kumaram bheem asifabad- ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టు నిర్మించాలి
ABN , Publish Date - Jul 18 , 2026 | 10:57 PM
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును వెంటనే నిర్మించాలని జల సాధన సమితి కన్వీనర్ నైనాల గోవర్థన్ డిమాండ్ చేశారు. కౌటాల ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టుకు గత ప్రభుత్వం పూర్తిగా అన్యాయం చేసిందన్నారు. ఇక్కడి చేపట్టాల్సిన ప్రాజెక్టును కాళేశ్వరానికి తరలించి రీడిజైన్ పేరిట లక్ష కోట్ల నిధులు వృథా చేసిందని చెప్పారు.
కౌటాల/కాగజ్‌నగర్, జూలై 18 (ఆంధ్రజ్యోతి): ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీ మేరకు ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును వెంటనే నిర్మించాలని జల సాధన సమితి కన్వీనర్ నైనాల గోవర్థన్ డిమాండ్ చేశారు. కౌటాల ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టును శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రాణహిత చేవేళ్ల ప్రాజెక్టుకు గత ప్రభుత్వం పూర్తిగా అన్యాయం చేసిందన్నారు. ఇక్కడి చేపట్టాల్సిన ప్రాజెక్టును కాళేశ్వరానికి తరలించి రీడిజైన్ పేరిట లక్ష కోట్ల నిధులు వృథా చేసిందని చెప్పారు. బీఆర్‌ఎస్ ప్రభుత్వం ఇక్కడ ప్రాజెక్టు ఏర్పాటు చేయకుండా కాళేశ్వరంకు తరలించి రీ డిజైన్ పేరుతో కోట్ల రూపాయిలు దోచుకున్నదని మండి పడ్డారు. కాంగ్రెస్ పార్టీ వేసిన కమిషన్ ఇచ్చిన నివేదిక ప్రకారం బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ప్రాజెక్టుపై ఎందుకు ఇంత నిర్లక్ష్యం చూపుతోందని ప్రశ్నించారు. రెండేళ్లు గడిచినా కూడా తట్టెడు మట్ట కూడా తీయని పరిస్థితి దాపురించిందని వాపోయారు. గత ప్రభుత్వం చేసిన అక్రమాలపై వెంటనే విచారణ జరిపి బాధ్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు రెండున్నరేళ్ల కాలంలో తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభించకుండా జాప్యం చేయడాన్ని నిరసిస్తూ త్వరలోనే ఉద్యమ కార్యాచరణ ప్రారంభిస్తామని వివరించారు. సమావేశంలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు కలవేణి శంకర్, సీపీఐ మంచిర్యాల జిల్లా కార్యదర్శి లక్ష్మణ్, సీపీఎం నాయకుడు ప్రకాష్, ముంజం ఆనంద్ కుమార్, న్యూ డెమెక్రసి జిల్లా కార్యదర్శి లాల్ కుమార్, పీఓ డబ్లు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మంగ, రెడ్డి స్టార్ నాయకులు శంకర్, చాంద్ పాషా తదితరులు పాల్గొన్నారు.