేదు. కానీ జిల్లాలో ఉన్న వాగుల నుంచి వ్యాపారులు ఇసుకను తరలిస్తున్నప్పటికీ రెవెన్యూ, భూగర్భ జల వనరుల శాఖ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోంది. మార్కెట్‌లో ప్రస్తుతం టన్ను ఇసుకకు రూ.2,000 నుంచి రూ.2500 వరకు ధర పలుకుతోంది. నిబంధనల ప్రకారం లారీలలో ఇసుక తరలించరాదన్న ఆదేశాల దృష్ట్యా అక్రమ ఇసుక తవ్వకం దారులు వ్యూహాత్మకంగా రూట్‌ మార్చి ట్రాక్టర్ల ద్వారా ఇసుకను రహస్య ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకున్న డంప్‌లకు తరలిస్తున్నారు. అక్కడి నుంచి లారీల్లో ఇతర ప్రాంతాలకు రవాణా చేస్తున్నట్లు చెబుతున్నారు. ఇలా జిల్లాలో రెబ్బెన మండలంలోని గంగాపూర్‌, పులికుంట, కొండపల్లి వాగులతో పాటు దహెగాం మండలంలోని కల్వాడ ఎర్రవాగు, పెద్దవాగు, కౌటాల మండలంలోని ముత్తంపేట, తాట్‌పల్లి వాగులు, చింతలమానెపల్లి మండలంలోని రుద్రాపూర్‌, చింతలమానెపల్లి, కాగజ్‌నగర్‌ మండలంలోని రాస్పెల్లి, పెద్దవాగు, కెరమెరి మండలంలోని సాంగ్వీ, కైరి వాగు, సిర్పూర్‌(టి) మండలంలోని పెద్దబండ వాగుల నుంచి ఇసుక మాఫీ పెద్ద ఎత్తున ఇసుకను వెలికి తీస్తూ సొమ్ము చేసుకుంటున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారమంతా సంబంధిత తహసీల్దార్‌లు, రెవెన్యూ ఇన్స్‌పెక్టర్లకు తెలిసినప్పటికీ ఇసుక సిండికేట్లు మామూళ్లు ముట్టజెప్పడంతో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అధికారుల పని తీరుపై ఆరోపణలు ఎక్కువ అయిన సమయాల్లో మాత్రం ఒకటి రెండు కేసులు నమోదు చేసి చేతులు దులుపుకుంటున్నట్లు చెబుతున్నారు.

భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం..

వాగుల నుంచి ఇసుకకు అక్రమంగా తరలిస్తుం డడంతో భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. వర్షాకాలంలో పుష్కళంగా కనిపించే భూగర్భ జలాలు ఎండ కాలంలో పాతాళానికి పడిపోతున్నాయి. దీంతోతాగునీటికి ప్రజలు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి నెలకొంటోంది. ఇసుక తవ్వకాల మూలంగా ఉన్న కొద్ది పాటి భూగర్భ జలాల మట్టం కూడా పడి పోతున్నట్లు భూగర్భ జల వనరుల శాఖ సేకరించిన సర్వేల్లో వెల్లడైంది. ముఖ్యంగా వాగులు, ఒర్రెలు ప్రవహిస్తున్న పరిసరాల్లో భూగర్భ జలాలపై ఇసుక తవ్వకాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. దాంతో ఆయా ప్రాంతాల్లోని గిరిజన గ్రామాలు, గూడాల్లో తీవ్ర తాగునీటి సంక్షోభం తలెత్తుతున్నట్లు గుర్తించారు. నిబంధనల ప్రకారం నదులు, ఉప నదుల్లోనే మీటర్‌ లోతుకు మించి ఇసుక తవ్వకాలు జరపడం నిషేధం. వాల్టా చట్టాన్ని అనుసరించి వాగులు, వంకల్లో అసలు ఇసుక తీయరాదు. కానీ జిల్లాలో అడుగడుగున నిబంధనలు తుంగలో తొక్కుతూ అక్రమంగా ఇసుక దందా సాగుతుండడంతో భూగర్భ జలాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లో ఇసుక తవ్వకాల వల్ల నీటి నిలువలు పడిపోతున్నాయి. దీంతో వన్యప్రాణులకు తాగునీటి లభించని పరిస్థితి సైతం నెలకొంది.

Updated Date - Mar 22 , 2026 | 11:00 PM