Share News

లబ్ధిదారుల స్థితిగతులు పరిశీలించాలి

ABN , Publish Date - Jun 11 , 2026 | 11:00 PM

జిల్లాలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎల్‌1 జాబితాలో ఉన్న లబ్ధిదారుల స్థితిగతులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని జిల్లా కలెక్టర్‌ కె హరిత అన్నారు. సమీకృత జిల్లా కలెక్టర్‌ భవన సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి గురువారం అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌ కలిసి జిల్లాలోని మండల అభివృద్ధి అధికారులు, ఎంపీవోలు, సెర్ప్‌ ఎంపీఎం, ఈజీఎస్‌, ఏపీవోలు, పంచాయతీ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.

లబ్ధిదారుల స్థితిగతులు పరిశీలించాలి
: సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ కె.హరిత, పాల్గొన్న అధికారులు

ఆసిఫాబాద్‌, జూన్‌ 11 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో రెండో విడత ఇందిరమ్మ ఇళ్ల కోసం ఎల్‌1 జాబితాలో ఉన్న లబ్ధిదారుల స్థితిగతులు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని జిల్లా కలెక్టర్‌ కె హరిత అన్నారు. సమీకృత జిల్లా కలెక్టర్‌ భవన సముదాయంలోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌ నుంచి గురువారం అదనపు కలెక్టర్‌ యువరాజ్‌ మర్మాట్‌ కలిసి జిల్లాలోని మండల అభివృద్ధి అధికారులు, ఎంపీవోలు, సెర్ప్‌ ఎంపీఎం, ఈజీఎస్‌, ఏపీవోలు, పంచాయతీ కార్యదర్శులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెండో విడత ఇందిరమ్మ ఇళ్లు, ఇంకుడు గుంతల నిర్మాణం, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపట్టే గ్రామ సచివాలయ భవనాలు, పాఠశాల ప్రహారి గోడల నిర్మాణంపై కలెక్టర్‌ సుదీర్ఘంగా సమీక్షించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఇళ్ల లబ్ధిదారుల క్షేత్రస్థాయి పరిశీలన ఎల్‌1 జాబితాలో గల గుడిసెలు ఉన్న వారి ఇళ్ల దగ్గరకు వెళ్లి, వారి సామాజిక ఆర్థిక స్థితిగతులను క్షుణ్ణంగా పరిశీలిం చాలన్నారు. అర్హులైన లబ్ధిదారుల వివరాలను ప్రభుత్వ నిబంధనల ప్రకారం నమోదు చేసి జాబితాను సిద్దం చేయాలని, క్షేత్రస్థాయిలో ఇందిరమ్మ కమిటీలు, మహిళా సంఘాల సభ్యుల సహకారం కూడా తీసుకోవాలని సూచించారు. సమావేశంలో డీఆర్‌డీవో దత్తారావు, హౌసింగ్‌ పీడీ ప్రకాష్‌రావు, ఈఈలు, డీఈ లు, ఏఈఈలు, ఎంపీడీవోలు, ఎంపీఓలు, ఏపీఎంలు, ఏపీవోలు పాల్గొన్నారు.

ల్స్‌ పోలియోకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి

జిల్లాలో ఈ నెల 28న నిర్వహించే పల్స్‌ పోలియో కార్యక్రమం, జూలై 13న నిర్వహించే జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవం కార్యక్రమాలను నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. కలెక్టరేట్‌ భవన సముదాయంలోని సమావేశ మందిరంలో జాతీయ పల్స్‌ పోలియో, జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవాల ముందస్తు ఏర్పాట్లపై గురువారం సంబంధిత శాఖల అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జాతీయ పల్స్‌ పోలియో దినోత్సవం సందర్భంగా ఈ నెల 28న 0 నుంచి ఐదేళ్ల లోపు పిల్లందరికి తప్పని సరిగా పల్స్‌ పోలియో వ్యాక్సిన్‌ అందించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా 5 సంవత్సరాల లోపు పిల్లలు 46,516 మంది ఉన్నారని చెప్పారు. వారి కోసం జిల్లా వ్యాప్తంగా 670 పల్స్‌ పోలియో వ్యాక్సినేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నామని తెలిపారు. మరోవైపు రద్దీగా ఉండే ప్రాంతాలలో, ప్రయాణాల్లో ఉండే పిల్లల కోసం బస్‌ స్టాండ్‌, రైల్వే స్టేషన్లలో సుమారు 18 మొబైల్‌ వ్యాక్సినేషన్‌ కేంద్రాలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ఈ నెల 28న పోలియో బూత్‌లలో చుక్కలు వేయించుకోలేక పోయిన పిల్లల కోసం 29, 30 తేదీల్లో వైద్య ఆరోగ్య సిబ్బంది నేరుగా ఇంటింటికి వెళ్లి పోలియో చుక్కలు వేయాలన్నారు. జూలై 13న నిర్వహించే జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లాలో 1 నుంచి 19 సంవత్సరాల లోపు వయస్సు గల పిల్లలు, యువత అందరికి నులి పురుగుల నివారణ మాత్రలు అందించాలని సూచించారు. జిల్లాలో 1,67,702 మంది ఉన్నారని గుర్తించినట్లు తెలిపారు. వీరందరికి అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో, అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా మాత్రలు పంపిణీ చేయనున్నామని తెలిపారు. కార్యక్రమంలో రెవెన్యూ అధికారి వేణు, జిల్లా వైద్యాధికారి సీతారాం, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 11 , 2026 | 11:00 PM