kumaram bheem asifabad- ప్రజల భూములను ప్రభుత్వమే కబ్జా
ABN , Publish Date - Sep 04 , 2026 | 10:49 PM
ప్రభుత్వం పేదల భూములకు పట్టాలివ్వాల్సింది పోయి ప్రభుత్వమే ప్రజల భూములను కబ్జా చేస్తుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు అన్నారు. కౌటాల మండల కేంద్రంలోని మినీ స్టేడియం ఆవరణలో శుక్రవారం బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 22ఏ నిషేధిత భూముల జాబితాను నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో నిర్వహించిన సిర్పూర్ నియోజకవర్గ స్థాయి రైతు సదస్సులో ఆయన మాట్లాడారు.
- రైతుల పక్షాన నిలబడి సర్కారు మెడలు వంచుతాం
- కౌటాల రైతు సదస్సులో మాజీ మంత్రి హరీష్‌రావు
ఆసిఫాబాద్/ఆసిఫాబాద్‌రూరల్/కౌటాల, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వం పేదల భూములకు పట్టాలివ్వాల్సింది పోయి ప్రభుత్వమే ప్రజల భూములను కబ్జా చేస్తుందని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు అన్నారు. కౌటాల మండల కేంద్రంలోని మినీ స్టేడియం ఆవరణలో శుక్రవారం బీఆర్‌ఎస్ పార్టీ ఆధ్వర్యంలో 22ఏ నిషేధిత భూముల జాబితాను నిరసిస్తూ మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆధ్వర్యంలో నిర్వహించిన సిర్పూర్ నియోజకవర్గ స్థాయి రైతు సదస్సులో ఆయన మాట్లాడారు. సూర్యుడి చుట్టూ భూమి ఏ విధంగా తిరుగుతుందో భూముల చుట్టూ సీఎం రేవంత్‌రెడ్డి తిరుగుతున్నారని ఎద్దేవా చేశారు. ప్రజలే కేంద్ర బిందువులుగా కేసీఆర్ పాలన కొనసాగగా భూములే కేంద్ర బిందువుగా రేవంత్ పాలన కొనసాగుతుందని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 15 లక్షల ఎకరాలు, లక్షలాది ఇళ్లు, స్థలాలు 22ఏ నిషేధిత జాబితాలో పెట్టి ప్రజల ఉసురు పోసుకుంటున్నారన్నారు. సిర్పూర్ నియోజకవర్గంలో 42,867 ఎకరాల భూమి నిషేధిత జాబితాలో పెట్టడం ఇందుకు నిదర్శమన్నారు. భూములు నిషేధిత జాబితాల్లో పెట్టడం ద్వారా రైతులకందే సంక్షేమ పథకాలు, బ్యాంకు రుణాలు అందకుండా పోతున్నాయన్నారు. కేసీఆర్ పోడు భూములకు పట్టాలిస్తే రేవంత్ సర్కార్ ఉన్న భూములను రైతుల నుంచి తీసుకుంటుందని ఆరోపించారు. ఏడాది క్రితం రాష్ట్ర ప్రభుత్వమే కలెక్టర్లకు ప్రతి జిల్లాలో ఉన్న నిషేదిత భూముల జాబితా పంపమని ఆర్డర్ జారీ చేసిందన్నారు. ఎన్నో ఏళ్లుగా వారసత్వంగా వచ్చిన, పట్టా భూములను 22ఏ నిషేధిత భూముల జాబితా కింద పెట్టిందన్నారు. ప్రభుత్వం తప్పు చేసి ప్రజలకు శిక్ష విదిస్తుందన్నారు. ప్రజల భూములను నిషేధిత జాబితాలో పెట్టిన పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని అసెంబ్లీకి రాకుండా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇళ్లు కూడా నిషేధిత జాబితాలో ఉంటే రాత్రికిరాత్రే తొలగించారని చెప్పారు. సీఎం ఇంటిని నిషేధిత జాబితాలో నుంచి ఎలా తొలగించారో సిర్పూర్ నియోజకవర్గంలో ఉన్న 42,867 ఎకరాల భూములను కూడా అలాగే తొలగించాలన్నారు. లేని పక్షంలో లక్షలాది మంది ప్రజలతో అసెంబ్లీని ముట్టడిస్తామని అన్నారు. అక్కడ సీఎం లేకుంటే జూబ్లీహిల్స్‌లోని ఆయన పాలేస్‌ను ముట్టడిస్తామన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తే కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనలో ఇచ్చిన హామీలను నెరవేర్చలేకపోయిందన్నారు. మూడేళ్ల కాలంలో ఒక్కరోడ్డు కూడ వేయలేదని బిల్లులు రావడంలేదని ఎవరు కూడా టెండరు వేయడంలేదన్నారు. ఈనెల 7 నుంచి జరిగే అసెంబ్లీ సమావేశల్లో 22ఏ నిషేధిత భూములను ఎత్తివేయాలని ప్రస్తావించి ప్రభుత్వం మెడలు వంచి రైతుల పక్షాన నిలబడతామన్నారు. అంతకు ముందు నియోజకవర్గంలోని ఆయా మండలాలకు చెందిన పలువురు రైతుల భూములు నిషేధిత జాబితాలో చేరడంతో వారు పడుతున్న ఇబ్బందులను అడిగి తెలుసుకొని దరఖాస్తులను స్వీకరించారు. బీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ వెయ్యి రోజుల కాంగ్రెస్ పాలనలో ప్రజా సమస్యలు పరిష్కరించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. 22ఏ నిషేదిత భూముల విషయంలో సిర్పూర్ ఎమ్మెల్యే స్పందించకపోవడం విచారకరమన్నారు. ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి మాట్లాడుతూ ప్రభుత్వం నిషేదిత భూముల పేరిట రైతులను తీవ్ర ఇబ్బందులు పెడుతుందన్నారు. వచ్చే అసెంబ్లీ సమావేశాల్లో ఈ విషయాన్ని ప్రస్తావిస్తాను. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప మాట్లాడుతూ కేసీఆర్ పాలనలోనే నియోజకవర్గం అభివృద్ధి చెందిందన్నారు. 42 వంతెనలు, 250 కిలోమీటర్ల డబుల్‌రోడ్లు, 300 కిలోమీటర్ల కొత్తరోడ్లు, డయాలసీస్ కేంద్రం మంజూరు, ఎస్పీఎం పునరుద్ధరించిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. అంతకు ముందు కౌటాల మండల కేంద్రానికి చేరుకున్న హరీష్‌రావుకు నాయకులు, కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు. ఈ సందర్భంగా అంబేద్కర్, కుమరం భీం విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, దివాకర్‌రావు, దుర్గం చిన్నయ్య, జడ్పీ మాజీ చైర్మన్ కోనేరు కృష్ణారావు, ఫిలిం డెవలప్‌మెంట్ మాజీ ఛైర్మన్ రాంమోహన్‌రావు, బీఆర్‌ఎస్ నాయకులు రాము, శంకర్, మఽధుకర్, గోపాల్, సత్యనారాయణ, విద్యావతి, తిరుపతి, బాపు, ఫణిందర్‌గౌడ్, సంతోష్, రవిందర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు.