Share News

ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజులుం ఉండదిక

ABN , Publish Date - Mar 03 , 2026 | 12:52 AM

మధ్య తరగతి ప్రజలకు పెను భారంగా మారుతున్న ప్రైవేట్‌ పాఠశాల ఫీజుల నియంత్రరణకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోం ది.

ప్రైవేట్‌ పాఠశాలల్లో ఫీజులుం ఉండదిక

నియంత్రణకు శాశ్వత కమిషన్‌

పాఠశాలల స్థాయిలోనే కమిటీలు

ఫీజుల నిర్ణయంలో విద్యార్థుల తల్లిదండ్రుల భాగస్వామ్యం

జిల్లాలో 173 ప్రైవేట్‌ పాఠశాలలు

ప్రతి ఏటా రూ.250 కోట్ల ఫీజులు వసూలు

మధ్య తరగతి ప్రజలకు పెను భారంగా మారుతున్న ప్రైవేట్‌ పాఠశాల ఫీజుల నియంత్రరణకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోం ది. పాఠశాలల్లో కనీస వసతులు లేకున్నా.. అర్హతలు లేని ఉపాధ్యాయులతో బోధన సాగిస్తున్నా పట్టింపు లేకుండాపోతోంది. ఫీజులు మాత్రం ఠంఛన్‌గా వసూలు చేస్తున్నారు. కిండర్‌ గార్డెన్‌ నుంచి పదో తరగతి వరకు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి వేలాది రూపాయల ఫీజులు వసూలు చేస్తున్నారు. విద్య వ్యాపారంగా మారుతున్న ధోరణికి అడ్డుకట్ట వేసేందుకు ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం చట్టబద్దమైన కమిటీల ఏర్పాటు చేయనుంది. ఫీజుల నిర్ణయంలో విద్యార్థుల తల్లిదండ్రులను భాగస్వామ్యం చేస్తూ కొత్త చట్టానికి ప్రభుత్వం రూపకల్పన చేస్తోంది.

- ఆంధ్రజ్యోతి, యాదాద్రి

పాఠశాలల మౌలిక వసతులు, విద్యాప్రమాణాల వంటివి ఖచ్చితంగా అమలు చేయడానికి చట్టంలో కఠిన నిబంధనలు పొందుపర్చి, నిబంధనల ఉల్లంఘనలకు భారీ జరిమానాలు విధించనుంది. ఈ మేరకు ఇంజనీరింగ్‌, మెడికల్‌, ఫార్మసీ, న్యాయ, తదితర డిగ్రీస్థాయిలో ఉన్నత విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు అమలులోగ కమిటీల మాదిరి పాఠశాలల్లో ఫీజుల రెగ్యులేటరీ కమిటీలు అవసరమని విద్యా కమిషన్‌ సూచనల ఆధారంగా శాసనసభలో రాబోయే బడ్జెట్‌ సమావేశాల్లో బిల్లు ప్రవేశపెట్టడానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.

ప్రైవేట్‌ విద్యార్థులే ఎక్కువ

జిల్లాలోని ప్రైవేట్‌, ప్రభుత్వ పాఠశాలల్లో ఒక టో తరగతి నుంచి పదో తరగతి వరకు 92,629 మంది విద్యార్థులు చదువుతున్నారు. వీరిలో ప్రభుత్వ రెసిడెన్షియల్‌, కేజీవీ బీ, మోడల్స్‌ స్కూల్స్‌ మినహాయిస్తే 661 ప్రభుత్వ పాఠశాల ల్లో కేవలం 36,225మంది విద్యాభ్యాసం చేస్తున్నారు. జిల్లాలో 173 ప్రైవేట్‌ పాఠశాలు మాత్ర మే ఉండగా అందులో 41,535 మంది విద్యార్థులు చదువు తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీ్‌ష మీడియం భోదనతో పాటు విశాలమైన తరగతి గదులు, ఆహ్లాదమైన ఆవరణ లు, సుక్షితులైన ఉపాధ్యాయలతో విద్యాభోదన సాగుతోంది. అదే జిల్లాలోని 173 ప్రైవేట్‌ పాఠశాలల్లో 70 శాతం మౌలిక వసతులు, గాలి, వెలుతురు లేదు. మైదానాలు సైతం లేని ఇరుకైన భవనాల్లోనే విద్యాభోధన జరుగుతోంది. ఈ పా ఠశాలల్లో టీటీసీ, డీఎడ్‌, బీఎడ్‌ వంటి శిక్షణ తీ సుకున్న ఉపాద్యాయులు అంతంత మాత్రమే.

రూ.30వేల నుంచి రూ.90 వేల ఫీజులు

జిల్లాలో సీబీఎ్‌సఈ సిలబస్‌ బోధించే పాఠశాలల నుంచి స్టేట్‌ సిలబస్‌ వరకు ప్రైవేట్‌ పాఠశాలలు ఉన్నాయి. ట్యూషన్‌ ఫీజుల రూపేణా కేవలం ఏడాదికి తక్కువలో తక్కువగా రూ.30వేల నుంచి అత్యధికంగా రూ.90వేల వరకు వసూలు చేస్తున్నారు. ఈ విధంగా జిల్లాలో ప్రతిఏటా ప్రైవేట్‌ పాఠశాలల విద్యార్ధుల నుంచి రూ.250 కోట్ల ఫీజు వసూలు చేస్తున్నారని అంచనా. తరగతుల ఆధారంగా కొన్ని హెచ్చుతగ్గులున్నా. గ్రామీణ వాతావరణంతో పాటు ఆర్థికంగా వెనుకబాటు, అల్పాదాయ వర్గాల ప్రజలు ఈ ఫీజులు తీవ్ర భారంగా మారుతున్నాయని భావిస్తున్నారు. ఏడాదికి ఏడాది ఫీజుల మొత్తాన్ని పెంచుకుంటూ పోతున్నాయి. ఫీజుల పెంపు నిర్ణయంతో యాజమాన్యానికి జవాబుదారితనం లేకపోవడంతో ప్రైవేట్‌ విద్యాసంస్థల్లో ఫీజుల నియంత్రణపై ప్రభుత్వం దృష్టి సారించింది.

జిల్లా, పాఠశాల స్థాయిలో కమిటీలు

ఫీజుల నియంత్రణకు ప్రభుత్వం తీసుకురానున్న బిల్లులో శాశ్వత కమిషన్‌ ఏర్పాటును ప్రతిపాదించింది. హైకోర్టు, సుప్రీంకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి, లేదా రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారిని ఈ కమిషన్‌కు. చైర్మెన్‌గా నియమించనున్నట్లు తెలుస్తోంది. విద్యావేత్త వైస్‌ చైర్మెన్‌గా ఆర్ధిక నిపుణులతో పాటు అడ్మినిస్ట్రేటివ్‌ రంగంలో అనుభవం గలవారు సభ్యులుగా ఉంటారు. ఈ కమిషన్‌కు జ్యుడిషియల్‌ అధికారాలు ఇచ్చి అవనసరమైతే పాఠశాలల రికార్డులు స్వాధీనం చేసుకునే అధికారం కట్టబ్టెనున్నారు. అదే విధంగా పాఠశాలల స్థాయిలో సైతం పది మందితో కమిటీని ఏర్పాటు చేసి, అందులో పాఠశాల యాజమాన్యం, ప్రధానోపాద్యాయలు, ఉపాధ్యాయులతో పాటు ఉపాధ్యాయుల తల్లిదండ్రులు సైతం సభ్యులుగా ఉండనున్నారు. జిల్లాస్థాయిలో ఫీజు నియంత్రణ కమిటీలో కలెక్టర్‌ చైర్మెన్‌గా, డీఈవో కన్వీనర్‌గా, డీటీవో సభ్యుడిగా ముగ్గురితో కమిటీని ఏర్పాటు చేయాలని ముసాయిదా బిల్లులో పొందుపరుస్తున్నారు.

ఉల్లంఘనలకు తప్పదు భారీ జరిమానా

పాఠశాల విద్యార్థుల ఫీజుల నియంత్రణ చట్టం నిబంధనలు ఉల్లంఘనలకు పాల్పడే యాజమాన్యాలపై భారీ జరిమానాలు విధించే విధంగా పొందుపరుస్తున్నారు. మొదటి సారి ఉల్లంఘిస్తే రూ.5లక్షల వరకు, రెండో సారి ఉల్లంఘనలను గుర్తిస్తే రూ.10లక్షల వరకు జరిమానా విధించే విధంగా నిబంధనలు పెడుతున్నారు. మూడో సారి పాఠశాల గుర్తింపు రద్దుకు చర్యలు ఉండే విధంగా చట్టం రూపకల్పన చేస్తున్నారు. అధిక ఫీజు వసూలు చేసినట్టు రుజువైతే ఆ విద్యార్థి తల్లిదండ్రులు చెల్లించిన ఫీజుకు రెట్టింపు యాజమాన్యం చెల్లించాల్సి ఉంటుంది.

ఫీజుల అనుమతులపై చట్టంలో స్పష్టత

ఫీజుల నియంత్రణకు, రెగ్యులేషన్‌కు ప్రభుత్వం తెస్తున్న ముసాయిదాలో పాఠశాలలో ఏ ఫీజులు వసూలు చేయాలి, ఏవీ చేయకూడదనేది స్పష్టంగా పేర్కొంటున్నారు. ప్రస్తుతం కొన్ని పాఠశాలల్లో అమలు చేస్తున్న అడ్మిషన్‌ ఫీజు, డోనేషన్‌, బిల్డింగ్‌ ఫండ్‌, యూనిఫాం వంటి అదనపు ఫీజులు వసూలు చేయకూడదు. యూనిఫాం, పుస్తకాల వంటివి విక్రయించి వ్యాపారం చేయవద్దు. ట్యూషన్‌ ఫీజును వార్షికంగా ఏకరీతిగానే వసూలు చేయాలి. ఐచ్చికం సేవలుగా స్కూల్‌ బస్సు రవాణా, బోర్డింగ్‌, ప్రత్యేక కోచింగ్‌ వంటి సేవలకు ప్రత్యేకంగా ఫీజులువసూలు చేసుకోవచ్చు. ఫీజుల పెంపు రెండేళ్లకోసారి ధరల సూచికి అనుగుణంగా మాత్రమే చేయాలి.

జిల్లాలోని ప్రైవేట్‌, ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు...

ప్రభుత్వ పాఠశాలలు 661

విద్యార్ధుల సంఖ్య 36,225

ప్రభుత్వ రెసిడెన్షియల్‌ పాఠశాలలు 19

విద్యార్ధుల సంఖ్య 6,175

కస్తూర్బా బాలికల విద్యాలయాలు 11

విద్యార్ధుల సంఖ్య 2,074

మోడల్స్‌ స్కూల్‌ 07

విద్యార్ధులు 2,470

ప్రైవేట్‌ పాఠశాలలు 173

విద్యార్థులు 41,535

Updated Date - Mar 03 , 2026 | 12:52 AM