Share News

యథేచ్ఛగా తోడేస్తున్నారు

ABN , Publish Date - Feb 20 , 2026 | 12:29 AM

సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌) మండల పరిధిలోని ఏటి వెంట ఉన్న ఏడు గ్రామాల్లో ఉన్న ఇసుక రవాణ యథేచ్ఛగా కొనసాగుతోంది

యథేచ్ఛగా తోడేస్తున్నారు
ఇసుక లోడ్‌ చేసి ఉంచిన ట్రాక్టర్‌ (ఫైల్‌)

ఏళ్ల తరబడి కొనసాగుతున్న ఇసుక దందా

అంతరిస్తున్న భూగర్భజలాలు

ఆందోళన చెందుతున్న రైతులు

ఆత్మకూర్‌(ఎస్‌) ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): సూర్యాపేట జిల్లా ఆత్మకూర్‌(ఎస్‌) మండల పరిధిలోని ఏటి వెంట ఉన్న ఏడు గ్రామాల్లో ఉన్న ఇసుక రవాణ యథేచ్ఛగా కొనసాగుతోంది. ట్రాక్టర్‌ యజమానులు సిండికేట్‌గా ఏర్పడి అధికారులకు నెల మామూళ్లు ఇచ్చి ఇసుక దందా కొనసాగిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ ఏటి వెంట ఉన్న గ్రామాల్లో ఇసుక రవాణ కారణంగా భూగర్భజలాలు తగ్గి వర్షాలు రాని సమయంలో పంట పొలాలు ఎండిపోయే ప్రమాదముందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాగునీటికి కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని ప్రజలు, రైతులు అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఫిర్యాదు చేసినా..

పోలీసులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోతోందని ప్రజలు వాపోతున్నారు. మీడియాలో ట్రాక్టర్‌ల ఫొటోలు, వీడియోలు స్థానికుల ఆరోపణలతో జిల్లాస్థాయిలో కథనాలు వస్తున్నప్పటికీ ఎలాంటి చర్యలు లేకపోవడం విశేషం. గత సంత్సరం డిసెంబర్‌ నెలలో సర్పంచుల ఎన్నికలు జరిగి నూతన సభ్యులు ఎన్నికయ్యారు. ఇసుక దందాను వారైనా అడ్డుకుంటారనే ఆశతో ఏటి గ్రామాల ప్రజలు ఎదురు చూస్తున్నారు. ముఖ్యంగా పాతర్లపాడు, రామన్నగూడెం, ముక్కుడుదేవులపల్లి, మక్తా కొత్తగూడెం, మిడ్తనపల్లి గ్రామాల్లో నేటికీ ఇసుక రవాణ ఇష్టానుసారంగా జరుగుతోంది. దీనిని అడ్డుకోవడం నూతన సర్పంచులకు సవాల్‌గా మారింది. ఇటీవల కురిసిన వర్షాల కారణంగా చెక్‌డ్యాంల్లో నీరు ఉండడంతో ఇసుక లభ్యతకు కొరత ఏర్పడింది. దీంతో ఒక ట్రాక్టర్‌కు రూ. 7వేల నుంచి రూ.10 వేల వరకు విక్రయించి దండుకుంటున్నారు. రాష్ట్ర ప్రభుత్వం యాప్‌ ద్వారా జాజిరెడ్డిగూడెం నుంచి ఇసుకకు రూ.6 వేల వరకు ఖర్చు రావడం బుక్‌ చేసిన 10 రోజుల తర్వాత ఆలస్యంగా రావడంతో వీరి వద్దనే కొనుగోలు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. కళ్ల ముందు ఇసుక అక్రమంగా తరలిస్తున్నప్పటికీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం ఏమిటని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Feb 20 , 2026 | 12:29 AM