ధూపదీప నైవేద్యం భారమే...!
ABN , Publish Date - Mar 10 , 2026 | 10:31 PM
దూపదీప నైవేథ్యం (డీడీఎన్) పథకం కింద వివిధ దేవాలయాల్లో పని చేస్తున్న అర్చకులు అరకొర వేతనాలతో నానా అవస్థలు పడుతున్నారు. ఆలయ నిర్వహణ ఖర్చులూ భారమవుతున్నాయనే భావనలో ఉన్నారు.
-అరకొర వేతనంతో అర్చకుల అవస్థలు
-నెలవారీ భృతి కింద రూ. 6వేలు చెల్లింపు
-ఆలయ నిర్వహణ ఖర్చులకూ ఇబ్బందులు
-అమలుకు నోచుకోని వేతనం పెంపు హామీ
మంచిర్యాల, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): దూపదీప నైవేథ్యం (డీడీఎన్) పథకం కింద వివిధ దేవాలయాల్లో పని చేస్తున్న అర్చకులు అరకొర వేతనాలతో నానా అవస్థలు పడుతున్నారు. ఆలయ నిర్వహణ ఖర్చులూ భారమవుతున్నాయనే భావనలో ఉన్నారు. ఎన్నికల సమయంలో డీడీఎన్‌లో పని చేస్తున్న అ ర్చకుల వేతనాలు పెంచుతామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్ర భుత్వం దాన్ని నెరవేర్చకపోవడంతో కష్టాలు తప్పడంలేదు. రాష్ట్ర వ్యాప్తంగా డీడీఎన్ పథకంలో సుమారు ఆరు వేల మం ది అర్చకులు వివిధ దేవాలయాల్లో పని చేస్తుండగా, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో 360 మంది, మంచిర్యాల జిల్లాలో 120 మంది అన్ని కులాలకు చెందిన వారు పౌరోహిత్యం చేస్తున్నా రు. చాలీ చాలని వేతనాలతో డీడీఎన్ కింద పని చేస్తున్న అర్చకుల పరిస్థితి పేరు గొప్ప....ఊరు దిబ్బ అన్న చందంగా తయారైంది.
రూ.6 వేల భృతితో అవస్థలు...
డీడీఎన్ పథకంలో పని చేస్తున్న అర్చకులకు నెలవారి భృతి కింద ప్రభుత్వం రూ. 6వేల చొప్పున చెల్లిస్తోంది. ఆ వేతనంతో వారికి కుటుంబ పోషణ కష్టసాధ్యంగా మారింది. ఇళ్ల కిరా యలు, పిల్లల చదువులకూ పెద్ద మొత్తంలో వెచ్చించాల్సి రావడంతో ఇబ్బందులు తలెత్తుతున్నాయనే భావనలో ఉన్నా రు. చాలా మంది అర్చకులు వివిధ ఆలయాల్లో పని చేస్తూనే అవకాశం చిక్కినప్పుడల్లా వివాహాలు జరిపించడం, గృహ ప్రవేశాలు, తదితర శుభకార్యాలు నిర్వహిస్తుండగా, డీడీఎన్‌లో పని చేసే వారికి ఆ అవకాశం కూడా ఉండటం లేదనే వ్యాఖ్య లు వినిపిస్తున్నాయి. దీనికి కారణం ప్రతి నిత్యం ఉదయం, సాయంత్రం రెండు పూటలా దీపారాదన చేయాలనే నిబం ధనలు ఉండటం. దీంతో సమయమంతా ఆలయాల్లోనే గడిచిపోయి, ఇతరత్రా పూజలు, పునస్కారాలు చేసుకునే వె సులుబాటు ఉండటం లేదు. దీనికి తోడు ఆయా ఆలయాల కమిటీలు కూడా గుళ్ల అభివృద్ధికి భక్తులు ఇచ్చే కానుకలను హుండీల్లో వేయిస్తుండటంతో ఆర్థిక ఇబ్బందులు ఏర్పడుతు న్నట్లు పలువురు అర్చకులు వాపోతున్నారు. ముఖ్యంగా కొం డలు, గుట్టలపై ఉన్న ఆలయాల అర్చకుల పరిస్థితి మరింత దయనీయంగా ఉందనే అభిప్రాయాలు ఉన్నాయి. అలాంటి ప్రదేశాలకు భక్తులు సందర్భాన్ని బట్టి వస్తారు కనుక, నిత్యం దక్షిణలు దొరికే అవకాశం లేదంటున్నారు.
ఆలయ నిర్వహణ ఖర్చులకూ ఇబ్బందే....
ఆలయాల నిర్వహణ ఖర్చుల కింద ప్రభుత్వం నెలకు రూ. 4వేలు చెల్లిస్తోంది. దానితోనే నెల రోజులు ఆలయాన్ని నిర్వ హించాల్సి ఉంటుంది. నిత్యం దీపారాదనకు అవసరమైన ను వ్వుల నూనె ధరలు మండిపోతున్నాయి. ప్రస్తుతం లీటర్ ను వ్వుల నూనే బాటిల్ ధర రూ. 130 వరకు ఉంది. ఇతరత్రా పూజా సామగ్రి కొనుగోళ్లకు అయ్యే ఖర్చులన్నీ అధికంగానే ఉండగా, నిర్వహణ భారం అవుతుందని డీడీఎన్ అర్చకులు వాపోతున్నారు. పైగా ఇతర ప్రాంతాల్లో నివాసం ఉంటూ ఆ లయానికి రానుపోనూ ఖర్చులతోపాటు, ఆలయాన్ని శుభ్రం చేసేందుకు సహాయకులకు కొంత మొత్తం ఇవ్వాల్సి రావడం తో కొన్నిసార్లు ఖర్చులు సొంతంగా భరించాల్సి వస్తోందని, ప్ర భుత్వం చెల్లించే వేతనం, ఇతర ఖర్చులు ఏ మాత్రం స రిపోవడం లేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. పౌరో హితానికి అలవాటు పడిన వారు ఇతరత్రా పనులు చేసుకు నేందుకు మొగ్గు చూపరు. దీంతో ఆర్థికంగా కుంగి పోవలసిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రభుత్వం కొంత వరకైనా వేతనా లు, ఆలయ నిర్వహణ ఖర్చులు పెంచితే కొద్దిగా వెసులుబా టు ఉంటుందని, ఆ దిశగా ప్రభుత్వ పెద్దలు ఆలోచనలు చేయాలనే విజ్ఞప్తులు ఉన్నాయి.
వేతనాలు పెంచాలి....
డీడీఎన్ సంఘం జిల్లా అధ్యక్షుడు రామ్మోహన్ శర్మ
ఎన్నో ప్రజాహిత కార్యక్రమాలు చేపడుతున్న ప్రభుత్వం అర్చకులను కూడా ఆదుకోవలసిన అవసరం ఉంది. డీడీఎన్ లో పని చేస్తున్న అర్చకుల వేతనాలు పెంచుతామన్న హామీ ఇచ్చినందున దాన్ని వీలైనంత త్వరగా అమలు చేయాలి. అర్చకులకు ఇప్పుడు చెల్లిస్తున్న రూ. 6వేల వేతనం పిల్లల చదువులకే సరిపోవడం లేదు. ప్రభుత్వం ఇప్పటికైనా సాను కూల దృక్పథంతో నెలవారీ వేతనాలను రూ. 15వేలు, ఆలయ నిర్వహణ ఖర్చులు రూ. 5వేలకు పెంచితే కొంతవరకైనా నెట్టుకు వచ్చేందుకు వెసులుబాటు కలుగుతుంది.