kumaram bheem asifabad-గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్‌ల పాత్ర కీలకం
ABN , Publish Date - Feb 19 , 2026 | 10:54 PM
గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్‌ల పాత్ర కీలకమని కలెక్టర్ కె హరిత అన్నారు. కాగజ్‌నగర్ పట్టణంలోని మైనార్టీ సంక్షేమ పాఠశాలలో ఆసిఫాబాద్, కెరమెరి, తిర్యాణి మండలాల నూతన సర్పంచ్‌లకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమానికి గురువారం కలెక్టర్ హాజరయ్యారు.
ఆసిఫాబాద్, ఫిబ్రవరి 19(ఆంధ్రజ్యోతి): గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్‌ల పాత్ర కీలకమని కలెక్టర్ కె హరిత అన్నారు. కాగజ్‌నగర్ పట్టణంలోని మైనార్టీ సంక్షేమ పాఠశాలలో ఆసిఫాబాద్, కెరమెరి, తిర్యాణి మండలాల నూతన సర్పంచ్‌లకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ కార్యక్రమానికి గురువారం కలెక్టర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధిలో సర్పంచ్‌లదే కీలక భూమికి ఉంటుందని తెలిపారు. ప్రభుత్వం చేపట్టే పలు సంక్షేమ పథకాల అమలులో అర్హులకు అందేలా గ్రామ ప్రథమ పౌరుడిగా కృషి చేయాలని తెలిపారు. గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణ, వీధీ దీపాల ఏర్పాటు, ఇంటి పన్నుల వసూలు అంశాలను పర్యవేక్షించాలన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న అభివృద్ధి పనులు వేగంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు. పలు అభివృద్ధి పనులు త్వరగా పూర్తి అయ్యేలా సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పని చేయాలని తెలిపారు. వేసవిలో తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా కారాచరణ రూపొందించుకోవాలని సూచించారు. గ్రామాల్లో జరిగే సంక్షేమ పథకాలు, పంచాయతీ రాజ్ చట్టాలపై అవగాహన కలిగి ఉండాలన్నారు. అనంతరం ప్రభుత్వ డిగ్రీ కళాశాలను సందర్శించి అదనపు తరగతి గదుల నిర్మాణ పనులను పరిశీలించారు. పనుల పురోగతిపై సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. వేసవి కాలంలో పనులు పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరానికి వినియోగంలోకి వచ్చే విధంగా పనులు వేగవంతంగా చేయాలని సూచించారు. కార్యక్రమంలో డీపీవో భిక్షపతి, డీఎల్‌పీవో ఉమర్ హుస్సేన్, హరిప్రసాద్, ఆర్పీలు, సర్పంచ్‌లు, ప్రిన్సిపాల్, ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు.
తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలి
ఆసిఫాబాద్, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): వేసవిలో తాగునీటి ఎద్దడి లేకుండా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ కె హరిత అన్నారు. సమీకృత కలెక్టరేట్ భవనంలోని తన చాంబర్‌లో వేసవిలో తాగునీటి సరఫరాపై మిషన్ భగీరథ, ఆర్‌డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధికారులతో గురువారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వేసవిలో తాగునీటికి ఇబ్బం దులు కలగకుండా ముందస్తు కార్యాచరణ రూపొందించుకోవాలని సూచించారు. సిర్పూర్(యూ), లింగాపూర్, తిర్యాణి మండలాల్లో మారు మూల గిరిజన గ్రామా లకు నీటి సరఫరాను సక్రమంగా అందించేందుకు పైపులైన్లు, పంపు హౌస్‌లను మరమ్మతులు చేయాల్సి ఉంటే త్వరగా చేపట్టాలని ఆదేశించారు. కెరమెరి మండలంలోని దనోరా, వద్ద డబ్ల్యూపీటీ పాయింట్ నిర్మాణ పనులను ఏప్రిల్ లోగా పూర్తి చేసి ప్రజలకు శుద్ధ జల్లాన్ని అందించాలన్నారు. గ్రామీణ నీటి సరఫరా శాఖ ఆధ్వర్యంలో ఇంటింటికీ నీరు అందించే కార్యక్రమంలో భాగంగా పైపులైన్, ఓవర్ హెడ్ ట్యాంకులు, చేతి పంపులు, బోరు బావులను అందుబాటులోకి తీసుకు రావాలని తెలిపారు. సంబంధిత అధికారులు ప్రజలకు సకాలంలో తాగునీరు అందించి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. సమావేశంలో మిషన్ భగీరథ గిఆడ్ర్ ఈఈ రాకేష్, ఆర్‌డబ్ల్యూఎస్ ఈఈ సిద్దిక్ తదితరులు పాల్గొన్నారు.