Share News

kumaram bheem asifabad- చెప్రాలలో భక్తుల సందడి

ABN , Publish Date - Jan 11 , 2026 | 10:09 PM

తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో నెలకొన్న చెప్రాల ఆధ్యాత్మిక కేంద్రం భక్తుల కొంగుబంగారంగా మారింది. ఒక పక్క ప్రాణహిత పరవళ్లు మరోపక్క దట్టమైన అటవీ ప్రాంతం అలరించే ప్రకృతి అందాల మధ్య నెలకొని ఉంది చెప్రాల. పచ్చని అడవులు, నదుల ప్రశాంతత ఇస్తుండడంతో భక్తులు ఎక్కువ సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటారు. భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారంగా మారింది

kumaram bheem asifabad- చెప్రాలలో భక్తుల సందడి
మహారాష్ట్రలోని చెప్రాల ఆధ్యాత్మిక కేంద్రం

బెజ్జూరు, జనవరి 11 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ-మహారాష్ట్ర సరిహద్దుల్లో నెలకొన్న చెప్రాల ఆధ్యాత్మిక కేంద్రం భక్తుల కొంగుబంగారంగా మారింది. ఒక పక్క ప్రాణహిత పరవళ్లు మరోపక్క దట్టమైన అటవీ ప్రాంతం అలరించే ప్రకృతి అందాల మధ్య నెలకొని ఉంది చెప్రాల. పచ్చని అడవులు, నదుల ప్రశాంతత ఇస్తుండడంతో భక్తులు ఎక్కువ సంఖ్యలో రాకపోకలు సాగిస్తుంటారు. భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారంగా మారింది. బెజ్జూరు సరిహద్దుల్లో గల మహారాష్ట్రలోని గడిచిరోలి జిల్లా చాముర్షి తాలుకాలో చెప్రాల ఆధ్యాత్మిక కేంద్రం కొలువై ఉంది. దట్టమైన అభయారణ్యలో ఉన్నా భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు ఉండవు. ఇక్కడికి నిత్యం తెలంగాణలోని పలు ప్రాంతాల నుంచే కాకుండా మహారాష్ట్ర నుంచి భక్తులు వస్తుంటారు. హనుమాన్‌ ఆలయంలో భక్తులు పూజలు, భజనలు చేస్తారు.

- ఇది ఆలయ చరిత్ర..

మహారాష్ట్రలోని గడిచిరోలి జిల్లా చాముర్షి తాలుకాలోని చెప్రాల అటవీ ప్రాంతానికి 1951లో కార్తీక స్వామి అనే ఆధ్యాత్మిక వేత్త వచ్చాడు. కార్తీక స్వామి ఎక్కడి నుంచి వచ్చాడో ఇప్పటికి ఎవ్వరికి తెలియదు. అటవీ ప్రాంతంలో ఉండే పండ్లు తింటూ ఉండేవారని అక్కడ ఉన్న హనుమాన్‌ విగ్రహానికి రోజు పూజలు చేసేవారని ప్రజలు చెబుతుంటారు. పక్కనే ఉన్న ప్రాణహిత నదిలో స్నానాలు ఆచరించి పూజలు చేస్తుండేవాడు. ఇలా రోజు పూజలు చేస్తున్న కార్తీక స్వామిని చూసి ఆయన భక్తులుగా మారారు. కార్తీక స్వామి అక్కడే ఉంటూ మరిన్ని ఆలయాలు ఏర్పాటు చేయించాడు. అక్కడి ఆలయంలో శివాలయం, శ్రీకృష్ణుడు, దుర్గామాత, శ్రీరాముడు, సాయిబాబ, గజానన్‌బాబా తదితర ఆలయాలు నిర్మించేలా కృషి చేశాడు. దీంతో సమీప ప్రాంతాల్లోనే కాకుండా మహారాష్ట్ర, తెలంగాణ రాష్ర్టాల్లోని పలు ప్రాంతాల్లో ఆయనకు భక్తులు ఏర్పడ్డారు. పలు ప్రాంతాల్లో నూతన ఆలయాలు ప్రతిష్టాపన సందర్బంగా పలు ప్రాంతాలకు వెళ్లేవాడు. 2013ఫిబ్రవరిలో కార్తీక స్వామి స్వర్గస్తులయ్యారు. కార్తీక స్వామికి భక్తులు ఆలయంలోనే సమాది ఏర్పాటు చేశారు. భక్తులంతా ఆయన సమాది వద్ద ప్రత్యేక పూజలు చేస్తారు. కార్తీక స్వామి అంటే రెండు రాష్ర్టాల భక్తులకు ఎనలేని నమ్మకం. ఏ ఆపద వచ్చినా ఆయనను దర్శించుకుంటే తొలగిపోతాయనేది వారి నమ్మకం. చెప్రాల ఆధ్యాత్మికత ఆహ్లాదంతో కూడి ఉంటుంది. ప్రాణహిత పెన్‌గంగ నదుల చెంతనే ఉండటంతో అక్కడికి వెళ్లే భక్తులు నదిలో స్నానాలు ఆచరించి పూజలు చేస్తుంటారు. విద్యార్థులు విహారయాత్రకు వస్తుంటారు. పలు ప్రాంతాల నుంచి భక్తులు పాదయాత్రలు చేసి అక్కడే రాత్రి బస చేసి భజనలు, భోజనాలు చేస్తారు. ఇక్కడికి వచ్చే భక్తులకు బస చేసేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆలయ కమిటి గదులు నిర్మించింది.

- పండగల వేళ రద్ధీ అధికం..

చెప్రాల ఆధ్యాత్మిక కేంద్రంలో సండగల వేళ భక్తుల రద్ది అధికంగా ఉంటుంది. శ్రీరామనవమి, హనుమాన్‌ జయంతి, మహాశివరాత్రి, కార్తీక పౌర్ణమి పర్వదినాల్లో వేడుకలు ఘనంగా జరుపుకుంటారు. మహారాష్ట్రలోనే కాకుండా తెలంగాణ ప్రాంతం నుంచి భక్తులు తరలి వస్తుంటారు. అంతే కాకుండా మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని మూడు రోజుల పాటు జాతర ఉత్సవాలు ఘనంగా జరుపుతారు. జాతర ఉత్సవాలకు పలు ప్రాంతాల నుంచి భక్తులు వచ్చి మొక్కులు చెల్లించుకుంటారు. ప్రతిఏటా నిర్వహించే ఉత్సవాలకు భక్తుల రద్ది అధికంగా ఉంటుంది. ఇక్కడి ప్రాంతంలో మహాశివరాత్రి, శ్రీరామనవమి, హనుమాన్‌ జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుతారు. ఈ వేడుకల కోసం అనేక ప్రాంతాల నుంచి వచ్చి బస చేసి వారి మొక్కులు చెల్లించుకుంటారు.

- కొనసాగుతున్న పాదయాత్ర..

మహారాష్ట్రలోని చెప్రాల ఆధ్యాత్మిక కేంద్రానికి పలు ప్రాంతాల నుంచి భక్తులు ప్రతి ఏటా భక్తులు పాదయాత్ర నిర్వహిస్తుంటారు. బెజ్జూరు మండలంలోని ఎల్కపల్లి అభయాంజనేయ ఆలయం నుంచి ప్రతి జనవరి 17,18తేదీల్లో భక్తులు పాదయాత్రగా వెళ్తారు. డిసెంబరు 31న మంచిర్యాల నుంచి భక్తులు పాదయాత్ర కొనసాగిస్తుంటారు. మంచిర్యాల జిల్లా నుంచి కన్నెపల్లి, వేమనపల్లి మండలాల నుంచి పాదయాత్రలు చేస్తుంటారు. ఇలా అక్కడికి పాదయాత్రగా వెళ్లే భక్తులు ఆలయాల్లో మొక్కులు చెల్లించి అక్కడే బస చేసి ఘనంగా పూజాకార్యక్రమాలు నిర్వహిస్తారు.

Updated Date - Jan 11 , 2026 | 10:09 PM