kumaram bheem asifabad- రాష్ట్ర ప్రభుత్వం తుమ్మిడిహెట్టి నిర్మించాలి
ABN , Publish Date - Jun 16 , 2026 | 10:55 PM
కుమరం భీం జిల్లాకు నీరిచ్చే ప్రాణహిత ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించి తీరాలని,, తుమ్మిడిహెట్టి గడ్డ నుంచి సవాలు విసురు తున్నానని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. కుమరం భీం జిల్లా కౌటాల మండలంలోని తుమ్మిడిమెట్టి వద్ద గల ప్రాణహిత నదిని మంగళవారం సందర్శించిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. ఇప్పటి వరకు ఐదుగురు ముఖ్యమంత్రులు రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి, కేసీఆర్, రేవంత్‌రెడ్డిలు మారినప్పటికీ తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టును కట్టలేక పోయారని ఈ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు
- ఇక్కడి ఎమ్మెల్యే ఏ పార్టీలో ఉన్నారో తెలియడం లేదు
- టీఆర్‌ఎస్ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
కౌటాల, జూన్ 16 (ఆంధ్రజ్యోతి): కుమరం భీం జిల్లాకు నీరిచ్చే ప్రాణహిత ప్రాజెక్టును కాంగ్రెస్ ప్రభుత్వం నిర్మించి తీరాలని,, తుమ్మిడిహెట్టి గడ్డ నుంచి సవాలు విసురు తున్నానని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. కుమరం భీం జిల్లా కౌటాల మండలంలోని తుమ్మిడిమెట్టి వద్ద గల ప్రాణహిత నదిని మంగళవారం సందర్శించిన అనంతరం నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. ఇప్పటి వరకు ఐదుగురు ముఖ్యమంత్రులు రాజశేఖర్‌రెడ్డి, రోశయ్య, కిరణ్‌కుమార్‌రెడ్డి, కేసీఆర్, రేవంత్‌రెడ్డిలు మారినప్పటికీ తుమ్మిడిహెట్టి వద్ద ప్రాణహిత ప్రాజెక్టును కట్టలేక పోయారని ఈ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేశారని ఆరోపించారు. సిర్పూర్ నియోజక వర్గంలో లక్ష ఎకరాలకు నీళ్లు ఇచ్చే ప్రాజెక్టును నిర్మించలేక పోవడం బాధకరమన్నారు. రాజశేఖర్‌రెడ్డి మహారాష్ట్రతో ఎలాంటి ఒప్పందం లేకున్నా కాలువలు తవ్వి కాంట్రాక్టర్ల జేబులు నింపారని పేర్కొన్నారు. అధికారంలోకి రాగానే ప్రాణహిత ప్రాజెక్టు చేపడుతామని ప్రగ్భాలు పలికిన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 30 నెలలు గడిచినా ప్రాజెక్టు నిర్మాణం చేపట్టడం లేదని, మహారాష్ట్ర ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదన్న సాకుతో ప్రాజెక్టు నిర్మాణం ఎగ్గొట్టే అవకాశం ఉందన్నారు. అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్ 148 మీటర్ల ఎత్తుతో ఒప్పందం కుదుర్చుకున్నారని ఆ ఒప్పందంతోనైనా ప్రాజెక్టు నిర్మాణం చేపడితే బాగుంటుందని చెప్పారు. కానీ నేటి కాంగ్రెస్ ప్రభుత్వం 150 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్టు నిర్మాణం చేపడుతామని చెవిలో పువ్వులు పెడుతున్నారని ఇదంతా బీజేపీ ఎంపీ కిషన్ రెడ్డిపై నెట్టుతున్నారని, అసలు కాంగ్రెస్ ప్రభుత్వానికి ప్రాజెక్టు నిర్మించే ఉద్దేశం లేదని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆరు గ్యారెంటీలు మాయమయ్యాయని, పెన్షన్‌లు లేవు, తులం బంగారం లేదు, మహిళలకు రూ.2500 రావడం లేదని ఎద్దేవా చేశారు. యూరియా కోసం తిప్పలు తప్పడం లేదని, యాప్ ద్వారా యూరియా కొందామనుకుంటూ సిగ్నల్స్ అందక చెట్లు గుట్టలు ఎక్కాల్సి వస్తుందన్నారు. ప్రభుత్వం వడ్లు కొనక పోతే సెక్రెటరీయేట్ వద్ద తానే కొట్లాడానని గుర్తు చేశారు. గత టీఆర్‌ఎస్ బీఆర్‌ఎస్‌గా మారి ఈ ప్రాంత సమస్యలను గాలికి వదిలేసిందని, తెలంగాణలో అన్ని జాతీయ పార్టీలే ఉన్నాయని తెలంగాణ రక్షణ సేన మాత్రమే ప్రాతీయ పార్టీ అన్నారు. తాను పాతదాన్నేనని పార్టీ మాత్రమే కొత్తదని మీ బిడ్డగా టీఆర్‌ఎస్ పార్టీతో మీ ముందుకు వస్తున్నానని వివరించారు. పాంచజన్యంతో అయిదు సూత్రాలతో అభివృద్ధికి పాటు పడుతానని తెలిపారు. మొదటిది ఉచిత విద్య ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఉచిత విద్యతో విద్యాభివృద్ధి చేస్తానని, రెండోది ఉచిత వైద్యం అని ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేటు ఆసుపత్రుల్లో కూడా ఉచితంగా చికిత్సలు అందజేస్తామని అన్నారు. మూడోది ప్రొఫెసర్ జయశంకర్ కోరినట్లుగా సామాజిక న్యాయం, నాల్గవది నిరుద్యోగులకు ఉపాధి కల్పించేందుకు ప్రత్యేక రుణాలు ఇస్తామని, ఐదోవది ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో రైతుకు ప్రత్యేక కుర్చీ ఏర్పాటు చేసి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని అన్నారు. సిర్పూర్ బీజేపీ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్‌బాబు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో మాట్లాడుతున్నారని విమర్శించారు. బీజేపీ ఎమ్మెల్యేనా, లేక కాంగ్రెస్ ఎమ్మెల్యేనా అర్థం కావడం లేదని విమర్శించారు. సిర్పూర్ నియోజకవర్గంలో ఉద్యమ కారుడు, రెండు సార్లు ఎమ్మెల్యేగా కొనసాగిన కావేటి సమ్మయ్య కోడలు, కుమారుడిని ప్రజలు ఆదరించాలన్నారు. అంతకంటే ముందు అంబేద్కర్ విగ్రహానికి పూల మాలలు వేసి ప్రాణహిత నది తీరాన ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ మంత్రి బోడ జనార్దన్, స్థానిక నాయకులు కావేటి సబిత, మనోహర్, రియాజ్, వినోద్, కరుణాకర్, అనిల్ తదితరులు పాల్గొన్నారు.
ఎస్పీఎంలో ట్రేడ్ యూనియన్ ఎన్నికలు నిర్వహించాలి
కాగజ్‌నగర్, (ఆంధ్రజ్యోతి): ఎస్పీఎం మిల్లులో వెంటనే ట్రేడ్ యూనియన్ ఎన్నికలు నిర్వహించాలని టీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల కవిత డిమాండు చేశారు. కాగజ్‌నగర్ ఎస్పీఎం గేటు ఎదుట వివిధ సంఘాల ఆధ్వర్యంలో చేపడుతున్న రిలే నిరాహార దీక్షలను మంగళవారం ఆమె సందర్శించి మద్దతు పలికారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంల ఆమె మాట్లాడుతూ ఎస్పీఎంలో ఎనిమిది సంవత్సరాలుగా ట్రేడ్ యూనియన్ ఎన్నికలు నిర్వహించక పోవటం దారుణమన్నారు. అప్పటి పరిస్థితుల బట్టి ఈ ప్రాంత కార్మికులకు న్యాయం జరుగాలన్న ఉద్దేశ్యంతో ఎస్పీఎంను పునరుద్ధరించినట్టు తెలిపారు. కాని ప్రస్తుతం ఇక్కడి కార్మికులకు పూర్తిగా అన్యాయం జరుగుతుందన్నారు. మిల్లులో స్థానికేతరులు అధికంగా ఉన్నారని, ఈ ప్రాంత వారు తక్కువ మంది ఉన్నట్టు తెలిపారు. 95 శాతం ఈ ప్రాంతం వారు ఉండాల్సిందేనని చెప్పారు. . మాజీ మంత్రి బోడ జనార్దన్ మాట్లాడుతూ ఎస్పీఎంలో యాజమాన్యం కార్మికుల హక్కులను కాలరాస్తున్నదని అన్నారు. వెంటనే ట్రేడ్ యూనియన్ ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సిర్పూరు నియోజకవర్గ టీఆర్‌ఎస్ ఇన్‌చార్జి కావేటి సబిత మనోహర్‌తో పాటు పలు ట్రేడ్ యూనియన్ సంఘాల నాయకులు పాల్గొన్నారు. కాగా కౌటాలలో జరిగే కార్యక్రమానికి వెళ్లుతున్న సందర్భంగా కాగజ్‌నగర్‌కు మధ్యాహ్నం చేరుకున్నారు. పలువురు ఆమెకు పుష్పగుచ్చాలు అందజేసి ఘనంగా స్వాగతం పలికారు. తెలంగాణ తల్లి విగ్రహం వద్ద పూజలు చేశారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పూల మాల వేశారు. ఈ సందర్భంగా స్థానిక నాయకులు, అభిమానులు కలిసి పలు సమస్యలను ఆమె దృష్టికి తెచ్చారు. అలాగే అభిమానులు ఫోటోలు దిగేందుకు అధిక సంఖ్యలో వచ్చారు. అనంతరం ఇక్కడి నుంచి బయలు దేరి నేరుగా తుమ్మిడిహెట్టికి వెళ్లిపోయారు.