Share News

రైతు వేదికల నిర్వహణ అస్తవ్యస్తం

ABN , Publish Date - Jan 28 , 2026 | 12:19 AM

జిల్లాలో రైతువేదికల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది.

రైతు వేదికల నిర్వహణ అస్తవ్యస్తం
భువనగిరి మండలం రాయిగిరి క్లస్టర్‌ ముత్తిరెడ్డిగూడెం రైతు వేదిక భవనం

ఏఈవోలపైనే నిర్వహణ భారం

జిల్లాలో రైతువేదికల నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైంది. రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూ రు చేయకపోవడంతో వ్యవసా య విస్తరణ అధికారులు(ఏఈవో)లు సొంత నిధులతో వాటిని నిర్వహించే పరిస్థితి నెలకొంది. ఫలితంగా శాస్త్రవేత్తలు, వ్యవసా య అధికారుల ద్వారా రైతులకు సాగులో మెళకువలు, ఆధునిక పద్ధతులను చేరువ చేయాలనే లక్ష్యం నీరుగారిపోతోంది.

- (ఆంధ్రజ్యోతి-భువనగిరి రూరల్‌)

వ్యవసాయంలో రైతులకు సలహాలు,సూచనలు ఇవ్వడంతో ఆధునాతన పద్ధతులను పరిచయం చేసేందుకు రైతు వేదికలను నిర్మించారు. వివిధ అంశాలపై రైతులతో సమావేశం నిర్వహించి,వారికి అవగాహన కల్పించాల్సి ఉం టుంది.అయితే ఈవేదిక నిర్వహణకు నెలకు రూ.9వేల చొ ప్పున నిధులు విడుదల చేస్తామని 2020 ఏప్రిల్‌లో ప్రభు త్వం ప్రకటించింది. అయితే 2022 నవంబరులో 5 నెలల కు సంబంధించి రూ.45వేలచొప్పున నిధులు విడుదలచేసింది.

కనీస వసతులు కరువు..

విద్యుత్‌ బిల్లులు, కనీస మరమ్మతులు చేసే పరిస్థితి లేకుండాపోయింది. స్టేషనరి, తాగునీటి ఖర్చులన్నీ ఏఈవోలే తమ వేతనాల నుంచి చెల్లిస్తూ ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సహాయకులు కూడా అందుబాటులో లేకపోవడంతో వారే అన్ని పనులు చక్కబెట్టాల్సి వస్తోంది. వీడియోకాన్ఫరెన్స్‌ల ద్వారా సమీక్షల నిర్వహణకు మండలానికో వేదిక ఏర్పాటుచేసినా పరికరాల మరమ్మతులకు ఇబ్బందులు తప్పడం లేదు. పలుచోట్ల సీలింగ్‌ ప్యాన్లు, రెక్కలు ఊడిపోవడం, కిటికీలు, టైల్స్‌ దెబ్బతిని ఉండడంతో ఆవరణలో పిచ్చి మొక్కలు ఏపుగా పెరిగిపోయాయి. సరైన పర్యవేక్షణ లేక పలు వేదికలు మందుబాబులకు అడ్డాగా మారుతున్నాయి.

ప్రభుత్వం నుంచి నిధులు రావల్సి ఉంది..

రైతువేదికల్లో ఇబ్బందులపై ఉన్నతాధికారులకు ఫిర్యాదులు అందుతున్నాయి. వీటి నిర్వహణకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయాల్సి ఉంది.

- డీఏవో రమణారెడ్డి

సహాయకులను నియమించాలి

ప్రతి రైతువేదికకూ ఓ సహాయకుడిని నియమించాలి. పెరిగిపోతు న్న విద్యుత్‌ బకాయిలను విడుదల చేయాలి. వీడియోకాన్ఫరెన్స్‌కు సంబంధించి ఎలక్ర్టానిక్‌ పరికరాలకు మరమ్మతులు చేయాలి. ప్రతి నెలా నిర్వహణ నిధులు మంజూరు చేయాలి.

- జెల్ల నరేశ్‌, ఏఈవోల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు

Updated Date - Jan 28 , 2026 | 12:19 AM