Share News

kumaram bheem asifabad- భోజనంలో మెనూ పాటించాలి

ABN , Publish Date - Mar 12 , 2026 | 11:17 PM

విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మెనూ ప్రకారం భోజనంతో పాటు నాణ్యమైన విద్యను అందించాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ బాలికల పాఠశాలను గురువారం కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాల, వంట గదిని, సరుకుల నిలువ గదిని, తరగతి గదులను పరిశీలించారు

kumaram bheem asifabad- భోజనంలో మెనూ పాటించాలి
విద్యార్థులతో కలిసి అల్పాహారం చేస్తున్న కలెక్టర్‌ కె హరిత

ఆసిఫాబాద్‌, మార్చి 12 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన మెనూ ప్రకారం భోజనంతో పాటు నాణ్యమైన విద్యను అందించాలని కలెక్టర్‌ కె హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని గిరిజన ఆదర్శ బాలికల పాఠశాలను గురువారం కలెక్టర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాల పరిసరాల, వంట గదిని, సరుకుల నిలువ గదిని, తరగతి గదులను పరిశీలించారు. వంట శాల పరిశుభ్రంగా ఉండే విధంగా సరుకులు క్రమ పద్ధతిగా ఉంచాలని సూచించారు. మెనూ పట్టికను పరిశీలించి మెనూలో పేర్కొన్న విధంగా అందిస్తున్నారా అని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. ప్రతి రోజూ మెనూలో ఉన్న ప్రకారం ఆహారం అందించాలన్నారు. విద్యార్థులకు కలెక్టర్‌ స్వయంగా అల్పాహారం వడ్డించి విద్యార్థులతో కలిసి స్వీకరించారు. అనంతరం మాట్లాడుతూ విద్యార్థులు క్రీడల్లో నైపుణ్యతను ప్రదర్శించి జిల్లాకు వన్నె తీసుకు రావాలన్నారు. క్రీడలతో పాటు విద్యలో రాణించాలన్నారు. వేసవి తీవ్రత దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ప్రభుత్వ వసతి గృహాలు, సంక్షేమ గురుకుల పాఠశాలలో సరిపడా వసతులు కల్పించాలని సూచించారు. విద్యార్థులకు కాస్మోటిక్‌ చార్జీలను ప్రభుత్వం భారీగా పెంచిందన్నారు. విద్యార్థులు వాటిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. క్రమశిక్షణతో చదవి ఉన్నత స్థానంలో నిలిచి తల్లిదండ్రులకు మంచి పేరును తీసుకు రావాలని తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

భూ సమస్యలు పరిష్కరించాలి

జిల్లాలోని భూ సమస్యల పరిష్కారానికి అధికారులు సమన్వయంతో కృషి చేయాలని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని సమీతకృత జిల్లా కలెక్టరేట్‌ భవన సమావేశ మందిరంలో బుధవారం సర్వే ల్యాండ్‌ రికార్డ్‌ శాఖ ఆధ్వర్యంలో రెండో విడత లైసెన్స్‌ సర్వేయర్లకు నిర్వహించిన 50 రోజుల శిక్షణ అనంతరం నిర్వహించిన పరీక్షలలో ఎంపికైన 53 మంది లైసెన్స్‌డ్‌ సర్వేయర్లకు పత్రాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ భారతి చట్టంలో భాగంగా జరిగే విరాసత్‌ పార్టిషన్‌, కొనుగోలు వంటి పట్టా మార్పిడి ప్రక్రియలో లోకేషన్‌ మ్యాప్‌ జత చేయాల్సి ఉందన్నారు. ఎక్కడ కూడా పొరపాట్లకు తావు లేకుండా చర్యలు చేపట్టాలని తెలిపారు. ప్రభుత్వం చేపట్టే భూ సర్వే ప్రక్రియలో మండల సర్వేయర్‌ సహాయకుడిగా పని చేయాల్సి ఉంటుందని అన్నారు. భూ సమస్యల పరిష్కారానికి సర్వేయర్లు కీలకమని తెలిపారు. కార్యక్రమంలో ల్యాండ్‌ సర్వే ఏడీఏ వినయ్‌, మండల సర్వేయర్లు, లైసెన్సుడ్‌ సర్వేయర్లు తదితరులు పాల్గొన్నారు.

మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

మైనార్టీల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కలెక్టర్‌ కె.హరిత అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో గురువారం అధికారికంగా మైనార్టీలకు నిర్వహించిన ఇఫ్తార్‌ విందులో ఎమ్మెల్సీ దండే విఠల్‌, ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఏఎస్పీ చిత్తరంజన్‌, మున్సిపల్‌ చైర్మన్‌ అకాష్‌, వైస్‌ చైర్మన్‌ ఎండీ అహ్మద్‌, ఏఎంసీ చైర్మన్‌ మంగతో కలిసి కలెక్టర్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రంజాన్‌ పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం మైనార్టీలతో కలిసి విందులో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆర్డీవో లోకేశ్వర్‌ రావు, డీసీసీ అధ్యక్షురాలు సుగుణ, కాంగ్రెస్‌ నియోజకవర్గ ఇన్‌చార్జి శ్యాంనాయక్‌, మాజీ డీసీసీ అధ్యక్షుడు విశ్వ ప్రసాద్‌, మైనార్టీ శాఖ జిల్లా అధికారి నదీం పాల్గొన్నారు.

Updated Date - Mar 12 , 2026 | 11:17 PM