విజ్ఞాన భాండాగారాలపై నిర్లక్ష్యం నీడ..
ABN , Publish Date - Nov 14 , 2026 | 02:11 AM
విజ్ఞాన ఆలయాలు.. భాండాగారంగా విలసిల్లిన గ్రంథాలయ వ్యవస్థ నిర్వీర్యంగా మారుతుంది. స్వాతంత్య్ర ఉద్యమ కాలం నుంచి నిరంకుశ విధానాలపై జనాన్ని చైతన్యవంతం చేసే దిశగా గ్రంథాలయాలు కీలకపాత్ర నిర్వహించాయి. గ్రంథాలయాలపై పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతూ
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
విజ్ఞాన ఆలయాలు.. భాండాగారంగా విలసిల్లిన గ్రంథాలయ వ్యవస్థ నిర్వీర్యంగా మారుతుంది. స్వాతంత్య్ర ఉద్యమ కాలం నుంచి నిరంకుశ విధానాలపై జనాన్ని చైతన్యవంతం చేసే దిశగా గ్రంథాలయాలు కీలకపాత్ర నిర్వహించాయి. గ్రంథాలయాలపై పాలకుల నిర్లక్ష్యానికి అద్దం పడుతూ అరకొర వసతులు, సిబ్బంది కొరత, నిధుల లేమి వంటి సమస్యలతో గ్రంథాలయాలు నేటితరానికి దూరమవుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఆధునిక వసతులతో నిర్మించిన జిల్లా కేంద్ర గ్రంథాలయం నిరుద్యోగ యువతీ, యువకులకు బాసటగా నిలుస్తోంది. గ్రామీణ ప్రాంత యువతకు మాత్రం ఊతం ఇవ్వలేకపోతున్నాయి. జిల్లాలో వేములవాడలో నూతన భవనాన్ని నిర్మించారు.బోయిన్‌పల్లి, ఎల్లారెడ్డిపేట, ఇల్లంతకుంట, చందుర్తి మండల గ్రంధాలయాలకు అరకొర వసతులతో భవనాలు ఉండగా, ముస్తాబాద్‌లో గ్రామపంచాయతీ ఇచ్చిన రేకుల షెడ్డులో, గంభీరావుపేటలో భవనం శిథిలావస్థకు చేరడంతో కేజీ టు పీజీ కాలేజీలోని గదుల్లో కొనసాగిస్తున్నారు. ప్రతి సంవత్సరం నవంబర్ 14 నుంచి 20వ తేదీ వరకు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను నిర్వహిస్తున్న గ్రంథాలయాల అభివృద్ధి వైపు దృష్టి పెట్టకపోవడంపై సాహిత్యకారులు, పాఠకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వేధిస్తున్న సిబ్బంది కొరత..
రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేంద్ర గ్రంథాలయం, మరో 8 మండల శాఖ గ్రంథాలయాల్లో సిబ్బంది లేక నిర్వహణ అస్తవ్యస్తంగానే కొనసాగుతోంది. శాఖ గ్రంథాలయాల్లో లైబ్రేరియన్ ఎంతో పాటు ఇద్దరు సిబ్బంది ఉండాలి. కానీ జిల్లాలో లైబ్రేరియన్లు లేని పరిస్థితి ఉంది. జిల్లా కేంద్ర గ్రంథాలయంలో గ్రేడ్-2 లైబ్రేరియన్ ఒకరు, గ్రేడ్-3 లైబ్రేరియన్ ఒకరు ఉన్నారు. మిగతా ఎనిమిది శాఖా గ్రంథాలయాల్లో గంభీరావుపేట, బోయినపల్లి గ్రంథాలయాలకు మాత్రమే లైబ్రేరియన్లు ఉన్నారు. ఇల్లంతకుంట, ఎల్లారెడ్డిపేటలో పార్ట్‌టైం ఉద్యోగి, కోనరావుపేట, వేములవాడలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు పనిచేస్తున్నారు. చందుర్తి, ముస్తాబాద్ ఇన్‌చార్జి లైబ్రేరియన్‌లు ఉండగా వారు రాని రోజుల్లో స్వీపర్లే గ్రంథాలయ నిర్వాహకులుగా పనిచేస్తున్నారు.
సెస్ చెల్లించని గ్రామపంచాయతీలు..
జిల్లాలోని కేంద్ర గ్రంథాలయంతో పాటు బోయినపల్లి, చందుర్తి, ఇల్లంతకుంట, ఎల్లారెడ్డిపేట, కోనరావుపేట, ముస్తాబాద్, వేములవాడ, గంభీరావుపేట శాఖ గ్రంథాలయాల అభివృద్ధికి నిధులు ఆటంకంగా మారుతున్నాయి. జిల్లాలోని గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల నుంచి లైబ్రరీ సెస్ కింద 8శాతం పన్నులు వసులవుతున్నా గ్రంథాలయాలకు మాత్రం వాటా చేరడం లేదు. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీల నుంచి కొంతమేరకు సెస్ చెల్లిస్తున్నా గ్రామపంచాయతీల్లో నుంచి మాత్రం బకాయిలు వెక్కిరిస్తున్నాయి. ప్రతి సంవత్సరం రాజన్న సిరిసిల్ల జిల్లాలోని 260 గ్రామపంచాయతీలో నుంచి 8 శాతం వాటా కింద దాదాపు రూ.66.44 లక్షలు వసూలు చేస్తారు. సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీ నుంచి సుమారుగా 56 లక్షల వరకు వసూలు అవుతుంది. ఇందులో ఇప్పటికి లక్షల్లో గ్రామపంచాయతీ నుంచి గ్రంథాలయాలకు నిధులు రావాల్సి ఉంది. గ్రంథాలయాల అభివృద్ధి కోసం వసూలు చేస్తున్న పన్నులు విద్యార్థులు, నిరుద్యోగ యువతకు ఎంతో విజ్ఞానాన్ని అందించడానికి ఉపయోగపడుతున్న గ్రంథాలయాలకు చెల్లించకపోవడంపై పాఠకుల నుంచి నిరసనలు వ్యక్తం అవుతున్నాయి.
జిల్లా గ్రంథాలయంలో 1.10 లక్షల పుస్తకాలు..
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని జిల్లా కేంద్ర గ్రంథాలయం, మండల శాఖ గ్రంథాలయాలు ఉన్నాయి. జిల్లా కేంద్ర గ్రంథాలయాల్లో 7628 సభ్యులు ఉండగా, 1.10 లక్షల వరకు పుస్తకాలు ఉన్నాయి. జిల్లా కేంద్రంలో వార్తాపత్రికలు, వివిధ రకాల పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి, విద్యార్థులకు, నిరుద్యోగ యువతకు, చిన్నారులు, వృద్ధులు, మహిళలకు ఉపయోగపడే పుస్తకాలు ఉన్నాయి. అలాగే పరిశోధనకు సమాచారం లభించే రిఫరెన్స్ గ్రంథాలు కూడా ఉన్నాయి. తెలుగు, ఇంగ్లీష్, హిందీ, ఉర్దూ భాషల దినపత్రికలు వివిధ వార, పక్ష, మాస పత్రికలు అందుబాటులో ఉంటున్నాయి.
జిల్లా గ్రంథాలయంలో 35 వేల పుస్తకాలు...
మండల కేంద్రాల్లో ఉన్న గ్రంథాలయాల్లో పుస్తకాలు, సౌకర్యాలు లేకపోవడంతో జిల్లా గ్రంథాలయానికి వచ్చి నిరుద్యోగులు చదువుకుంటున్నారు. సిరిసిల్ల కేంద్రంలో ఆధునిక సౌకార్యలతో నిర్మించిన సినారె స్మారక గ్రంథాలయం నిరుద్యోగులతో కిటకిటలాడుతుంది. ఉద్యోగ ప్రకటన వెలువడక ముందు గ్రంథాలయానికి నిత్యం 300 మంది గ్రంథాలయానికి వస్తున్నారు. స్థలం సరిపోక ఎదురుచూసే పరిస్థితి ఉంది. జిల్లా కేంద్రం లైబ్రరీలో 35 వేల పుస్తకాలు ఉండగా, ఇందులో పోటీ పరీక్షలకు సంబంధించి 15వేలు, ఇతర రచనల పుస్తకాలు 20 వేల వరకు ఉన్నాయి. ఇందులో తెలుగు పుస్తకాలు 22 వేలు, ఇంగ్లీష్ పుస్తకాలు 10500, హిందీ పుస్తకాలు 1650, ఉర్దూ పుస్తకాలు 850 ఉన్నాయి. వీటితో పాటు 11 రకాల దినపత్రికలు, 15 మాస పత్రికలు, రెండు వార పత్రికలు, పోటీ పరీక్షల పత్రికలు 5 వస్తున్నాయి. నిరుద్యోగులకు అనుగుణంగా లైబ్రరీ నోటిఫికేషన్లను అనుగుణంగానే పుస్తకాలు పెంచే విధంగా దృష్టి పెట్టారు. మరోవైపు గ్రంథాలయంలో కంప్యూటర్లు, టాస్క్ శిక్షణ కేంద్రాలు కూడా ఉన్నాయి.
వారోత్సవాలకు ఏర్పాట్లు..
రాజన్న సిరిసిల్ల జిల్లా వ్యాప్తంగా కేంద్ర గ్రంథాలయంతో పాటు, శాఖా గ్రంథాలయాల్లో ఈనెల 14 నుంచి 20వ తేదీ వరకు జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. 14వ తేదీన గ్రంథాలయ వారోత్సవాల ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహిస్తారు. 15న పుస్తక ప్రదర్శన, ఏడో తరగతి వరకు పుస్తకం పేరు, రచయిత పేరు మెమరీ టెస్ట్, 16న వ్యాసరచన పోటీలు ఇందులో ఏడో తరగతి వరకు విద్యార్థులకు చిత్రలేఖనం, రైటింగ్ పోటీలు, 10వ తరగతి విద్యార్థులకు పుస్తకం నాకు మంచి మిత్రుడు వ్యాసరచన పోటీలు, 17న కళాశాల విద్యార్థులకు ఉపన్యాస పోటీల్లో గ్రంథాలయ విలువ, మన బాధ్యత. 18న పాటల పోటీల్లో చదువు, జ్ఞానం సాక్షరత వాటిపై పాటలు పాడాల్సి ఉంటుంది. 19న రంగోళి, మెహందీ పోటీలు పాఠశాల, కళాశాల విద్యార్థినులు, మహిళలకు నిర్వహిస్తారు.