Share News

kumaram bheem asifabad- మళ్లీ వారికే పీఏసీఎస్‌ పగ్గాలు

ABN , Publish Date - May 10 , 2026 | 10:33 PM

ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో మళ్లీ పాత పాలకవర్గాలే కొనసాగనున్నాయి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాల వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. నామినేటెడ్‌ పద్ధతిలో భర్తీ చేయాలని ప్రభుత్వం మొదట తీసుకున్న నిర్ణయంతో ఆశావహుల్లో ఆశలు చిగురించాయి.

kumaram bheem asifabad-  మళ్లీ వారికే పీఏసీఎస్‌ పగ్గాలు
బెజ్జూరులోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం

- ఉత్తర్వులు జారీ చేసిన సహకారశాఖ

- జిల్లాలో 12సహకార సంఘాలు

బెజ్జూరు, మే 10 (ఆంధ్రజ్యోతి): ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో మళ్లీ పాత పాలకవర్గాలే కొనసాగనున్నాయి. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాల వ్యవహారం మళ్లీ మొదటికొచ్చింది. నామినేటెడ్‌ పద్ధతిలో భర్తీ చేయాలని ప్రభుత్వం మొదట తీసుకున్న నిర్ణయంతో ఆశావహుల్లో ఆశలు చిగురించాయి. తాజాగా సోమవారం 2025, ఫిబ్రవరి 14వ తేదీ వరకు కొనసాగిన పాలకవర్గాలను యథావిధిగా కొనసాగించాలని ఆదేశిస్తూ సహకారశాఖ ప్రత్యేక కమిషనర్‌ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకునే వరకు ఈ పాలకవర్గాలే అధికారంలో కొనసాగ నున్నాయి. జిల్లాలో 12సహకార సంఘాలు కొనసాగుతున్నాయి. సహకార సంఘాల పాలకవర్గాల పదవీ కాలం గత ఏడాది ఫిబ్రవరిలో ముగియగా, ఆ పాలకవర్గాలను కొనసాగిస్తూ అదే ఏడాది ఫిబ్రవరి 14, ఆగస్టు 14న రెండుసార్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా ప్రభుత్వం ఇటీవల డీసీసీబీ, పీఏసీఎస్‌ల పాలకవర్గాలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ప్రమేయం లేకుండానే పీఏసీఎస్‌లకు చైర్మెన్‌, వైస్‌చైర్మెన్‌తో పాటు డైరెక్టర్‌ పదవులను కూడా నామినేటెడ్‌ పద్దతిలో భర్తీ చేయాలని నిర్ణయించింది. పీఏసీఎస్‌ లకు పాలకవర్గాల నియామక ప్రక్రియ పూర్తయిన తర్వాత డీసీసీబీ, డీసీఎంఎస్‌ లకు కూడా చైర్మెన్‌, వైస్‌ చైర్మెన్‌, డైరెక్టర్ల పదవులను నామినేటెడ్‌ విధానంలోనే భర్తీ చేయాలని భావించింది. అయితే అప్పటి వరకు ఇన్‌చార్జీలను నియ మించిన విషయం తెలిసిందే. రేపో, మాపో కొత్త పాలకవర్గాలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తుందని ఆశించిన ఆశావహుల ఆశలపై నీళ్లు చల్లుతూ సోమవారం పాత పాలకవర్గాలను పునరుద్ధరిస్తూ కొత్త ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇదిలా ఉంటే సోమవారం జరిగిన మంత్రివర్గ సమావేశంలో పీఏసీఎస్‌లకు నామి నేటెడ్‌ విధానంలో పాలకవర్గాలను నియమించేందుకు అనుసరించాల్సిన మార్గదర్శకాలు రూపొందించేందుకు ప్రభుత్వం అనుమతించింది.

- ఓటింగ్‌ ద్వారా..

ఓటింగ్‌ విధానం ద్వారా ఎన్నికైన ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పాలకవర్గాలు 2025, ఫిబ్రవరి 13వ తేదీ వరకు కొనసాగాయి. కాగా మరో ఆరు నెల ల పాటు ఈ పాలకవర్గాల పదవీ కాలాన్ని ప్రభుత్వం పొడిగించింది. 2025ఆగస్టు 14వ తేదీతో పాలకవర్గాల పదవీ కాలం పూర్తికాగా, ఆ తర్వాత వారినే కొనసాగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా 2025డిసెంబరు 19వ తేదీన పీఏసీఎస్‌ల పాలకవర్గాల ఆకస్మికంగా తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. పాలకవర్గాల స్థానంలో పర్సన్‌ ఇన్‌చార్జీలకు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. కానీ తమను తొలగించి పర్సన్‌ ఇన్‌చార్జీలను నియమిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాల్‌ చేస్తూ కొందరు చైర్మెన్లు హైకోర్టును ఆశ్రయించారు. కొత్త పాలకవర్గాలు నియామకమయ్యేంత వరకు తాజా పాలకవర్గాలనే కొనసాగించాలని వారు అభ్యర్థిం చారు. ఈ మేరకు గత డిసెంబరు 23న తాజామాజీ పాలకవర్గాలను కొనసాగిం చాలని హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే ప్రభుత్వం ఆ పాలకవర్గాలను కొనసాగించేందుకు ఆసక్తి కనబరచలేదు. హైకోర్టు ఆదేశాలను ప్రభుత్వం అమలు చేయకపోవడంతో పీఏసీఎస్‌ల చైర్మెన్లు మరోసారి హైకోర్టును ఆశ్రయించి కోర్టు దిక్కరణ కేసు దాఖలు చేశారు. దీంతో ప్రభుత్వం దిగివచ్చి తాజా మాజీ పాలకవర్గాలు కొనసాగే విధంగా ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకునే వరకు ఈ పాలకవర్గాలు కొనసాగుతాయని ఆ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. దీంతో జిల్లాలో చాలా వరకు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల్లో పాలకవర్గాలు బాధ్యతలు స్వీకరించాయి.

- ఇవీ విధులు..

జిల్లాలోని సహకార సంఘాల ద్వారా రైతులకు పంట రుణాలు, ఎరువులు, ఇతర విత్తనాలు సబ్సిడీ వంటి పరికరాలు ఇతరత్రా పనులు జరుగుతుంటాయి. సహకార సంఘాల చైర్మెన్ల ద్వారా అన్ని రకాల పనులు కొనసాగుతాయి. దీంతో పాటు చైర్మెన ు మండల సమావేశాల్లోనూ ప్రాముఖ్యత ఉంటుంది. ప్రభుత్వ కార్యకలాపాల్లో ప్రొటోకాల్‌ ఉంటుంది. అందుకే ఈ పదవులకు మంచి డిమాండ్‌ ఉంటుంది. నేరుగా ప్రభుత్వం అందించే పలు సంక్షేమ పథకాలు రైతులకు వీరిద్వా రానే అందుతాయి. తమకు అనుకూలంగా ఉండే రైతులకు సహకార సంఘాల ద్వారా లబ్ధి కలిగేలా చూస్తారు. అన్ని ప్రభుత్వ కార్యకలాపాల్లో పాల్గొనే అవకాశం కూడా ఉంటుంది.

Updated Date - May 10 , 2026 | 10:33 PM