kumaram bheem asifabad-గెలుపు గుర్రాల కోసం అన్వేషణ
ABN , Publish Date - Jan 25 , 2026 | 09:41 PM
మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రధాన రాజకీయ పార్టీలు బలమైన అభ్యర్థులను బరిలో నిలిపేందుకు అన్వేషిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు గుర్రాల కోసం అన్ని పార్టీలు అభ్యర్థులను వెతుకుతున్నాయి. షెడ్యూల్ వచ్చే నాటికి అభ్యర్థులను ఖరారు చేసుకొని రంగంలోకి దింపేందుకు అన్ని పార్టీలు సన్నాహాలు చేస్తున్నాయి.
- టికెట్ల కోసం అన్ని పార్టీల్లోనూ తీవ్ర పోటీ
- పొంచి ఉన్న రెబల్స్ బెడద
- షెడ్యూల్ విడుదలయితే వేడెక్కనున్న రాజకీయం
కాగజ్‌నగర్ టౌన్, జనవరి 25 (ఆంధ్రజ్యోతి): మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న ప్రధాన రాజకీయ పార్టీలు బలమైన అభ్యర్థులను బరిలో నిలిపేందుకు అన్వేషిస్తున్నాయి. మున్సిపల్ ఎన్నికల్లో గెలుపు గుర్రాల కోసం అన్ని పార్టీలు అభ్యర్థులను వెతుకుతున్నాయి. షెడ్యూల్ వచ్చే నాటికి అభ్యర్థులను ఖరారు చేసుకొని రంగంలోకి దింపేందుకు అన్ని పార్టీలు సన్నాహాలు చేస్తున్నాయి. ఇందుకోసం అన్ని వార్డుల్లో ఒక్కరి కంటే ఎక్కువ మంది పేర్లను పరిశీలిస్తున్నాయి. కాగజ్‌నగర్ మున్సిపాలిటీలో 30 వార్డుల పరిధిలో 51,205 మంది ఓటర్లు ఉన్నారు. ఆయా పార్టీలు సామాజిక వర్గాలను బట్టి రిజర్వేషన్లు తారుమారు కాగా గతంలో పోటీ చేసిన వారికి ఈసారి ఛాన్స్ దక్కలేదు. రిజర్వేషన్ అనుకూలంగా లేని చోట ఇతర వార్డుల్లో పోటీకి ఆలోచన చేస్తున్నారు.
- రెండు మున్సిపాలిటీల పరిధిలో..
జిల్లా వ్యాప్తంగా కాగజ్‌నగర్‌లో 30, ఆసిఫాబాద్‌లో 20 వార్డులకు ఎన్నికలు జరుగుతాయి. ఆసిఫాబాద్‌లో 20 వార్డుల్లో 13,927 మంది ఓటర్లుండగా, కాగజ్‌నగర్‌లో 51,205 మంది ఉన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్, బీజేపి, బీఆర్‌ఎస్ పార్టీల్లో అభ్యర్థులు టిక్కెట్స్ కోసం టెన్షన్ పడుతున్నారు. ఆయా వార్డుల్లో టిక్కెట్లు దక్కించుకునేందుకు ఇప్పటికే అన్ని పార్టీల్లో పైరవీలు ప్రారంభించారు. రిజర్వేషన్ ప్రకారం కొన్ని వార్డుల్లో అభ్యర్థులు దొరకని పరిస్థితి ఉంటే మరి కొన్ని వార్డుల్లో పలువురు పోటీ పడేందుకు ఉత్సాహంగా ఉన్నారు. దీంతో ఏం చేయాలో నాయకులకు అర్ధం కాని పరిస్థితి ఉంది. దీంతో ఇప్పటికే పలుమార్లు నాయకులు, కార్యకర్తలతో సమావేశాలు ఏర్పాటు చేసి గెలుపు గుర్రాల కోసం పరిశీలిస్తున్నారు. కాగా జిల్లాలో మున్సిపాలిటీల్లోని ఆయా వార్డుల్లో ప్రజాభిప్రాయం మేరకే ప్రధాన పార్టీలు టికెట్లను కేటాయించే అవకాశం ఉంది. ఈ విషయంలో సంబంధిత వార్డుల్లోని పార్టీ ద్వితీయ శ్రేణి నాయకులు, ముఖ్య కార్యకర్తల సూచనలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే టికెట్లను ఫైనల్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. గెలుపు గుర్రాలను బరిలో నిలిపేందుకు ఆయా పార్టీల నాయకులు ప్రయత్నిస్తున్నారు. ఎలాగైనా ఈ సారి ఎన్నికల్లో కాగజ్‌నగర్ మున్సిపాల్టీలో బీజేపీ కైవసం చేసుకునేలా పావులు కదుపుతున్నారు. బీఎస్పీ కూడా 30 వార్డులో తమ అభ్యర్థులను బరిలో దింపేందుకు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటోంది. ప్రతీ వార్డు నుంచి నాలుగు ప్రధాన పార్టీ అభ్యర్థులు మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు బరిలో ఉండే అవకాశాలున్నాయి.
- ఓటర్లను పలకరిస్తూ..
ఆయా పార్టీల అభ్యర్థులు బరిలో ఉండేందుకు ఇప్పటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించి వార్డుల్లో ఓటర్లను కలుస్తున్నారు. ప్రధాన పార్టీల టిక్కెట్లు రాకున్న కూడా బరిలో ఉంటామని తాడోపేడో తేల్చుకుంటామని సంకేతాలు ఇస్తున్నారు. మరి కొంత మంది అదిష్టానం, ముఖ్య నాయకులు న్యాయం చేస్తారనే నమ్మకంతో ముందుకు వెళుతున్నారు. దీంతో ఆశావహుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా బరిలోకి దిగేందుకు అవసరమైన మద్దతు కూడగట్టుకునేందుకు ఆశావహులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. కులాల వారీగా ఆయా సంఘాల నేతలను కలవడానికి ఎత్తులు వేస్తు న్నారు. ఆయా వర్గాల వారీగా ఓట్లను రాబట్టుకోవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. పలు వార్డుల్లో పోటీ చేసే ఆశావహులు ఇప్పటికే సొంత ఖర్చులతో పనులు చేపడుతున్నారు. మరి కొంత మంది సోషల్ మీడియాలో గ్రూపులు ఏర్పాటు చేసి ఓటర్లును ప్రసన్నం చేసుకునేందుకు ఫొటోలు, వీడియోలతో పోస్టులను పెడుతున్నారు. ఏదైమైనా ఆశావహులు ఇప్పటి నుంచే పోటీ ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. షెడ్యూల్ విడుదలయితే ఎన్నికల వేడి ముమ్మరమవుతుందని పరిశీలకులు చెబుతున్నారు.